Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Saturday, May 19, 2012

మహానేతకు ఇదా నివాళి?

ఈ రోజుల్లో మనం చూస్తున్నవి రాజకీయాలే కాదు! ప్రజాక్షేమం కోసం సర్వస్వాన్ని అర్పించి, నిజాయితీతో బతికి, అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయులెందరో రాజకీయాల్లో ఉండేవారు. వారిలో తెలుగునేలపై పుట్టి, యావత్ భారత ప్రజల జేజేలందుకున్న నీలం సంజీవరెడ్డి అగ్రగణ్యులు. నేడు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరిద్దాం.


"గాం«ధీ వంటి నైతిక విలువలున్న మహనీయుడూ, మహాత్ముడూ మళ్లీ పుట్టాలి. జాతీయ, ప్రాంతీయ సమస్యలన్నిటికీ అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. నా దగ్గర కొచ్చే జిల్లాల రాజకీయ నాయకులందరికీ నిక్కచ్చిగా చెపుతున్నాను-ఈ హత్యలేమిటి? పదవుల కోసం ఇంత నైతికంగా దిగజారటమేమిటి? ప్రజలను తక్కువగా అంచనా వెయ్యకండి. ఎప్పుడో ఒకసారి ఎదురు తిరిగి తగిన బుద్ధి చెపుతారు. జాగ్రత్త... ఏమిటీ కోట్ల సంపాదన? ఎందుకింత కూడబెట్టటం? బ్రతకడానికి ఇంత అవసరమా?'' అంటూ మాజీరాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్టీనేతలను నిలదీసేవారు. ఈ కాలంలో అలాంటి నేతలు కనిపించరు. అలాంటి హితవాక్యాలు మచ్చుకైనా వినిపించవు. కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదాయన. నిరాడంబరంగా జీవించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.


సి.ఎం. పదవి తృణప్రాయం
1914 మే 19వ తేదీన అనంతపురం జిల్లా అల్లూరులో రైతు కుటుంబంలో జన్మించిన ఈ మహానేత 18 సంవత్సరాల చిరు వయస్సులోనే సత్యాగ్రహం నిర్వహించటం ద్వారా వెలుగులోకి వచ్చారు. 25 సంవత్సరాల వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ ప్రొవెన్షియల్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శిగా ఎన్నికై 10 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 1940-45 సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం, వి.వి.గిరి తదితరులతో అనేకసార్లు జైల్లో సహజీవనం చేశారు. 1947లో భారత రాజ్యాంగ పరిషత్‌లో కీలక పదవిలో ఉండి, రాజ్యాంగ రచనలో ముఖ్యపాత్రను నిర్వర్తించారు.


1953లో ఉపముఖ్యమంత్రిగా, 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1959లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, 1962లో తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్సు రూట్ల జాతీయకరణపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావటంతో నెహ్రూ వద్దని ఎంతగా వారిస్తున్నా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించారు. కేంద్రమంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు. 1967లో లోక్‌సభ స్పీకరుగా ఆ పదవికే వన్నెతెచ్చారు. ఎమర్జెన్సీ తరువాత 1977 జూలై 13వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.


నిరాడంబరుడు నీలం
రాష్ట్రపతి భవన్‌లో ఉన్న 5 సంవత్సరాలూ బంగారు పంజరంలో బందీగా ఉన్నట్టు బాధపడిపోయేవారు సంజీవరెడ్డి దంపతులు. అన్ని వందల గదులున్న రాష్ట్రపతి భవనంలో కేవలం మూడు గదులను మాత్రమే వారి కోసం కేటాయించుకున్నారు. ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడటం నిజంగా నా అదృష్టం. 1996వ సంవత్సరం మే 19వ తేదీన అంకుల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి జన్మదినం సందర్భంగా- ఎప్పటిలాగే శుభాకాంక్షలు చెప్పాలని బెంగళూర్ ఫోన్ చేశాను. అంకుల్ ప్రేమపూరితమైన పిలుపు వింటుంటే కళ్ల నీళ్లు తిరిగాయి.


"వారం రోజులు శలవు పెట్టి రా కృష్ణా! మీ ఆంటీ కూడా ఎదురుచూస్తోంది''- సమాధానంగా కళ్లు వర్షించాయి. 50 సంవత్సరాల పైగా మా కుటుంబాల మధ్యన పెనవేసుకుపోయిన గాఢానుబంధం అటువంటిది. నా తండ్రి కాజ జగన్నాథరావు, సంజీవరెడ్డి అంకుల్ ప్రాణ స్నేహితులు. ఒక విధంగా చెప్పాలంటే-అంకుల్, మా ఆంటీ నాగరత్నమ్మగారూ-నాకు పెంపుడు తల్లిదండ్రులు.


నా కోరిక ప్రకారం అంకుల్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు(1962లో) కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో సీటు తెప్పించి-నాన్నగారితోబాటు స్వయంగా వచ్చి-నన్ను కాలేజ్‌లో అడ్మిట్ చేశారు. క్లినికల్స్ లోకి అడుగు పెట్టినప్పుడు స్వయంగా స్టెతస్కోప్ పంపించి ఆశీర్వదించారు. అతి చిన్న వయస్సులోనే నాన్నగారు శాశ్వతంగా దూరమైతే-ఇంటి పెద్దగా అండగా నిలిచారు. అంకుల్ రుణాన్ని నేను తీర్చుకోగలనా?


సర్వస్వం దేశం కోసం..
అంకుల్‌కు, దగ్గరవారికి ఆంటీనే స్వయంగా వంట చేసేవారు. తమ్ముళ్లతోసహా కొన్ని రోజులు రాష్ట్రపతి భవన్‌లో ఉండే అదృష్టం నాకు కలిగింది. అంకుల్ రామభక్తులు. వెంకటేశ్వరస్వామి భక్తులు కూడా. ప్రొద్దుటే స్నానం చేసి పూజ చేసుకునే బయటకు వెళ్లేవారు. తరిమెలలోని రామాలయంకు బావ నాగిరెడ్డితో కలిసి తరచుగా వెళ్లి ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. ఈ దేశం కోసం ఆ మహానేత ఎంతో చేశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన సర్వస్వం ధారపోశారు.


తుంగభద్ర, నాగార్జునసాగర్, శ్రీశైలం మొదలైన ఎన్నో ప్రాజెక్టుల ఆవిర్భావానికి నిద్రాహారాలు మాని కృషిచేశారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక-అనంతపురంలో ఉండగా, జ్ఞానీ జైల్‌సింగ్, వెంకట్రామన్, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్.టి.ఆర్ వంటివారు ఈ రాజనీతిజ్ఞుని సందర్శించి తగిన సలహాలను పొందేవారు. ఆయన తరచు నాతో అనేవారు, "కృష్ణా! మనిషన్న తరువాత కృతజ్ఞతా భావం ఉండాలి. అది లేనివాడు మనిషనిపించుకోడు''అని. కన్నకూతురిలా చూసుకున్న అంకుల్ వర్ధంతి సభలని ఇన్నేళ్లుగా నిర్వహిస్తున్నప్పుడు నాకనిపించేది... అనిపిస్తోంది...ఈ రాష్ట్రానికి ఎంతో చేశారే మహానుభావుడు... కాని, కనీస కృతజ్ఞతనేది చూపిస్తున్నారా ఎవరైనా?!


నివాళి ఇదేనా?
ఆయన చివరి రోజుల్లో ఒక కోరిక కోరారు. "నేను భారతీయుడిని. ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వాడిని కాను. అందుకే నా మరణానంతరం నేనెక్కడుంటే అక్కడే నా అంత్యక్రియలు జరిపించండి'' అని. ఆయన ఆఖరి కోరిక నెరవేరింది. ఎన్నో సంప్రదింపుల తరువాత, సుదీర్ఘ తర్జన భర్జనల తరువాత, చివరికి హైదరాబాద్‌లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.


అంతటి మహానేతకు, అంతటి త్యాగమూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, రాష్ట్ర ప్రజలూ అర్పించే నివాళి ఇదేనా? ఇంతేనా?! ఘనంగా నిర్వహించాల్సిన, చూపించాల్సిన కృతజ్ఞత తాలూకు చిహ్నాలేవీ? మే 19వ తేదీన ఈ త్యాగధనుని జయంతిని, జూన్ మొదటి తేదీన వర్ధంతినీ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, దేశాధినేత అయిన ఆ రాజనీతిజ్ఞుని చిత్రపటాన్ని జూబ్లీ హాల్లో ఆవిష్కరించాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాను-చేస్తూనే ఉంటాను. 
from: Andhrajyothi Daily

Sunday, December 11, 2011

అనుములనే అమ్మ అనుకున్నాను ...... కుందురు జానారెడ్డి సొంతూరు కథ

మూడేళ్ల వయసప్పుడే అమ్మ చనిపోయింది. అప్పుడు 'అనుముల' గ్రామమే అమ్మ ఒడయ్యింది. జీవితపు దారుల్లో నడిపించింది. నాయకుడిగా తీర్చిదిద్దింది. దాంతో తల్లికి చేయాల్సిన సేవలన్నీ ఆయన అనుముల ఊరికి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందురు జానారెడ్డి సొంతూరు కథ ఇది. ఆయన చెబుతున్న అనుముల కబుర్లే ఈ 'మా ఊరు'


"ఊళ్లోకి జింకల గుంపు వచ్చిందని తెలియగానే చేతిలో ఉన్న పుస్తకాలు విసిరేసి పరిగెట్టేవాడ్ని. కుర్రాళ్లందరం కలిసి నాలుగు రాళ్లు వేయగానే జింకలన్నీ పరుగందుకునేవి. రోజుల వయసున్న జింక కూనలు పరిగెట్టలేక పొదల్లో చిక్కుకుని ఉండిపోయేవి. వాటిని పట్టుకుని ఇంటికి తెచ్చుకునేవాడ్ని. జీతగాడ్ని పిలిచి మేకపాలు తీయించి కొబ్బరిచిప్పలో పోసి జింక పిల్లకి తాపేవాడ్ని. అలా నాలుగైదు నెలలు సాకి మళ్లీ జింకల గుంపుల్లో వదిలేసేవాడ్ని. ఇప్పుడు మా ఊళ్లో మేకపిల్లలే కనిపించడం లేదు ఇక జింకలెక్కడుంటాయి. జూపార్కుకి వెళ్లాలి(నవ్వుతూ...) ఊరు పేరు చెప్పగానే నాకు గర్తొచ్చే దృశ్యాల్లో ఇదొకటి.


వాగు పక్క వ్యవసాయం...
మాది ఉమ్మడి కుటుంబం. నాన్న, చిన్నాన్న తాత(మల్లారెడ్డి)తోనే కలిసి ఉండేవారు. నాన్నకి నేనొక్కడ్నే. చిన్నాన్నకు ఇద్దరూ ఆడపిల్లలే. నేనే వారసుడ్ని. మాది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌కిఎడమవైపున ఉన్న 'అనుముల' గ్రామం. నాకు తెలివొచ్చేటప్పటికి డెబ్బై, ఎనభై ఇళ్లు ఉండేవి. అందరికన్నా మా ఇల్లే పెద్దది. మిద్దె ఇల్లు. ఆరు గదులుండేవి. నాకు మూడేళ్ల వయసుండగానే అమ్మ (లక్ష్మీ నర్సమ్మ) చనిపోయింది. దాంతో ఇంట్లోవాళ్లందరూ చాలా గారం చేసేవారు. మాకు 40 ఎకరాల పొలం ఉండేది. అందులో ఒకే ఒక్క ఎకరం వరిపొలం, మిగతాదంతా మెట్ట పంటలు.


శెనగలు, ఉలవలు, కందులు, పెసలు, ఆముదాలు, పల్లీలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఒరిగలు, కుసుమలు, జొన్నలు...ఇలా అన్ని రకాల పంటలూ పండేవి. మా పొలంలో పండని ధాన్యం లేదు. కాయని కూరలు లేవు. నాన్న(వీరారెడ్డి) ఆకుకూరల్ని కూడా చాలా శ్రద్ధగా పండించేవాడు. పుంటికూర(గోంగూర), కలగూర, ఒంగంటి కూర, పాయల్‌కూర...ఒక్క పురుగుబట్టే కాలం తప్పిస్తే ఏడాదంతా ఈ ఆకు కూరలు మా పొలంలో ఉండేవి. ఇవి కాకుండా పశువుల కొట్టాల్లో, మా ఇంటి దొడ్లో అన్ని రకాల పాదులూ ఉండేవి. పొట్లకాయ, బీర కాయ, చెమ్మకాయ, దోసకాయ, కాకరగాయ పాదులు ఎప్పుడూ ఉండేవి.


వీరారెడ్డి ఇంటికొచ్చిన ఏ బంధువైనా సంచులనిండా ధాన్యాలను, కాయగూరల్ని తీసుకుపోవాల్సిందే. ఊరికి మాదే పెద్ద కుటుంబం కావడంతో ఎవరికి ఏది కావాల్సివచ్చినా వచ్చేవారు. అప్పట్లో పొలాల్లో కరెంటు మోటార్లు ఉండేవి కావు. మోటదోలేవాళ్లం. మోట అంటే ఒక తాడుకి డొప్ప కట్టి బావిలో వేసి ఆ తాడుని రెండు ఎద్దులకు కట్టేవాళ్లు. మధ్యలో తొండంలాంటిది ఉండేది. ఎడ్లు లాగినపుడు నీళ్ల డొప్ప పైకి వచ్చేది. ఆ నీటిని పొలం కాలువలో పోసేవాళ్లు. మామూలుగా ఈ పని చేయడానికి జీతగాళ్లు ఉండేవారు. అప్పుడప్పుడు నేను కూడా సరదాగా మోటదోలడానికి వెళ్లేవాడ్ని. చేతులు బాగా నొప్పిపుట్టేవి. అయినా వెళ్లేవాడ్ని. ఇది కాకుండా నాన్న, జీతగాళ్లు అన్నం తినడానికి వెళ్లినపుడు మధ్యలో ఆపేసిన పనుల్ని నేను కొనసాగించేవాడ్ని. గుంటగొట్టడం, గొర్రె తోలడం(బురద పొలాన్ని చదును చేయడం) కూడా చేసేవాడ్ని. మా నాన్న 'అరె...నీకెందుకురా...' అనేవాడు.


బర్రెలు...గొర్రెలు
డెభై ఆవులు, పది గేదెలు, యాభై గొర్రెలు, అరవై మేకలు ఉండేవి మాకు. వీటన్నిటినీ చూసుకోడానికి ఇంట్లోవాళ్లు కాకుండా నలుగురు జీతగాళ్లు ఉండేవారు. చిన్నాన్న, మేనత్త వాళ్ల పిల్లలు, మేము కలిపి మొత్తం పదిమంది ఉండేవాళ్లం. అందరికీ మా అత్తనే వండిపెట్టేది. పెద్దవయసువారికి వరి అన్నం, చిన్నపిల్లలకు ఒరిగెలన్నం, కొర్రన్నం. జీతగాళ్లకు సజ్జన్నం, జొన్నన్నం. మొత్తానికి ప్రతి రోజు అన్ని రకాల అన్నాలు వండేది. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ సమృద్దిగా ఉండేవి కాబట్టి పెద్ద పెద్ద బొగాణాలలో వండేవారు. మా ఇంటికున్న మరో స్పెషల్ ఏంటంటే...ప్రతి రెండు రోజులకూ నాన్‌వెజ్ ఉండేది.


చేపలు, రొయ్యలు కాదు ఆల్‌టైం మటన్. (నవ్వుతూ..) తిన్నవారికి తిన్నంత. విషయం ఏమిటంటే...మాకు మేకలు, గొర్రెలు ఉండేవి కదా! అవి మేతకు వెళ్లినపుడు వాటిని తినడానికి తోడేళ్లు వెంటపడేవి. అవి మేకని పట్టినపుడు జీతగాడు చూస్తే కర్రతో కొట్టేవాడు. అవి దాంతో మేకని అక్కడే వదిలి పోయేవి. చచ్చిన మేకల్ని జీతగాడు తెచ్చి ఇంటిముందు పడేసేవాడు. మా అత్త వండినంత వండి మిగతా మాంసం ఊళ్లోవాళ్లని పిలిచి పంచేది. పొలాల్లో కల్లాలు ఉన్నప్పుడు నాన్న నన్ను వెంట బెట్టుకుని వెళ్లేవాడు.


వాటికి కాపలా ఉండమనేవాడు. ఆ సమయంలో ఒక్క విజిల్ వేస్తే చాలు నా దోస్తులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఒక గంట కాపలా ఉండడం, మరో గంట గుట్టలెంబడి, చెట్టులెంబడి ఉరకడం. రేగిపండ్లు, పులిచేరు కాయలు, కలింకాయలు...వీటి కోసమే ఉరికేవాళ్లం. 'ఉన్నార్రా...అక్కడ' అని కేక వినిపించగానే మళ్లీ కల్లాలకాడికి వచ్చేసేవాళ్లం. మా ఊళ్లో ఒక్క పండ్లచెట్టు ఉండేది కాదు...జామపండు, మామిడిపండు, దానిమ్మపండు పేరు వినడమే కాని చెట్టు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. పక్క ఊళ్లకు వెళ్లినపుడే వాటి దర్శనం. సీజన్‌లో వచ్చే చిప్పలకాయలు, రేగిపండ్లే మాకు పెద్ద ఫలాలన్నట్టు.


వెన్నెల్లో ఆటలు...
పగలంతా చదువు, చిన్న చిన్న పనులు. వెన్నెలరాత్రులొచ్చాయంటే రాత్రిపూట కూడా ఆటలు ఆడేవాళ్లం. రాత్రి పన్నెండయినా పట్టించుకునేవాళ్లం కాదు.'అర్ధరేత్రయింది పండుకోండిరా...'అంటూ తాత అరుస్తూనే ఉండేవాడు. లెక్కజేస్తే కదా! ఇవి కాకుండా పగలు జింకల్ని సాకడం, గులేరుతో పిట్టల్ని కొట్టడం...బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. బాల్యాన్ని నేను ఎంజాయ్ చేసినదానిలో నా బిడ్డలు పదోవంతు కూడా ఎంజాయ్ చేయలేదు. అది నా గొప్పతనం కాదు. ఊరి వాతావరణంలో పొందే గొప్ప అనుభవం. ఆ రోజుల్లోని తిండి, నీరు, పొల్యూషన్ లేని గాలి...ఇప్పుడు వేలకోట్లు పెట్టినా దొరకవు.


కళకళలాడే కళ్లాపి రోడ్లు...
అప్పట్లో మెయిన్‌రోడ్లన్నీ కంకరరోడ్లే. మా చుట్టుపక్కల ఊర్ల సంగతి నాకు తెల్వదు గాని మా ఊరు మాత్రం అద్దంలా ఉండేది. రోడ్డుపైన చెత్త అనేది ఉండేది కాదు. ఇళ్లని చూసి కాదు వాకిల్ని చూసి ఆ ఇంటికథేందో చెప్పొచ్చు. కరెంటు, మంచినీరు, మరుగుదొడ్లు...వీటి గురించి ఎవ్వరికీ ఎరికలేదు. స్కూలు విషయానికొస్తే ఒకే ఒక్క చిన్నగదిలో ప్రైవేటు పాఠశాల ఉండేది. ఒకే ఒక్క టీచరు ఉండేవారు. మూడవ తరగతి వరకూ ఉండేది.


నాకు ఐదేళ్లు రాగానే నాన్న అక్కడ చేర్పించిండు. మా అత్త చెప్పేది. నేను చిన్నప్పుడు బాగా శ్రద్ధగా చదువుకునేవాడ్నంట. అక్కడ స్కూలు అయిపోయాక చల్లకుర్తికి పంపారు. అక్కడ పాపిరెడ్డి అనే టీచర్ ఇంట్లో ఉండి చదువుకునేవాడ్ని. ఎనిమిదో తరగతి పూర్తయ్యాక మిర్యాలయాలగుడాకి వెళ్లాను. హెచ్ఎస్‌సి పూర్తిచేశాక నాగార్జున సాగర్ కాలేజ్‌లో పియుసి చదివి టీచరయ్యి ఊరికి తిరిగొచ్చాను.


టీచర్ జానారెడ్డి...
అప్పటివరకూ ఊళ్లో సరదాగా ఆడుతూపాడుతూ తిరిగిన కుర్రాడు టీచర్ అయ్యాడని ఊరంతా సంతోషించింది. నేను టీచర్ అయ్యేసరకి ఊళ్లో స్కూల్లో ఐదో తరగతి వరకూ ఉంది. అన్ని సబ్జెక్‌లు చెప్పేవాడ్ని. పాతికేళ్లవయసులోనే 200మంది ఉపాధ్యాయులున్న సంఘానికి అధ్యక్షుడ్ని అయ్యాను. ఊళ్లో యూత్ అసోసియేషన్ పెట్టాను. నేనే నాయకుడ్ని. అందరి దగ్గరా చందాలు వసూలుచేసి రామాలయం కట్టించాను. నాలుగేళ్ల తర్వాత టీచర్ ఉద్యోగాన్ని వదిలేశాను.


రాజకీయాల్లోకి వచ్చాను. 1979లో ఊరికి కరెంటు స్తంభాలు వేయించాను. సిమెంటు రోడ్లు కూడా. ఊళ్లో ఉండగానే ఎమ్ఎల్ఎ అయ్యాను. మంత్రిగా కూడా పనిచేశాను. ఆ సమయంలోనే నలభైఎకరాల ప్రభుత్వ స్థలంలో ఊళ్లోని పేదలందరికీ ఇళ్లు కట్టించాను. పాత ఊరు పక్కనే కొత్త ఊరు వెలసింది. పంచాయితీ అయింది. నేను మంత్రిగా ఉన్న సమయంలోనే అంటే 1985లో మండలాల ఏర్పాటు జరిగింది. మా ఊరు మండల కేంద్రం అయింది. ఊరు రూపురేఖలన్నీ మారిపోయాయి. రాజకీయాల్లో పెద్ద పదవులు వచ్చాక హైదరాబాద్‌కి వచ్చేశాను. నేను రాజకీయాల్లోకి రాకముందు మా ఊరికి 250 ఎకరాల ఆయకట్టు ఉండేది. దాన్ని నేను 2800 ఎకరాలకు తీసుకొచ్చాను. ఒక పక్క నాగార్జునసాగర్ కెనాల్, శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్, మరో పక్క కృష్ణ మంచినీరుతో ఊరంతా సస్యశ్యామలమైంది.


కుంట భూమిలేకపోయినా...
మండల కేంద్రం అయింది కాబట్టి ఇప్పుడు మా ఊళ్లో పదివేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదారు ప్రైవేటు కాలేజీలున్నాయి. ఐటి కాలేజ్, 30 పడకల ఆసుపత్రి, ఆలియా జంక్షన్ మార్కెట్‌యార్డ్, వ్యవసాయ రైతుల అభివృద్ధి కమిటీ హాలు...ఇలా అన్నీ వచ్చేశాయి. అయినా ప్రత్యేకంగా నా ఊరికి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మరో విచిత్రమైన విషయం ఏంటంటే నాన్న ఇచ్చిన నలభై ఎకరాల పొలంలో ఇప్పుడు నాకు కుంట భూమి కూడా మిగల్లేదు. చాలా వరకూ కొత్త ఊరు నిర్మాణమపుడు విరాళంగా ఇచ్చాను. మిగతాది అమ్మేశాను. ఇప్పుడు ఊళ్లో నాకు ఏమీ లేదు.


బంధువులు కూడా లేరు. అయినా ఊళ్లో ప్రజలందరూ నావాళ్లే. నా తర్వాత ఊరిని ఎవరు చూసుకుంటారు? దానికోసం ఒక ప్లాన్ వేశాను. అక్కడ రోడ్డుపక్కనే ఓ నాలుగైదు షాపులు కొందామనుకుంటున్నాను. వాటిపైన వచ్చే కిరాయితో ఊళ్లోని పేదల్ని, ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాలనేది నా ఆలోచన. ఆ డబ్బు ఎప్పటికీ ఊరి ప్రజలకే ఉంటుంది. ఈ విషయం గురించి మా అబ్బాయిలతో కూడా మాట్లాడాను. 'నేను పోయాక నా ఊరితో సంబంధాలు మీరు కొనసాగించాలి. ఎందుకంటే నా మూలం అదే కాబట్టి. నా ఊరి ప్రజలు కోరినంత కాకపోయినా...మీకు తోచినంత సాయం చేస్తూ, మేమున్నామనే ధైర్యం ఇవ్వండి చాలు, అదే నేను మిమ్మల్ని కోరే కోరిక' అని చెప్పాను. నన్నింతవాణ్ని చేసినందుకు అనుముల గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ం భువనేశ్వరి ఫొటోలు: రఫీ, భిక్షంరూథర్


వెన్నెల రాత్రులొచ్చాయంటే మా ఇంటిముందు ఓ ఇరవైమంది పిల్లగాళ్లు చేరేవారు. కబడ్డీ ఆటలు ఆడేవాళ్లం. చూడ్డానికి పెద్దోళ్లందరూ వచ్చేవాళ్లు. వాళ్లే ఆడియన్స్ అన్నమాట.


మా ఊళ్లో మట్టి రోడ్లయినా సిమెంటురోడ్డుకంటే బాగుండేవి. సీక్రెట్ ఏం లేదు...సూర్యుడి రాకముందే మా ఊరు ఆడోళ్లు చిక్కగ కళ్లాపి కొట్టి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవారు.


భోజనం విషయానికొస్తే జొన్నన్నం, కొర్రన్నం, మటన్ కూర, మీగడ పెరుగుతో నాన్న దగ్గరుండి పెట్టేవాడు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు. జానా...అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకునేవాడు నన్ను.


నాన్న పోయాక ఊళ్లో నాకు బంధువులెవరూ లేరు. నాకు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆ ఊరు నాదే కదా. అందువల్ల నేనున్నంతవరకూ నా ఊరి ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలను.

Sunday, December 4, 2011

ఊరు మరచినా...నేను మరవలేదు * నటసామ్రాట్ అక్కినేని 'మా ఊరు'

నీడనెప్పుడైనా చూశారా? వెన్నంటే ఉంటుంది.
ఊరూ అలాంటిదే. మన మూలం.
ఎంత దూరం వెళ్లినా మనతోనే ఉంటుంది. పలకరిస్తూనే ఉంటుంది.
అమ్మ, నాన్న, ఊరు- మనం మార్చుకోలేనిది ఈ మూడింటినే.
సొంత ఊరిలో గాలి, నీరు, చెట్లు, పుట్టలు, స్నేహితులు, బంధువులు...అన్నీ ప్రత్యేకమే.
ఊరి స్మృతులు చెబుతుంటే మొహం వెలిగిపోతుంది. గుండె కదిలిపోతుంది. ఒళ్లు పులకరిస్తుంది. మనసు పరవశిస్తుంది.
ఆ మట్టి వాసనను పరిమళింపచేసేదే ఈ నటసామ్రాట్ అక్కినేని ఊరి కబుర్లే   'మా ఊరు'.


ఇది పదిహేనేళ్ల కిందటి జ్ఞాపకం. అప్పట్లో జన్మభూమి కార్యక్రమం జోరుగా సాగుతోంది. నేను కూడా మా ఊరికి తోచినంత సాయం చేద్దామని.. ఫ్యామిలీని వెంటబెట్టుకుని మా ఊరెళ్లా. అక్కడున్న వాళ్లంతా నన్ను చూసి 'అక్కినేని గారొచ్చారు! అక్కినేని గారొచ్చారు..' అంటూ బిలబిలా చుట్టుముట్టారు. వాళ్ల అభిమానాన్ని తప్పించుకుంటూ.. ఊరంతా ఒక రౌండ్ చుట్టేశాను. "ఈ ఊర్లో మీ ఇల్లేదీ?'' అని ఎంతో ఆసక్తిగా అడిగారు నా వెంట వచ్చిన కూతుళ్లు, కోడలు.

ఎప్పుడో ఊరు విడిచిన నేను నా ఇల్లు ఎక్కడని చూపించను..? బాగా గుర్తు చేసుకుని ఓ ఇంటిని చూపిస్తూ "అదిగో అదే నా చిన్నప్పటి ఇల్లు'' అన్నాను. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. "అక్కినేని గారూ ఇది మీ ఇల్లా? మా నాన్న నలభై ఏళ్లకిందట ఎప్పుడో దీన్ని కొన్నాడు'' అని చెప్పాడు ఆ ఇంటి ప్రస్తుత యజమాని.

ఎవరైనా నన్ను సొంతూరి మనిషిగా గుర్తుపట్టి పట్టెడన్నం పెడతారేమోనని నా మనసు చాలా ఎదురుచూసింది. చివరికి ఒక అభిమాని ఇంట్లో భోజనం చేశాం. అతను కూడా మా ఊరివాడే. అప్పుడు మా పిల్లలు ఒక మాటన్నారు.. "నాన్నా... ఈ ఊళ్లో నీకు కనీసం ఎకరం పొలమైనా ఉంటే ఈ ఊరోళ్లందరికీ నువ్వు తమవాడివని తెలిసేది. కనీసం ఇల్లయినా ఉంటే బాగుండేది'' అని అన్నారు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. ఓ చెట్టు దగ్గర నిలబడి...కాలువ గట్టువైపు చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను.

అక్కడ చిన్నపాకలో అక్షరాలు దిద్దుకున్న జ్ఞాపకాలు, మొదటిసారి నాటకం వేసిన అపురూప దృశ్యాలు కళ్లకు కనిపించాయి. పిల్లలు చెప్పిన మాట నిజమేననిపించింది. ఒక ఇల్లు ఉంటే అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉండేది. వచ్చినపుడల్లా ఎంచక్కా ఊరంతా తిరిగి చిన్ననాటి స్మృతుల్ని గుర్తుచేసుకునేవాడ్ని... అని మనసులో అనుకున్నాను. కాని పిల్లలకి నేను చెప్పిన సమాధానం వేరు. "సొంత ఊళ్లో పదెకరాల పొలం, ఓ పెద్ద ఇల్లు ఉంటేనే ఊరి మీద అభిమానం, అనుబంధం ఉన్నట్టు కాదర్రా. ఒకవేళ అలా ఉండి ఊరికి ఏమైనా సాయం చేస్తే..."ఎవడి కోసం చేస్తున్నాడు...వాడి ఆస్తులు కూడా ఉన్నాయి కదా...'' అని అనేవారు కూడా ఉంటారు'' అని సర్ది చెప్పాను


**** చెట్లు...పుట్టలు...
నేను రేపో మాపో పుడతాననగా మా అమ్మ పున్నమ్మకి నాగుపాము కల్లోకి వచ్చింది. దాంతో నాకు నాగేశ్వరరావు అని పేరు పెట్టింది. నాగులచవితి నాడు పుట్టలో పాలు పోయడానికి అమ్మ చేయి పట్టుకుని ఊర్లో ఉన్న పుట్టలు, చెట్టులు తిరగడంతో మొదలైంది నా బాల్యం. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాకి ఉత్తరాన 9 మైళ్ల దూరంలో ఉన్న వెంకట రాఘవాపురం నా జన్మస్థలం. చిన్న ఊరు. మహా అయితే యాభై ఇళ్లు ఉంటాయేమో. పాతికెకరాల అసామి మా తండ్రి వెంకటరత్నం. ఐదుగురు కొడుకుల్లో నేను ఆఖరివాడ్ని. అతి సామాన్యరైతు కుటుంబం. మాదే కాదు...మా ఊర్లోని అందరూ సామాన్యులే. నాలుగు నిట్రాళ్ల మా ఇల్లే ఊర్లోని అందరి ఇళ్లలోకి పెద్దది. మా ఇంట్లో ఐదు గదులుండేవి.

పాకలో...పాఠశాల

చెరువుగట్టున ఒక చిన్న పాక ఉండేది. అదే మా ఊరి పాఠశాల. రెండో తరగతి వరకూ ఉండేది. పగలు పాఠశాల. సాయంత్రం పేకాటశాల. రాత్రయితే గోశాల. మా ఊళ్లోనే కాదు అప్పట్లో అన్ని పల్లెటూళ్లలో అదే పరిస్థితి. ఆ రోజుల్లో అదే గొప్ప. నా నాల్గవ ఏటనే నాన్న చనిపోయారు. దాంతో అప్పటివరకూ కలిసి ఉన్న అన్నదమ్ములంతా విడిపోయారు. అంత పెద్ద ఇంట్లో అమ్మా..నేను మిగిలాం. ఇల్లు, మా వాటాకి వచ్చిన ఐదు ఎకరాల పొలం అమ్మేసి నన్ను పెద్ద చదువులు చదివిద్దామనుకుంది అమ్మ. మా ఊళ్లో రెండవ తరగతి వరకే ఉండడంతో పక్కనే ఉన్న పెదఊరిపాడు ఊళ్లోని స్కూల్లో చేర్పించింది.

రోజూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడ్ని. చదువుకుంటూనే అన్నల పొలాలకు వెళ్లి నారు కట్టలు మోయడం దగ్గర నుంచి వరి కట్టలు మోసేవరకూ అన్ని పనులూ చేసేవాణ్ని. అలాగే ఇంట్లో అమ్మకి కూరలు తేవడం కూడ.అన్నట్టు కూరలంటే గుర్తు వచ్చింది. నాకు ఒక సైకిల్ ఉండేది. కూరలు, సరుకులు ఏం కావాలన్నా..పక్కఊరికి వెళ్లాలి. ఆరేడేళ్ల వయసులో ఆ సైకిల్ తొక్కడానికి చాలా పాట్లు పడేవాణ్ని. అందీ అందని కాళ్లతో ఉడతకొట్టుడు కొడుతూ పక్కఊరికి వెళ్లి ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేవాడ్ని. ఒకరోజు మా ఊరి పాఠాశాలలో ఏవో నాటకాలు వేస్తున్నారంటే చూడ్డానికి వెళ్లాను. వెళ్లి ఊరుకోలేదు. నేను వేషం వేస్తానని రెడీ అయ్యాను. చంద్రమతి వేషం ఇచ్చారు. చీర కట్టి నా నోటికొచ్చిన గాలిపాటలు పాడాను. నాటక బృందం వారు శభాష్ అని మెచ్చుకుని అర్ధ్థరూపాయి చేతిలో పెట్టి పంపించారు.

పాఠశాలలో నాటకం..
నాటకం ముగిసాక నేరుగా ఇంటికెళ్లి అమ్మకి చేతిలోని అర్ధరూపాయిని చూపించాను. అమ్మ అర్ధరూపాయని చూడలేదు. నా మొహంలోని సంతోషాన్ని చూసింది. నా నటన గురించి ఊరి జనం చెప్పిన కబుర్లన్నీ విన్నది. 'మన వంశంలో ఎవరూ చదువుకోలేదు. చిన్నాడినైనా పెద్ద చదువు చదివిద్దామనుకున్నాను. వాడికి కూడా అబ్బేట్టు లేదు. వాడిలో నాకు మంచి నటుడు ఉన్నాడనిపిస్తోంది. పోనీ ఆ రంగంలోనైనా వాడ్ని ముందుకు పంపుదామనుకుంటున్నార్రా' అని అన్నయ్యల దగ్గర చెప్పింది. వాళ్లూ సరేనన్నారు. కుదరవల్లి గ్రామంలో 'కనకతార' నాటకం వేస్తున్నారని తెలిసింది. అందులో తార వేషం వేయమని పిలుపొచ్చింది. మరో అర్ధరూపాయి చేతిలో పడింది. అలా...మా ఊరి పాఠశాల్లో వేసిన నాటకమే నాకు బతుకుతెరువు చూపించింది.

రాజకీయాలు...

యాభై గడపలే కదా...అని మా ఊరిని తక్కువ అంచనా వెయ్యకండి. ఆ చిన్న ఊళ్లోనే పెద్ద పెద్ద రాజకీయాలు. ఎప్పుడూ రెండు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉండేది. ఈ కొట్లాటలు జరుగుతున్నప్పుడు మా అన్నలకు కర్రలు గటా అందించేవాడ్ని. ఏడాదిలో పంటల కాలం పోగా మిగతా కాలమంతా అందరూ ఖాళీగా ఉండేవాళ్లు. ఏ చెట్టుకింద చూసినా పేకాట రాయుళ్లే. పెద్దన్నయ్యకి గుడివాడతో బాగా పరిచయం. అక్కడ నాటకాలవారిని పరిచయం చేసుకుని నన్ను అక్కడికి కూడా పంపేవాడు. అక్కడ వేషాలు ఎక్కువగా రావడంతో అమ్మని తీసుకుని గుడివాడకి వెళ్లిపోయాను. ఘంటశాల బలరామయ్యగారి కంట్లో పడేవరకూ బోలెడు నాటకాల్లో వేషాలు వేశాను. ఆయన పరిచయంతో నా మకాం మద్రాసుకి మారింది. నా జీవితంలో బోలెడు మార్పులు జరిగిపోయాయి. కాని దశాబ్దాలు గడచినా...నా ఊళ్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

కళాశాల నిర్మాణం...

నా చదువు నాలుగో తరగతితో ఆగిపోయింది. అయినా మా కుటుంబంలో నా చదువే పెద్ద చదువు. అమ్మా...నాన్న, నలుగురు అన్నయ్యల్లో ఎవరికీ సంతకం చెయ్యడం రాదు. నాకు మాత్రమే చదవడం, సంతకం చెయ్యడం వచ్చు. మా వాళ్లకి చదువుల తల్లి అల్లంత దూరంలో ఉండేది. సినిమాల్లోకి వెళ్లాక నాలుగు రూపాయలు సంపాదించాక నేను చేసిన మొదటి పని గుడివాడలో కళాశాల కట్టించడం. బాగా చదువుకున్నవాడి కంటే చదువుకోలేని వాడికే చదువు విలువ బాగా తెలుస్తుంది. దానికి నేనే నిదర్శనం. అందుకే ఎఎన్ఆర్ పిజి కాలేజి నిర్మాణానికి పూనుకున్నాను. అమ్మ చాలా సంతోషించింది. గుడివాడ ప్రజలు అంతకన్నా ఎక్కువ సంతోషపడ్డారు.

ఊరిని వదిలి...

నాటకాల పేరుతో నేను గుడివాడకి మకాం మార్చాక అన్నయ్యలు కూడా ఊళ్లోని భూములు అమ్ముకుని వేరే ఊళ్లకి వెళ్లిపోయారు. సొంత ఊళ్లో మాకంటూ సెంటు భూమి కూడా మిగల్లేదు. అమ్మకి ఊరి అభిమానం చాలా ఎక్కువ. ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉండేది. నేను మాటల్లో తలుచుకోవడమే కాని ఎప్పుడూ వెళ్లలేదు. ఇల్లు, పొలం లేకపోవడం ఒక్కటే కారణం కాదు ఆ ఊళ్లో ఒక్క బంధువు కూడా మిగల్లేదు మాకు. అందరూ వలసలు పోయారు. సినిమా రంగంలో నేను రోజురోజుకీ ఎదుగుతున్నాను.

డబ్బు సంపాదించుకుంటున్నాను...అంతా బాగానే ఉంది. వీధి దీపం తెలియని రోడ్లు, మరుగుదొడ్లు ఎరుగని మహిళలు, మంచినీరులేని నూతులు...ఇవే నా ఊరి జ్ఞాపకాలు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో నాకున్న పరిచయంతో ఒకసారి వెళ్లి కలిసాను. ' నా సొంత ఊరిలో నాకు ఏమి లేకపోయినా బాధ కలిగించే జ్ఞాపకాలు మిగిలిపోయాయి. నా ఊళ్లో ఇప్పటికీ కరెంటు లేదు. ఊరికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కరెంటు స్తంభాలు వచ్చాయని తెలిసింది. అక్కడి నుంచి నాలుగు కరెంటు వైర్లు మా ఊరికి కూడా లాగించండని' అడిగాను. ఓ నాలుగైదు సార్లు వెంటపడితే పనైంది. ఊళ్లో కరెంటు బల్బులు వెలిగాయని తెలిసాక చాలా సంతోషమనిపించింది.

గుర్తుపట్టలేదు...

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకరోజు ఆయన జూబ్లిహాల్లో ఒక మీటింగ్ పెట్టారు. నన్ను కూడా పిలిచారు. జన్మభూమిలో భాగంగా పల్లెటూళ్లని అభివృద్ధి పరుచుకునే పథకం గురించి చెప్పారు. ముందుగా నేనే స్పందించాను. అరవైశాతం ప్రభుత్వం పెట్టుకుంటే, నలభైశాతం ఊరి ప్రజలు భరించాలని, మంచినీరు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ముందుగా మా ఊళ్లోని వాళ్లతో మాట్లాడడానికి చంద్రబాబుతో కలిసి హెలికాఫ్టర్‌లో వెళ్లాను.

'మన ఊరు చూడ్డానికి అక్కినేని నాగేశ్వరరావు వస్తున్నారంటూ' ఊళ్లో హోరెత్తిపోయిందట. 'బాబు..ఇది మీ ఊరు మాత్రమే కాదు...నాది కూడా ఇదే ఊర'ని ప్రతిఒక్కరికి నోరు తెరిచి చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ ఊళ్లో నా వయసువారంతా అప్పటికే చనిపోయారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకోడానికి ఎవరూ లేరు. తర్వాత తరాలవారికి నేను నటుడిగానే తెలుసు కాని ఊరి మనిషిగా పరిచయం లేదు. ఊరి అభివృద్ధి గురించి ఊరి పెద్దల్ని కలిసి మాట్లాడితే ఊళ్లోని మునుసుబుగారి అబ్బాయి ముందుకు వచ్చాడు. తనకు తోచింది తాను చేశాడు. మిగతా డబ్బంతా నేను పెట్టాను. వెంకట రాఘవాపురానికి కరెంటు, ఇంటింటికీ మంచినీళ్ల పైపులు, రోడ్లు, సానిటరీ...అన్ని సదుపాయాలు వచ్చాయి. దశాబ్దాలుగా నా గుండెల్లో ఉండిపోయిన దిగులంతా పోయింది.

వంతెన నిర్మాణం..

గుడివాడ నుంచి ఏలూరుకి వెళ్లాలంటే బుడమేరు వాగు చుట్టూ తిరిగి వెళ్లాలి. అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. లేదంటే రెండు కిలోమీటర్లు కాలువపైన పడవలు, బల్లకట్ల మీద వెళ్లాలి. జన్మభూమి కార్యక్రమం సమయంలోనే ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. బ్రిడ్జి కట్టించకపోతే కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నాను. ప్రభుత్వం ఒప్పుకుని రెండు కిలోమీటర్ల వంతెన నిర్మాణం పూర్తి చేసింది. గుడివాడ నుంచి ఏలూరికి నేరుగా వంతెన వచ్చేసింది. ప్రయాణం సులువైంది. రైతుల భూముల రేట్లు కూడా పెరిగాయి. ఆ వంతెనకు అక్కినేని వారధి అని పేరు పెట్టారు.

మా ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మూడేళ్లక్రితం కుదరవల్లి దగ్గర అక్కినేని కళాకేంద్రం నిర్మించాము. మా పక్కఊరికి చెందిన డాక్టర్ ఎఎస్ నారాయణ ఈ కళాకేంద్రంలో బుక్‌బైండింగ్ వర్క్ పెట్టించాడు. పని కావాల్సినవారు అక్కడికి వచ్చి నేర్చుకుని పని చేసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల ప్రైవేటు స్కూళ్లకి మా కళాకేంద్రం నుంచే నోటు పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. మొన్నామధ్య నా ఫొటోతో కొన్ని పుస్తకాలు ముద్రించారు. నేను రెండు వేల పుస్తకాలు కొనుక్కుని నా పుట్టినరోజునాడు నా అభిమానులకు బహుకరించాను. పుట్టిన ఊళ్లో సెంటు భూమి లేకపోయినా ఊరి గురించి ఆలోచించడం మానలేకపోతున్నాను. కన్నతల్లిని ఎలా మరువలేమో పుట్టిన ఊరిని కూడా అలాగే మరవలేము.

ప్రస్తుతం మా ఊరికి సంబంధించి ఒక ముఖ్యమైన పని చేసే ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మా ఊరికి ఉత్తరం రాస్తే అడ్రస్‌లో కుదరవల్లి శివారు అని రాయాలి. అలా కాకుండా వెంకట రాఘవాపురాన్ని ఒక పంచాయితి చేస్తే బాగుంటుందని నా కోరిక. దానికోసం మంత్రిగారిని కలవాలనుకుంటున్నాను. ఈ ఒక్క పనీ పూర్తయితే నా సొంతూరి రుణం ఎంతోకొంత తీర్చుకున్న తృప్తి మిలుగుతుంది.

ఆ చుట్టుపక్కల ప్రైవేటు స్కూళ్లకి మా కళాకేంద్రం నుంచే నోటు పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. మొన్నామధ్య నా ఫొటోతో కొన్ని పుస్తకాలు ముద్రించారు. నేను రెండు వేల పుస్తకాలు కొనుక్కుని నా పుట్టినరోజునాడు నా అభిమానులకు బహుకరించాను.

Sunday, November 20, 2011

సువాసనల కాక్‌టెయిల్ - బీనాదేవి

http://www.eemaata.com/images/jan2010/SSusa.jpg
నూరేళ్ళ తెలుగు కథ
నూరేళ్ళంటే వయసైపోయింది
దానికి మళ్ళీ యవ్వనం తేవాలి
"60లో 20 ఎలా తేగలవు ఖదీరూ'' అన్నారు శ్రీశ్రీ

"జమానా బదల్ గయా సాబ్. ఇప్పుడు మేక్-అప్‌లో, ఫేస్-లిప్ట్‌లు, బ్యూటీ పార్లర్‌లు ఒకటేమిటి? 60లో 20 సునాయాసంగా తెప్పిస్తున్నారు. మనిషికి తెప్పించగా లేనిది కథకి తేలేనా ? నేనున్నా - నేనున్నానన్నారు'' ఖదీర్. ఇదొక యజ్ఞం
ఖదీర్ ఋష్విక్

నూరుమంది ప్రసిద్ధ కథకుల్ని ఏరాలి
వాళ్ళు రాసిన వాటిలో ఓ మంచి కథ ఏరాలి
అది చదివి, అర్ధం చేసుకోవాలి
విమర్శకాదు. విశ్లేషణా కాదు.
మరి?
అదే కథని అందరిచేత చదివించేలా తిప్పి రాయాలి.
ఖదీర్ ప్రతి రచయితలోనూ పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ బుర్రలో దూరిపోయి, "నీకంటే బాగా రాస్తాను చూడు'' అన్నారు.
రాశారు. ఎలా ఉన్నాయి?
ముళ్ళపూడి రాసిన "వెలుగు నీడలు'' సినిమా నవల చదివిన కాట్రగడ్డ నర్సయ్య గారు "ఇడ్లీ కంటే పచ్చడి బావుంది'' అన్నారు.
నాకు ఈ కథలన్నీ చదివాక అలాగే అనిపించింది.
అసలు కథని నామమాత్రంగా తీసుకొని దానికి చక్కటి ఆకారం, అలంకారాలు ఇచ్చి ముస్తాబు చేసి (మనీష్ మల్‌హోత్రాలా కథకి ఫ్యాషన్ డిజైనింగు చేసి) పాఠకుడి గుండెలోకి గురిచూసి వదిలారు. "తాంబూలాలు ఇచ్చేశారు. తన్నుకు చావండి'' అన్నట్టు " రాసి పారేసాను. చదివి చావండి'' అన్నారు.
పాఠకులు చదివారు
కాని చావలేదు.
"శభాష్'' అన్నారు
ఎవరో ఎందుకూ? నేనే అనుకున్నాను.
నా కథ "జలుబు చేసిందా?''ని ఎంత బాగా రాశారంటే "ఇంత బాగా రాయొచ్చా?'' అనిపించింది. ఓ వారం రోజులు కథ గురించి నిరంతర ఫోను స్రవంతి. "అది నేను రాయలేదు మొర్రో. అది ఖదీర్ రాశారు'' అని మొత్తుకున్నాను. పైగా టైటిల్ కూడా అతి రసవత్తరంగా "అసలే మొగుడు ఆపై జలుబు చేశాడు'' అని పెట్టారు.
నా పీత బుర్రకెందుకు తట్టలేదూ?
అసలు గమ్మత్తు
ఆ రచయిత కథ రాశాడే తప్ప ఖదీర్ అందులోంచి పీకిన భావాలు అతనికి లేకపోవచ్చు.
ఒప్పుకుంటారా ఖదీర్ గారూ!
ప్రతి కథ చివర చక్కటి కొసమెరుపు.
సమాజాన్ని ప్రశ్నించడం
పాఠకుడ్ని ఆలోచించమనడం
దీనికో చిన్న ఉదా : "ముత్యాల ముగ్గు'' సినిమాలో - కాలువలో లాంచీలో శ్రీధర్ వెళ్తున్నాడు. గట్టుమీద సంగీత చెట్లు కింద కూర్చుంది. పెద్ద అరటి బోదె పాపం దాని మానాన అది లాంచీ వెనక పోతోంది. కాని అది 'సంగీత జీవితం' అని ప్రేక్షకులు, పత్రికలు పొగిడాయి.
"నేనే పాపం ఎరగను బాబోయ్. అది డి.పి (దర్శకుడి ప్రతిభ) కాదు'' అన్నారు బాపు.
అలాగే రచయితకి రాని ఆలోచనలు, ప్రశ్నలు ఖదీర్‌గారికి వచ్చాయి.
వాటినే కథ చివర కొసమెరుపుల్లా వాడుకున్నారు.
"పంచ భూతాలను గుప్పిట బిగిద్దామని ప్రయత్నించిన వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. భూమిని జయిద్దామనుకున్న వాళ్ళ గతీ అంతే. భూమి ఇప్పుడు భరిస్తోంది. ఏదో ఒకనాడు ఒక్క క్షణం పాటు ఒళ్ళు విరుచుకుంటుంది. అప్పుడు మిగిలేది మరుభూమి. మన టూ బెడ్ రూమ్ ఫ్లాట్ విత్ హాల్ అండ్ కిచెన్ అదే'', అని శపిస్తారు ఖదీర్ "మురళి ఊదే పాపడు'' అన్న కథ చివర.
ఖదీర్ గారూ మీకు గుర్తుందా?
టాల్‌స్టాయ్ కూడా ఇలానే అన్నాడు.
"మనిషిక్కావల్సింది ఆరడుగుల నేల''
"దేవుడు మనిషికి రెండు చేతులిచ్చాడు బాగుపడమని. మనిషి ఆ రెండు చేతుల్తోనూ చెయ్యగలిగినంత విధ్వంసం చేశాడు.
యుగాంతానికి వేరే శకునాలక్కర్లేదు.
పిచ్చిక మాయమవడమే అతి పెద్ద దుశ్శకునం.
మనిషికి మూడింది.
ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకా మూడుతుంది
మూడాలి''
అంటారు ఆగెరి పిచ్చుక కథ చివర్న.
కొన్ని కథలు ఖదీర్‌లో ఆవేశం రేపాయి. ఈ సమాజాన్ని, అందుల్లో ఉన్న స్వార్ధపరుల్నీ దుయ్యబట్టారు. చేటతో గాకుండా మాటలతో చేరిగేసారు.
మరికొన్ని కథలు చదివి ఆలోచించమన్నారు.
"గొప్పవాళ్ళు ఒక్క రాత్రి మందు పార్టీలో పెట్టే ఖర్చుతో వంద మంది ముసలోళ్ళు చచ్చేదాకా బతకొచ్చు. వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎందుకున్నట్టు? వాళ్ళవి ఇంత చిల్లర బతుకులు ఎందుకైనట్టు?'' అని మనల్ని నిలదీసి అడుగుతారు. ఖదీరు గారూ! మీరు చదవలేదేమో. కుక్క "రోషనారాకి'' పెళ్ళి చేశాడు. ఆ పెళ్ళికి వైశ్రాయితో సహా అందరు రాజుల్ని ఆహ్వానించాడు. ఆ రోజుల్లో 60,000 పౌన్లు ఖర్చు అయిందిట. ఆ డబ్బుతో 12,000 మంది ఓ సంవత్సరం బతకొచ్చుట. దీన్నేమంటారు?
ఒళ్ళు బలుపు, డబ్బు పొగరు.
ముళ్ళపూడి భాషలో "కోటీశ్వరులు, కోటి చమత్కారాలు''.
ఖదీర్ గారిలో ఆవేశం, అసహనం కాకుండా నాకు మరో కోణం కూడా కనిపించింది.
ఏమిటది?
ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం, జాలి, సానుభూతి.
"కువైట్ సావిత్రమ్మ'' కథకు ఆయన ముక్తాయింపు ఎంత అద్భుతంగా ఉంది!
'స్త్రీ దేహం ఈ దేశానికి ఆదిమ పెట్టుబడి. ఐటమ్ సాంగ్‌ని చేసి ఆడిస్తున్నారు. బారుసీసా బ్రాండు కోసం అర్ధనగ్నంగా నిలబెడుతున్నారు. స్త్రీ మగాడి చేతిలో సిద్ధంగా ఉండే అగ్గిపుల్ల''.
" ఈ అగ్గిపుల్లే ఎప్పుడో అప్పుడు వాడ్ని
దావాగ్నిలా దహించేస్తుంది'' నా ముక్తాయింపు.
"మనం ఈ మధ్యనే జరిగినట్టు ఇలాంటి కథనే చదివినట్టులేదూ?'' అంటారు ఖదీర్, మల్లాది వారు రాసిన "సర్వమంగళ'' కథ చివర. "అంతేకాదు'' రెండు వక్షోజాలు, ఒక గర్భాశయం ఉన్నంత కాలం ఆడది అవస్త పడుతూనే ఉండాలా? మగాడు అవస్త పెడుతూనే ఉండాలా?'' అని బాధపడతారు. ఇలా రాస్తూపోతే మరో సంకలనం అవుతుంది.
ఖదీర్ కలానికి అన్నివైపులా పదునే.
సంపెంగ, సన్నజాజి, మల్లె, మాలతి, మరువం, దవనం, గులాబి - ఈ పువ్వులన్నిటికీ సువాసన ఉంటుంది.
అన్నీ కలిపి ఒకే మాలగా గుచ్చితే
అది సువాసనల కాక్‌టెయిల్
అదే ఈ నూరేళ్ళ కథ.
అంతేనా ఖదీర్ సాబ్!

- బీనాదేవి

Sunday, August 28, 2011

తెలుగువారంతా మా వాడని గర్వంగా చెప్పుకోగల ప్రతిభావంతుడు...కళాత్మక ఫోటోగ్రాఫర్...ద గ్రేట్ బండి రాజన్‌బాబు.

ఆయన ఫోటోలు మాట్లాడతాయ్

ఆయనెక్కువ మాట్లాడరు. ఆయన ఫోటోలు మాట్లాడతాయి. ఆయన చేతిలో కెమెరా ఒక పరికరమే కాదు...కళాఖండాన్ని తీర్చిదిద్దే 'కుంచె' కూడా. ఫోటోలతో తన భావాలను సృజనాత్మకంగా మాట్లాడించి, తన కళా దృష్టిని శాశ్వతంగా మనకు మిగిల్చి...నిశ్శబ్ద ముద్రతో ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు... తెలుగువారంతా మా వాడని గర్వంగా చెప్పుకోగల ప్రతిభావంతుడు...కళాత్మక ఫోటోగ్రాఫర్...ద గ్రేట్ బండి రాజన్‌బాబు. ఆయన అంతిమ యాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమాన ఫోటోగ్రాఫర్ల నోట ఒకే మాట వినిపించింది. "మనకు మరో రాజన్‌బాబు దొరకరు'' అని అవును, మరో రాజన్‌బాబు పుట్టక పోవచ్చు... ఎందుకంటే ఆయన ఫోటో తీస్తే అది 'కళారాజం' అవ్వాల్సిందే. కెమెరా పట్టుకోకముందే రంగులతో బొమ్మలద్దే సృజనకారుడాయన. ఆ తృష్ణతోనే, ఆయనతో చదివిన మిత్రులూ, తమ్ముడూ మెడిసిన్‌లో చేరితో తాను మాత్రం జెఎన్‌టీయూ ఆర్ట్స్ కళాశాలలో చేరి ఓ చేత్తో కుంచెనీ, మరో చేత్తో కెమెరానీ పట్టుకున్నారు.

లైట్‌తో ఆడుకున్నారు

ఆయన దగ్గర పని నేర్చుకోవడమంటే కత్తి మీద సామే. మౌనంగా, చుట్టూ ఏం జరుగుతుందో గమనించనంత ఏకాగ్రతతో పనిచేసుకు పోతుంటారు. ఆయన కొద్ది మాటలతో చెప్పే మెళకువల కన్నా, పనిచేసే తీరులో నుంచి గ్రహించ గలిగితే బోలెడన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఫోటోలకు కుంచెనద్దవచ్చని ఆయన్ని చూసే తెలుసుకున్నాన్నేను. నాకూ ఆయనకీ గురుశిష్య సంబంధం కన్నా ఆత్మీయబంధమే ఎక్కువ.

ఫోటోగ్రఫీ మీదున్న అభిరుచితో నేను తీస్తున్న నేచర్ ఫోటోలు చూసి ఫొటో ప్రేమికులు 1990లో నన్ను ఆయనకు పరిచయం చేశారు. అది మొదలు కెమెరా భుజాన వేసుకొని ఆయన శిష్య బృందంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశాను. ఫోటోగ్రఫీలో లైటుని ఫర్‌ఫెక్ట్‌గా వాడుకోవడం కొందరికే అబ్బిన విద్య. అందులో ఆయన రారాజు. వాడుకొంటారనే కన్నా లైట్‌తో ఆడుకుంటారంటేనే బాగుంటుంది.
ఎన్నెన్నో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించడం ఆయనకే సొంతం. వర్క్‌షాప్‌లో ఒకే సబ్జెక్టుని ఫోటోగ్రాఫర్లు గుంపుగా వెళ్లి ఫోటోలు తీస్తుంటే ...అందరి దగ్గరా అదే ఫోటో కదా అని నేనో పక్కన నిలబడేదాన్ని. అది చూసి ' ప్రకృతిలో ఉండేది ఒకే సబ్జెక్టు. నీ దృష్టి కోణంలోనే మార్పు ఉండాలి. నువ్వేం చూస్తావ్, ఎలా చూస్తావ్ అనేది నీ సృజనాత్మక ఆలోచన, అభిరుచి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నా కళ్లు తెరిపించిన మహానుభావుడాయన.
http://www.thehindu.com/multimedia/dynamic/00765/25hykvw02-rajanbabu_765108e.jpg
ఒకే ఒక్కడు...

రాజా త్రయంబక్ రాజ్ గత తరంలో పేరొందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్. రాజన్‌బాబుకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. రాజా శిష్యుడినని చెప్పుకునేటపుడు కళ్లూ, మొహం కాంతివంతంగా వెలిగిపోవడం నేననేక సార్లు చూశాను.
రాజన్‌బాబు ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతితోపాటు సహజత్వానికి దగ్గరగా బతికే గిరిజనులంటే ఆయనకి ప్రాణం. ముఖ్యంగా అరకులోయ గిరిజనులతో ప్రత్యేక అనుబంధం. ఆ ఆత్మబంధువుల కోసం గత నలభై ఏళ్లుగా ఆ కొండలూ, లోయలూ ఎక్కి దిగుతూనే ఉన్నారు. అందమంతా ఆ గిరిపుత్రికల్లోనే ఉందని అనేకసార్లు చెప్తుండేవారు. 'అరకు' అంటే చాలు...ఏ అనారోగ్యమూ ఆయన్ని ఆపలేదు.
http://www.fullhyderabad.com/images//previews/mar08/arts_entt/events/photography_rajan_iccr.jpg
ఉత్సాహం ఉరకలేస్తుంది. అక్కడ వాళ్లకీ రాజన్ వచ్చారంటే చుట్టమొచ్చినంత సంబరం. నెలన్నర క్రితం 73వ ఏట కెమెరా తీసుకొని అరకు వెళ్లారంటే...అక్కడి గిరిజనులపై ఆయనకున్న ప్రేమని ఆర్థం చేసుకోవచ్చు. సహజత్వపు వేటలో భద్రాచలం అడవులూ, చత్తీస్‌గఢ్ కొండలూ, ఒడిస్సా గోండులూ ఆయన కెమెరా నుంచి తప్పించుకోలేదు.

నాగరికత పేరుతో గిరిజనులు సహజత్వం కోల్పోతున్నారని ఈ మధ్య కాలంలో ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ సహజత్వంలో తాదాత్మ్యం పొందడం కోసం లోపలి అడవుల్లోకి కెమెరాలతో ప్రయాణించిన సందర్భాలెన్నో. స్త్రీ శారీరక ఒంపులను ప్రకృతి అందాలలో భాగంగా చూపిస్తూ తనదైన టెక్నిక్‌తో అద్భుతమైన నగ్నచిత్రాలు తీశారాయన. ఆ ఫోటోలకు ముగ్ధులై ఇంగ్లాండ్‌లోని రాయల్ ఫొటోగ్రఫీ సోసైటీ 1987లో ఎఫ్ఆర్‌పీఎస్ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. రాష్ట్రంలో ఆ స్థాయి గౌరవాన్ని పొందిన ఫోటోగ్రాఫర్ అప్పటికీ, ఇప్పటికీ ఆయనొక్కరే.
http://profile.ak.fbcdn.net/hprofile-ak-snc4/186046_100002013714722_6421927_n.jpg
అయినా, ఆయనెప్పుడూ తనకు డాక్టరేట్ ఉందని చెప్పుకోలేదు. చిన్న పని చేసి పదింతలు ప్రచారం చేసుకునే ఈ రోజుల మనిషి కాడాయన. ఆయనదొక ప్రత్యేక వ్యక్తిత్వం. తోచింది చేసుకుపోవడమే తప్ప ప్రచారం కోసం వెంపర్లాడలేదు. తాను తీసిన నగ్నచిత్రాలను ఒక స్థాయి కలిగిన ఫోటోగ్రాఫర్లకి క్లాసులో ప్రదర్శించడానికి కూడా ఇబ్బందిగా ఫీలవుతుండే వారు. తన దృష్టి కోణంలో నుంచి గాక మరోలా అర్థం చేసికొంటారేమోననే జంకు ఆయన్నెప్పుడూ పీడిస్తూ ఉండేది. స్లైడ్ షో జరిగినపుడల్లా టెన్షన్‌గా ఉండేవారు. 'ఎవరి ఆలోచనా స్థాయిని బట్టి వాళ్లు మాట్లాడుతుంటారు. వాళ్ల కోసం మీరు మెట్టు దిగి ఆలోచించాల్సిన పని లేదని' అనే దాన్ని. 'సంస్కారాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సంస్కారం కావాలి' అనే కొడవటిగంటి మాటని గుర్తు చేసేదాన్ని.

జీవనసౌందర్యం

అద్భుతమైన ఫోటోలతో ఒక జాతి కాలాన్నీ, సంస్కృతినీ, భావోద్వేగాలనీ రికార్డు చేసినందుకూ, కళానైపుణ్యంతో ప్రకృతిలో స్త్రీ సౌందర్యాన్ని మమేకం చేసినందుకూ పద్మ, పద్మభూషణ్ పురస్కారాలు ఆయన్నెప్పుడో వరించి ఉండవలసింది. దేశదేశాలు ఆయన అసమాన ప్రతిభని గుర్తించి గౌరవించినా...మనలో చాలామందికి రాజన్‌బాబు పేరు తెలియక పోవడం శోచనీయం. ఫోటో కళాకారుల పట్ల మన నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం. సుదీర్ఘ పరిచయంతో నేనూ వారి కుటుంబంలో ఇమిడి పోయాను. నాకు వారింట్లో అమితంగా నచ్చే పిలుపు భార్య పద్మను రాజన్‌గారు 'మమ్మీ' అని పిలవడం. పద్మగారు రాజన్‌బాబును 'నాన్నా' అని పిలవడం. పెద్దతనపు బంధంలోని ఆ పిలుపులో గొప్ప జీవన సౌందర్యం కనిపించేది నాకు. "నాన్నా నాతో ఒక్కసారి మాట్లాడవా'' అని పార్థీవశరీరంపై పడి ఆవిడ విలపిస్తుంటే తట్టుకోలేక పోయాను.

కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండి ఆయన్ని కలవడంలో కొన్ని నెలలు గ్యాప్ వచ్చింది. ఆయన నుంచి ఫోన్... "నేనింకా బతికే ఉన్నా... చచ్చిపోలేదింకా...ఇంటికి రావడం మర్చిపోవడమేనా'' అంటూ మాట్లాడారు. వెళ్లి కలిశాను. కానీ , 'నిష్క్రమణం' ముందే తెలిసినట్లున్న ఆ మాటలు ఇప్పుడు మనసుని మెలిపెడుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా...పెద్ద వాళ్లని చూసి రావడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి.

రియల్ టీచర్

'మంచి ఫోటోగ ఫ్రీకి రూల్స్ లేవు.. కానీ మంచి ఫోటోగ్రాఫ్‌లు ఉంటాయ'ంటారు తెలుగు ఫోటోగ్రఫీకి అంతర్జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన రాజన్‌బాబు. ఈ రోజున దేశ, విదేశాల్లో అవార్డులు అందుకుంటున్న తెలుగు ఫోటోగ్రాఫర్లందరూ ఆయన శిష్యులే.

తనకు తెలిసిందంగా నవతరానికి నేర్పాలనే ఆయనలోని తపన అద్భుతం. క్లాస్‌రూమ్‌లో కూర్చోపెట్టి నేర్పితే ఫోటోగ్రఫీ రాదంటారాయన. వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభ నింపవచ్చన్నారు. దేశమంతా తిరిగి వేలాది వర్క్‌షాప్‌లు నిర్వహించారు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అయనను వెతుక్కుంటూ వచ్చాయి.

Alumni portfolio

KV Reddy

BK Agarwal

Chandana Srinivas

MC Shekher

Suneeta

Sadanandam S

Srinivas Mekala

Amzad


కానీ ఆయన ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. పద్మశ్రీ వంటి పురస్కారాలు ఆయనకు దక్కకపోవడానికి అదే కారణం కావచ్చు. ఆయనకు పద్మ పురస్కారం మిగలకపోవచ్చు కానీ ఈతరం ఫోటోగ్రాఫర్లకు అపురూపమైన చిత్రాలు మిగిల్చివెళ్లారాయన. ఫోటోగ్రఫీలో అరుదైన డోపింగ్ కళ ఆయనకే సొంతం. ప్రపంచంలో పిక్టోరియల్ ఫోటోగ్రఫీ లోతులు తెలిసిన మహనీయుల్లో రాజన్ మొదటివరసలో ఉంటారు. ఈ రోజున ఆయన లేరు... ఆయన స్ఫూర్తి ఉంది. 
- కె. విశేవందర్ రెడ్డి, హైదరాబాద్ ఫొటోసర్కిల్ కార్యదర్శి

ఇంకా ఇచ్చేవారు!


ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి తొమ్మిదిన, మళ్లీ మూడు వారాల క్రితం ఫ్యామిలీ ఫంక్షణ్‌లో ఎంతో ఆనందంగా కనిపించిన ఆయన ...కేర్ హాస్పిటల్ బెడ్‌లో అచేతనంగా పడి ఉండడం జీర్ణించుకోలేని దృశ్యం. ఏదో చెయ్యాలి... ఇంకా చెయ్యాలన్న తపన ఉన్న మనుషులు వెళ్లిపోతే నష్టం వ్యక్తుల కన్నా సమాజానికే ఎక్కువ.

మిత్రుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి అన్నట్లు "ఇప్పటి రోజుల్లో 73 ఏళ్ల వయసు ఏమీ చెయ్యలేని వృద్ధాప్యం మాత్రం కాదు. ఇప్పటికీ రాజన్ తాను ఇవ్వదల్చుకున్నది సమాజానికి ఇచ్చేసినా, ఇంకా ఇవ్వగలిగింది ఇచ్చుండే వారు. మెరికల్లాంటి యువ ఫోటోగ్రాఫర్లని సమాజానికి అందించ గలిగుండేవారు.

ముఖ్యంగా, ఈ రాష్ట్ర ఛాయాచిత్ర కుటుంబం ఇంటి పెద్దని కోల్పోయింది'' ఎక్కడికి వెళ్లినా ఆయన వెనకే ఉండి ఫోటోగ్రఫీ మెళకువలు నేర్చుకొని, అమెరికాలోనూ అదే విద్యని అభ్యసించి వచ్చిన ఆయన చిన్న కుమారుడు చిరంజీవి రమణలో రాజన్ గారిని చూసుకోవచ్చన్న చిన్న ఓదార్పు మాత్రమే నాలాంటి వారికి ఊరటనిస్తోంది. 

Students portfolio

Anil Kumar T

Anupama Chakraborthy

Karthik Raju

S N Reddy

Dinesh Parchuri

Thursday, August 25, 2011

అయామ్ లెజెండ్..'' నేనే బలాన్ని''

మరుగుదొడ్లు సాఫు చేసే మెహతర్ కులంలో పుట్టి దేవుళ్లను, దేవుళ్ల ఆస్తులను సంరక్షించే మంత్రిత్వ శాఖను నిర్వహించే స్థాయికి ఎదిగిన టి.ఎన్.సదాలక్ష్మి ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు సిసలైన స్ఫూర్తికి గొప్ప నిదర్శనం. ఎందరో నాయకులను నిగ్గదీస్తూ, అన్యాయాలను ఎదుర్కొంటూ, నిత్యం న్యాయం వైపే నిలబడుతూ, ఎక్కడా రాజీపడకుండా బతికిన మనిషి సదాలక్ష్మి. ఒక స్త్రీగా, మాదిగగా, తెలంగాణవాదిగా... ఎన్నిటికి ఎదురీది ఆమె గొప్ప నాయకురాలిగా, మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకుందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే 'అడుగడుగునా నాకు చరిత్ర ఉంది' అని అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిందామె. ఆమె జీవితకథ నుంచి కొన్ని ఆసక్తికర భాగాలు .....

డిప్యూటీ స్పీకర్‌గా నా అనుభవాలను, అప్పటి అచీవ్‌మెంట్స్‌ను తలుచుకుంటే చాలా సంతోషమనిపిస్తుంది. సభలో అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, వావిలాలగోపాల కృష్ణయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, వందేమాతరం రామచందర్ రావు లాంటి హేమాహేమీలంతా ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ నాకు ఇబ్బంది కాలేదు. నా రూలింగ్‌ను ప్రతిపక్షం వాళ్లే మెచ్చుకునే వారంటే ఇగ అర్థం చేసుకోండి.

నేనొకటి గమనించాను. సభలో ఎక్కువ ఛాన్స్ అపోజిషన్‌కు ఇవ్వాలి. వారు స్టడీ చేసి వస్తరు. సప్లిమెంట్ క్వశ్చన్స్ వేస్తరు. అపోజిషన్ వారికి అవకాశం ఇస్తే గవర్నమెంట్‌కు కూడా మంచిది. విమర్శ వస్తే కనువిప్పు కలుగుతుంది గద. అప్పట్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా అల్లూరి సత్యనారాయణ ఉండేవాడు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వవలసిందిపోయి ప్రతీసారీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కలగజేసుకునేవారు. ఆ మంత్రికి జవాబు చెప్పడానికి వీలుకాకపోతే ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది కానీ, ముందే ముఖ్యమంత్రి కలగజేసుకోవడం నాకు నచ్చేది కాదు.

దాంతో ఒకసారి 'ప్లీజ్ ఆనరబుల్ సి.యం..యు మే టేక్ యువర్ సీట్. కన్సర్న్‌డ్ మినిస్టర్ మస్ట్ రిప్లయ్' అన్నాను కటువుగా. ఒక ముఖ్యమంత్రిని 'కూసో..' అన్నోళ్లు చరిత్రలోనే లేరు. నా వరకు నేను ప్రొసీడింగ్స్ తప్పితే భరించలేను. అది అసెంబ్లీ అయినా. కుటుంబమైనా. ఎవర్నయినా పేరు పెట్టే పిలుస్తాను, 'మాదిగది ఎంత పొగరు' అనుకున్నా నేను పట్టించుకునేది కాదు. అధికారం ఒక దళిత మహిళ చేతుల్లోకి వస్తే ఆమె మనసు పెట్టి పని చేస్తుందనడానికి నేనుఉదాహరణ.

పి.వి.జి రాజుతో హోరాహోరీ

ఎమ్మెల్యేగా వున్నప్పుడు ప్రజల్ని సదువుకోవాలి. ఆ రోజుల్లో నన్ను అడిగేవారికి, 'ఎవరికి శాసనం అవసరమో ఆ శాసనానికి సభ్యులు వాల్లు గావాలి' అని చెప్తుంటి. అగ్రకులస్తులైతే ఆ శాసనం వారికేమి వర్తిస్తది! అంటే బాగ బల్సినోడికి.. ఆకలి దీర్చే విధానం ఎట్ల తెలుస్తది? దీనిని ఆకలంటరు అంటే..ఏమాకలి? ఎందుకైతది ఆకలి? అని అడుగుతరు. ఆ కోవకు చెందిన వాడే పి.వి.జి. రాజు. అప్పుడు హెల్త్ మినిష్టరుగున్నడు.

ఒకసారి 'వాటీజ్ దిస్ సదాలక్ష్మి .. హంగ్రీ హంగ్రీ...! వాటీజ్ దిస్ హంగ్రీ! ఐ కాంట్ అండర్‌స్టాండ్' అన్నడు. 'చెప్త అయ్యా నువు రాజువురా నీకెందుకర్దమైతదీ ఆకలి అన్న. ఎంబడే అన్న 'సిల్వర్ స్పూన్...గోల్డ్ స్పూన్ పుట్టుక నీది. బీద వాళ్ల ఆకలి నీకేందెల్సు?' అన్నాన్నేను. 'నీ కొరకు అన్నం కాచుకొనుంటది. పేదవాడు అన్నం కొరకు కాచుకొనుంటడు. దటీజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్!' అంటే అతను నోరిప్పలేదు. కండ్లెల్ల వెట్టిండు'.

దళితుల దగ్గర గుగ్గిళ్లు కూడా కొనరే...

ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ 'ఆ పల్లెటూర్లు బాగుపడాలంటే, ఆర్థికంగా మెరుగుపడాలంటే మొట్టమొదటగా ఆయా గ్రామాల దళిత వాడలు ఆర్థికంగాను, అన్ని రకాలుగాను బాగుపడాలి. అందుకు దళితులకు భూములివ్వాలి. గ్రామాలలో ఇతర కులాల బీదలు కూడా ఉన్నారు. ఆ ఇతర బీదలకు, దళితులకు ఆర్థికంగా భేదం లేకపోచ్చును గాని, నాదొక మనవి. ఆ ఇరువురికీ ఒక ముఖ్యమైన భేదం ఉంది.

ఇతర జాతి బీదవాండ్లు ఏదో ఒక వృత్తి చేసుకుని బతకొచ్చు. గుగ్గిళ్లయినా వేసుకొని అమ్ముకొని బ్రతుకవచ్చు. కాని ఆ అవకాశం కూడా దళితులకు లేకపోవచ్చు. దళితులను అంటరానివాళ్లుగా చూస్తూ ఆఖరుకి వాళ్ల గుడ్డలు అంటుకున్నా కాని ఆ గుడ్డలను నీళ్లలోవేసి తడుపుకొనేటపుడు, ఇంక వాళ్ల దగ్గర గుగ్గిళ్లు ఎవరు కొంటారు? అంటే ఆ గుగ్గిళ్లయినా అమ్ముకొని బ్రతికే అవకాశం దళితులకు లేదన్నమాట. కనుక భూములను ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దళితులకివ్వాలని నేను మనవి చేస్తున్నాను'.

ఎండోమెంటు బాపనోల్ల రిజర్వేషనుగా ఉండె

ఎండోమెంటు శాఖలో రిజర్వేషన్లు గూర్చి చెబుతూ ఆమె... 'దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజర్వేషన్లు లేవు గద. అంతా బాపనోల్లే. ఆల్లకే రిజర్వేషను నడిసింది. అక్కడ కమిటీల్లో పూజార్లుగ దళితులను నియమించాలని'బెట్టిన నేను. అండ్ల పదిహేను శాతం మాల మాదిగలు పూజార్లు కావాలె. దానికి యాదగిరి గుట్టలో ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ జేసిన. ఇపుడు పదిహేను శాతం రిజర్వేషన్‌లు తీసుకుంటున్నరు. దేవాదాయ భూములున్నయి.

అవి ఆక్షన్ బెడితే ఎవరో వేరే కులస్తుడు దీసేసుకుంటడు. దాన్ని ఆప్షన్ బెట్టకుండ మూడు సంవత్సరాలు యావరేజ్ తీసుకొని దళితులకిచ్చే విధానాన్ని చేసేసిన. అస్సలు గుడుల నుంచే అన్‌టచబులిటీ స్టార్టయ్యింది. అందుకే ప్రతీ ట్రస్టులో ఒక దళితుడుండాలని, ఒక ఆడ మనిషి ఉండాలని పెట్టిన. ఇంకొకటి ఏమంటే భక్తి ఎక్కువుంటది ఆడవాల్లకు. ఆ విధంగా నేను స్వయాన ఆడ మనిషినైనందుకు, నా కులం దళిత అయినందువల్ల దళితుల నుంచి రిప్రజెంటేషన్ ప్రతీ ట్రస్టులో పెట్టిన. అన్‌టచబులిటీ పోవాలనేసి.

ప్రతీ ట్రస్టులో 'షెడ్యూల్డ్ క్యాస్ట్' అనేటాల్లకు లబ లబ లబ మొత్తుకున్నరు దేశమంత. అన్ని దిక్కుల్నించి వ్యతిరేకత వచ్చింది. తిరుపతి ట్రస్టులో వేసుకోవటం అయితే వాళ్లకు చాలా కష్టమైంది. అయినా నేను చేసేసిన గద. తప్పని స్థితిలో ఇంప్లిమెంట్ చేయాల్సొచ్చిందన్నట్టు. నాపై వ్యతిరేకత ఎంతవరకంటే చంపేస్తమని బెదిరింపులదాక వచ్చింది.'చంపేస్తం. నువు మాల మాదిగలను అర్చకులను ఎట్ల ఏస్తావ్' అని టెలిఫోన్లు, ఉత్తరాలు.

ఇంక కొంత మంది ప్రజలు 'ఎట్లేస్తవమ్మ, ఎట్ల తయారు చేసినవు' అని గునుగుడు. కాంగ్రెస్ అధిష్టానం నా ముందు ఏమన్లే. ఒక వేల వాల్లు ఒత్తిడి చేసినా నేను భయపడగద... భయపడను. అందర్కిదెల్సు, ఆమె అనుకున్నది జేస్తదని. అందుకే మినిస్ట్రిల ఉండనివ్వలేదు. రెండు సంవత్సరాలకే మార్చేసిన్రు గద! ఎండోమెంటు నించి ఎక్కువ దళితులకు సాయం చేస్తుండేది గుడుల తరఫు నుంచి. దాన్ని ఓర్చుకోలేకపోయిన్రు. ఇగ నన్ను ఉంచలేదు. నా కొరకు పార్టీల అడిగెటోడు లేడు. దిక్కు దివానం లేదు. ఏది జేసినా నేనే జేసుకోవాలె.

లెదర్ బోర్డుతో రగులుకొని 'ఏబీసీడీ' ఉద్యమమైంది

'లిడ్‌క్యాప్ 1960లో అనౌన్స్ అయ్యింది. నేను 1984-85 మధ్య సంవత్సరం పాటు దాని చైర్‌పర్సన్‌గ పనిజేసిన. అప్పుడు లిడ్‌క్యాప్‌ను అభివృద్ధిలోకి తెచ్చేందుకు చాలా జేసిన. కెపాసిటి పెంచినం. దాని విషయాలన్నీ స్టడి చేసేందుకే సంవత్సరమయింది. లిడ్‌క్యాప్‌లో చాలా పన్జెయ్యగలుగుతం అని మనవాల్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన, ఇంక నన్ను తీసేసిన్రు. నేను పొజీషన్‌లో ఉన్నప్పుడు అన్ని గూడ వాల్లకూ వీల్లకు అంటే మాలోల్లకు మాదిగోల్లకు కల్సి చేసుకుంటూ వచ్చిన.

అప్పుడు అందరు నన్ను పొగిడిండ్రు. 'మన షెడ్యూల్డ్ క్యాస్ట్‌ల కొరకు ఒక్కతే ఫైట్ చేస్తది, సాధిస్తది' అని అందరు మెచ్చుకున్నరు. కాని మాలలు పొజీషన్‌లో ఉన్నప్పుడు మాత్రం వ్యతిరేకం జేస్తూ బోయిండ్రు. అదెట్లాగో చెబుత. లెదర్ పని మాదిగలు జేస్తరు. అందుకే లెదర్ బోర్డును కూడా 'హ్యాండ్లూమ్ బోర్డు' లెక్కనే చెయ్యాలి, అప్పుడే మాదిగలు ఆర్థికంగ బాగుపడ్తారనేసి నేను చెబ్తూ వస్తున్న. అప్పుడు చీఫ్ మినిష్టరుగున్న దామోదరం సంజీవయ్య 'నీకెందుకు నేను చేస్తగద' అంటూనే దాన్ని 'అడ్వైజరీ బోర్డు' కింద జేసేసి అందుట్ల అందర్ని బెట్టిండు.

అంటె దాన్ని జనరల్ చేసేసిండు. ఆయన మాల. ఆ తర్వాత అడ్వయిజరీ బోర్డుకు మేనేజింగ్ డైరెక్టర్‌గ ఇంకో మాల ఐ.ఏ.ఎస్ వచ్చిండు. ఆయనొచ్చి ఢిల్లీకి బోయి లెదర్ బోర్డుని ఏకంగా కంపెనీ యాక్ట్ కిందకు తెచ్చిండు. అది కంపెనీ అయిపోయిందిక. అంటె ఏ కులంది గాదు. అన్ని కులాలవాల్లు జేరిండ్రు. దీని వల్ల చివరికి ఎక్కువగ కమ్మోల్లు, ముస్లింలు అందులో జేరి లబ్ది పొందిన్రు. మాదిగోల్లకు మాలోల్లు చేసిన మహోపకారం ఇది!

ఆరోజు సంజీవయ్య గుర్తుబెట్టుకోని మరీ దాన్ని అడ్వైజరీ బోర్డు జేసినాడంటె మాదిగోల్ల నోటికాడి కూటిని తన్నినట్లు కాలేదా? ఇంత కక్ష ఉన్నదా? మన మీద అనిపించింది. ఇదే గాదు. అన్ని చోట్ల ఇట్లనే జేసిండ్రు. 1952 నుంచి కౌన్సిల్ టికెట్ మాలలకియ్యడం, అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు మాలలకే ఇయ్యడం, అది ఎంతవరకూ వచ్చిందంటే 'రిజర్వుడు నియోజక వర్గాల్లో మాలలకు తప్ప ఎవ్వరికీ అవకాశం లేదు'అనే కాడికొచ్చింది.

ఇటువంటివన్ని నా కడుపులో రగులుకున్నవి. రగులుకోని రగులుకోని ఇక నాకు అప్పట్నించి క్యాటగిరైజేషన్ కావాలి అనేసి మనసుకొచ్చింది. ఇంకా హెచ్ఎమ్‌టి, ఐడిపియల్ వంటి పబ్లిక్ సెక్టార్లు వున్నయి కదా. అక్కడ రిజర్వేషన్ పోస్టులన్ని గూడ అప్పుడు అప్పారావు ఐ.ఎ.యస్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్‌గ ఉండె. ఆయన చక్రం తిప్పి పెద్దకాడి నుంచి చిన్నకాడికి పోస్టులన్నీ చివరికి చెప్రాసీ పోస్టు గూడ మాలోల్లకే ఇచ్చిండు. అదీ ఆంధ్ర మాలలకే. ఒక్కటి గూడ మాదిగకియ్యలే.

అంటె వాల్లకు చాన్సున్నప్పుడు వాల్లోల్లకే ఇస్తూ బోయిండ్రు. నాకు ఛాన్సున్నప్పుడు ఇద్దర్కి కల్పి ఇచ్చిన.ఈ బ్రాడ్ మైండ్ వాల్లకు లేకపాయె. మల్ల అందరమొక్కటే పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో ఉండి గూడ ఆ విధంగ జేసిండ్రు వాల్లు. మనోల్లకు ఇంత నష్టమైపోతుంది గద కనీసం క్యాటగిరైజేషన్ చేస్తేనే మాదిగలకు అవకాశముంటుంది ఇగ తప్పదు అని నా మనసుకు బలంగా వచ్చింది. అక్కడే దండోరకు పునాదులు పడ్డయనుకో. నాకు అడ్వైజర్స్ ఎవ్వరు లేరు. అందులో ఈ సంజీవయ్య టైములోనే బ్యాక్‌వర్డ్ క్లాస్‌కు క్యాటగిరైజేషన్ గూడ వచ్చింది.

నేను దాన్ని బేస్ చేసుకుని, నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌ని అప్లయ్‌జేస్తు ఆలోచించిన. దానికంత సమయం పట్టింది. ఇక ఎస్సీలల్ల వర్గీకరణ కావాలని 1972లో జలగం వెంగళరావు చీఫ్ మినిస్టర్‌గ ఉన్నపుడు మెమోరాండం సబ్‌మిట్ జేసిన. అప్పటి నుంచి చీఫ్‌మినిస్టర్లకంత చెప్తూ, చెప్తూ వచ్చిన మొన్నటి దాక. దానెనుక అంత ఉందన్నట్టు. అపుడు కొందరు నన్ను 'నువు పిచ్చి దానివా? అట్ల ఎట్లయి దనుకుంటవ్' అన్నరు. 'మీకర్దమైత లేదండి నా కర్దమైతుంది' అనే దాన్ని.

ఆడది సమానమెట్లవుతది... ఎక్కువ కదా!

సమానత్వం, సమానత్వం అంటూ వుంటే నా చిన్న బుద్ధికి అదే అందకుండా ఉంది. అర్థం కాకుండా ఉంది. ఒక వేళ పురుషులు పురుషులకి పుట్టినట్టయితే, స్త్రీలకి స్త్రీలు పుట్టినట్టయితే సమానమనడంలో అర్థం వుండెటిది. అట్ల కాదే ఈ సృష్టే సృష్టిని ఆడవారి చేతిలో పెట్టింది. అంటే దేవుడనే వాడు ఒకడుండి, సృష్టిని సృష్టించి ఆ సృష్టిని ఆడవాళ్లకి పెట్టిండని నా దృక్పథం. కనుక మరి ఆడవారికి జన్మ ఆడదే ఇస్తది. మగవారికీ జన్మ ఆడదే ఇస్తది. మరి శరీరంలో వుండే రక్తమాంసాలన్నిటిని కరిగించి వారికి జన్మనిచ్చే ఆడది గొప్పదా? జేబులో చేతులు పెట్టుకుని తిరిగే మగవాడు గొప్పవాడా? కనుక నా దృక్పథంలో స్త్రీ గొప్ప. అది యదార్థం. సత్యం, ఒప్పుకుని తీరాల్సిందే సమాజం ఒక రోజు.

ఒక చిన్న ఉదాహరణ. ఒక యంత్రం వుంటది. ఆ యంత్రం ద్వారా ఒక పరికరం ఉత్పత్తి అయితది. ఆ పరికరం, మరి యంత్రం ఒకటేనా? యంత్రం అంటే స్త్రీ గర్భం అనుకోండి. పరికరంను యంత్రాన్ని సమానంగా చూస్తారా?ఆ ఉత్పత్తి ఎంతో బలంగా ఉండాలె, నాణ్యతగా ఉండాలె అని ఆ యంత్రాన్ని ఎంతో అపురూపంగా, జాగ్రత్తగా దానిని అప్పుడప్పుడూ సర్వీస్ చేయించడమో, లేకపోతే రిపేర్, అంటే వస్తువులు తగిలి పాడవకుండా చూడడమో జరుగుతుంది.

మామూలు యంత్రం పట్లనే ఇట్ల ఉంటే అందరికీ జన్మనిచ్చే స్త్రీ పట్ల ఎట్ల ఉండాలి. ఈ తల్లికి పరికరాలుగా పుట్టే ఈ జనాభా ఆడ, మగ ఎంత మంచిగ చూడాలి. మంచి సంతానం కొరకై తల్లిని సమాజం అపురూపంగా చూడాలె. ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని చూడాలె. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదని నా అభిమతం. అంతేగాని పురుషులను గుడ్డిగా ద్వేషించడం నా ఉద్దేశం అసలే కాదు. నిజానికి నాకు రాజకీయాలు నేర్పిన గురువులు పురుషులే.

మిక్స్‌డ్ హాస్టళ్లు పెట్టిన

1967లో సాంఘిక, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా నేనున్నప్పుడు ఎస్సీలు, బీసీలు, ఓసీలు కలిసిపోవాలని ప్రయత్నం జేసిన. కేవలం మాల, మాదిగ అంటే 'మామా' విద్యార్థులనే బెడ్తే అదే పరిస్థితులు వుంటాయని, అందరూ మిక్స్‌డ్ కావాలెనని ఆలోచన చేసిన. అట్ల సాంప్రదాయంగా ఎదగాలంటే ఒకరి అలవాట్లు ఒకరు చూసుకోవాల, నేర్చుకోవాలని అన్ని హాస్టల్లల బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మ, వెలమలను కూడా పెట్టిన.

అది ఇప్పటికీ నడుస్తున్నది. ఇంకా వీకర్ సెక్షన్స్ హౌజెస్‌లో గూడా బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు, దళితులకు వేర్వేరుగ వుండేవి. నేను ఒకటే దగ్గర నిర్మించే ఏర్పాటు చేసిన. నాకు ఎవ్వరు నేర్పలేదు. ఇట్లైతే బాగయితది. ఇట్లైతే ఈ చైతన్యం వొస్తది. వాళ్ల అలవాట్లు వీళ్లకి, వీళ్ల అలవాట్లు వాళ్లకు అబ్బి స్నేహం పెరిగి గ్యాప్ తగ్గుతదని. లేకుంటె ఎక్కడున్న వాళ్లు అక్కడే వుంటరు కదా అని అట్ల జేసిన'.

'చంపేస్తం. నువు మాల మాదిగలను అర్చకులను ఎట్ల ఏస్తావ్' అని టెలిఫోన్లు, ఉత్తరాలు. ఇంక కొంత మంది ప్రజలు 'ఎట్లేస్తవమ్మ, ఎట్ల తయారు చేసినవు' అని గునుగుడు. కాంగ్రెస్ అధిష్టానం నా ముందు ఏమన్లే. ఒక వేల వాల్లు ఒత్తిడి చేసినా నేను భయపడగద... భయపడను. అందర్కిదెల్సు, ఆమె అనుకున్నది జేస్తదని. అందుకే మినిస్ట్రిల ఉండనివ్వలేదు. రెండు సంవత్సరాలకే మార్చేసిన్రు గద!

Thursday, July 21, 2011

తెలివి * కథా సరిత్సాగరం


భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో నీతి కథలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక తరం నుంచి మరొక తరానికి విలువలను అందించటంలో ఈ కథల ప్రాముఖ్యం ఎనలేనిది. సంస్కృత కథాసరిత్సాగరంలోని కథలను ప్రముఖ రచయిత జగన్నాథ శర్మ తెలుగు పాఠకులకు సులభమైన శైలిలో అందించారు. అందరికీ ఆసక్తి కలిగించే ఓ కథ పాఠకుల కోసం...

అనగనగా రత్నపురం. అక్కడ రామకృష్ణుడు అని బాగా తెలివితేటలు గల ఓ వ్యక్తి ఉండేవాడు. తన తెలివితేటలతో ఎదుటి వ్యక్తుల్ని బురిడీ కొట్టించి బతుకుతుండేవాడు. చిన్న చిన్న బురిడీలతో రెండు పూటలా భోజనం, వేలకొలదీ వరహాలు మాత్రమే సంపాదించుకోగలిగేవాడు. ఇది సరికాదనుకున్నాడు. ఉన్న తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించాలి. కోటీశ్వరుడైపోవాలని కలలుగన్నాడు. కన్న కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకనాడు పెద్ద వర్తకునిలా వేష భాషలు మార్చుకుని రాజద్వారం దగ్గర నిల్చున్నాడు. భటులు అతన్ని చూశారు.

"ఎక్కణ్ణుంచి వచ్చారయ్యా మీరు?''అడిగారు. "సింహపురి నుంచి వచ్చాను. నా పేరు రామకృష్ణుడు. రత్నాల వ్యాపారిని. రాజుగారిని చూడాలనుకుంటున్నాను. అనుమతి ఇస్తారా?'' అడిగాడు.
"అనుమతి ఇవ్వాల్సింది మేము కాదు, రాజుగారివ్వాలి. అడిగి చూస్తాం'' అన్నారు భటులు. వెళ్ళి రాజుగారిని అడిగారు.
"ప్రవేశపెట్టండి'' అనుమతించాడు రాజు. రామకృష్ణుడు ఆనందంగా ప్రవేశించాడు. రాజుకి రత్నాలహారాన్ని కానుకగా అందజేశాడు.
చూశాడు రాజు దాన్ని. బాగున్నదని మెచ్చుకున్నాడు.
"చెప్పండి! నన్నెందుకు చూడాలనుకున్నారు?'' అడిగాడు రాజు.
"ఆ విషయం మీతో ఏకాంతంగా మాట్లాడాలి'' అన్నాడు రామకృష్ణుడు.
"మాట్లాడండి'' అంటూ తన ఏకాంత మందిరానికి దారి తీశాడు రాజు. అతన్ని అనుసరించి వచ్చాడు రామకృష్ణుడు.
"చెప్పండి ఏం మాట్లాడదలచారు?'' అడిగాడు రాజు.
"ఇంకేం లేదు మహా ప్రభూ! మీరు నాకో చిన్న సాయం చెయ్యాలి'' "తప్పకుండా చేస్తాం. ఏం కావాలో కోరుకోండి'' "సభలో అందరూ చూస్తుండగా మీరు నాతో ప్రతి రోజూ ఓ క్షణం మాట్లాడాలి. నేను అడిగినప్పుడు మాట్లాడాలి. ఇది నా ప్రార్థన'' అన్నాడు రామకృష్ణుడు.
"ఏం మాట్లాడాలి?'' "ఏదో ఒకటి...నా చెవిలో ఒకటి రెండు అంటూ పది వరకు అంకెలు లెక్క పెట్టండి చాలు! అయితే అవి నాకు మాత్రమే వినిపించాలి'' అన్నాడు రామకృష్ణుడు. చిత్రంగా ఉందే ఇతని కోరిక అనుకున్నాడు రాజు.
"మీరు ఊరికే అంకెలు లెక్కపెట్టనవసరం లేదు. మీరు నా చెవిలో పది అంకెలు లెక్కపెట్టినందుగ్గాను మీకు రోజూ నేను అయిదు వందల వరహాలిచ్చుకుంటాను'' అన్నాడు రామకృష్ణుడు.
"బాగుందిది'' అని పగలబడి నవ్వాడు రాజు.
"అయిదు వందల వరహాలిస్తానంటే చెవిలో పది అంకెలేం ఖర్మ! పాతిక అంకెలు లెక్కపెడతాను'' అన్నాడు రాజు.
అన్నట్టుగానే సభలో అందరూ చూస్తుండగా రామకృష్ణుడి చెవిలో అతనికి మాత్రమే వినబడేట్టుగా రోజూ రాజు పది అంకెలు లెక్కబెట్టేవాడు. అలా అంకెలు లెక్కబెట్టినందుగ్గాను రామకృష్ణుడు రాజుగారికి అయిదు వందల వరహాలిచ్చేవాడు. ఓ నెల గడిచింది. ప్రతిరోజూ రాజుగారు రామకృష్ణుడితో చెవిలో మాట్లాడడాన్ని గమనించిన సభలోనివారు, రామకృష్ణుడు తక్కువ వాడు కాదని, రాజుకి బాగా కావాల్సినవాడనే నిర్ణయానికి వచ్చారు. ఇంతలో కష్టానికీ నష్టానికీ దాచుకున్న డబ్బంతా కరిగిపోవడంతో రామకష్ణుడు కూడా ఓ నిర్ణయానికి వచ్చాడు. దాని ప్రకారం సభలో ఓ అధికారిని పదేపదే చూడసాగాడు రామకృష్ణుడు.
రాజు అంకెలు లెక్కపెట్టాక వారించి మళ్ళీ అధికారిని చూడసాగాడు. సభ ముగిసింది. రామకృష్ణుడు బయటకు నడిచాడు. అతన్ని అనుసరించాడు అధికారి.
"నేనేం తప్పు చేశానయ్యా, నా గురించి మీరూ రాజుగారూ మాట్లాడుకున్నారు'' అడిగాడు అధికారి.
"ఏం తప్పు చేశావో నేను చెప్పను! నీకే తెలుసు! అది నిజమా? కాదా అన్నది రాజుగారు నన్నడిగారు. తెలుసుకుని చెబుతానన్నాను.'' అన్నాడు రామకృష్ణుడు. అధికారి రాజుగారికి తెలియకుండా చాలా తప్పులు చేశాడు. ఏ తప్పన్నది అతనికి కూడా అంతు చిక్కడం లేదు. ప్రమాదం నుండి గట్టెక్కాలనుకున్నాడతను. ఆధారంగా రామకృష్ణుణ్ణే పట్టుకున్నాడు.
"తెలియక ఏదో తప్పు చేశాను. మీరే నన్ను కాపాడాలి'' అన్నాడు అధికారి. వెయ్యి వరహాలు రామకృష్ణుడికి లంచంగా ఇచ్చాడు. "సరే! నేను చూసుకుంటాను'' అన్నాడు రామకృష్ణుడు. మర్నాడు రాజుగారు అంకెలు లెక్క పెట్టాక బయటికి వచ్చాడు రామకృష్ణుడు. అధికారి అతన్ని అనుసరించి పరుగు పరుగున వచ్చాడు.
"రాజుగారు నిన్ను క్షమించేరు. నీకింకేం భయం లేదు'' అన్నాడు రామకృష్ణుడు. "కృతజ్ఞుణ్ణి'' ఆనందించాడు అధికారి. అప్పణ్ణుంచి అదే పనిగా సభలోని మంత్రుల్నీ, సామంతుల్నీ, రకరకాల అధికారుల్నీ రామకృష్ణుడు చూస్తూ ముందు రీతిలోనే లంచాలు గడించసాగాడు. పదికోట్ల వరహాలు సంపాదించాడతను. అనుకున్నట్టుగానే కోటీశ్వరుడయిపోయాడు. అయిన తను చేస్తోన్నది తప్పు అని తెలుసు. అక్రమార్జన ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయిందతనికి. రాజుని కలిసి జరిగిందంతా వివరించాడు.
"మీకు ప్రతిరోజూ అయిదు వందల వరహాలిస్తూ కూడా నేను పదికోట్ల వరహాలు సంపాదించగలిగాను. తప్పు చేశాను. పైగా ఆ పదికోట్ల వరహాలు అనేకమంది అనేక రకాలుగా మీ రాజ్యం నుంచి కొల్లగొట్టిందే! అంటే ఆ డబ్బు మీదే! మీరే స్వీకరించండి'' అని పదికోట్ల వరహాలూ రాజుకి అందజేశాడు రామకృష్ణుడు. అతనిలో వచ్చిన మార్పునకు ఆనందించి రాజు, రామకృష్ణుణ్ణి సామంతునిగా చేసుకున్నాడు. ఓ రాజ్యానికి అతన్ని రాజుని చేశాడు. అంతేకాదు, తనకి ప్రధాన సలహాదారునిగా కూడా నియమించుకున్నాడు. అందుకే అంటారు, నుయ్యి తవ్వుతోంటే కాసుల బిందెలు దొరికినట్టు తెలివిగలవాడు పెద్దగా కష్టపడనక్కరలేకుండానే డబ్బు సంపాదించగలడని!

పుస్తకం : కథా సరిత్సాగరం
రచయిత : ఎ.ఎన్. జగన్నాథశర్మ, పేజీలు: 164
ధర: 130, ప్రతులకు : విశాలాంధ్ర

Friday, November 12, 2010

హాస్యబ్రహ్మ జంధ్యాల

నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం
“జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల!” అన్నట్టు జంధ్యాల గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. “మనిషి జీవితం బాధల, సమస్యల మయమై ఉంటుంది. అలాంటి మనిషి థియేటర్కు వచ్చినపుడు అతనికి కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే నా ధ్యేయం. అందుకే నేను ఎక్కువగా హాస్యరస ప్రధానమైన చిత్రాలు రూపొందించడానికే ఇష్టపడతాను. రచయితగా నేను హాస్యమే రాశాను. దర్శకుడుగా హాస్యాన్నే పంచుతున్నాను. అయితే హాస్యం రాయడం, హాస్య చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పనులు. కొంచెం శృతి మించితే హాస్యం అపహాస్యమవుతుంది. హాస్యానికి, అపహాస్యానికీ మధ్య రేఖా మాత్రమైన భేదం మాత్రమే ఉంటుంది. నేను నా శక్తివంచన లేకుండా హాస్యాన్ని హాస్యంగా ఉంచడం కోసమే ప్రయత్నిస్తున్నాను…” అంటూ తెలుగుచిత్ర సీమలో 1976 నుంచి 2000 వరకూ రారాజుగా వెలిగిన నవ్వులరాజు జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి! ఆయనకి రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు ఆయన సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల… మచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో జీవిత సత్యాలు, బోలెడు ప్రాసలు, సినిమా నటీనటులకు సంబంధించినవి… ఎన్నో ఉన్నాయి. తెనాలి రామలింగ కవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు మనకు ఎన్నో కనిపిస్తాయి.
ఊరికే హాస్యం కోసమే హాస్యస్ఫోరక ప్రయోగాలు చెయ్యటం కాక అంతర్లీనంగా ఆయనలోని పాండితి, ఆవేదన అన్నీ తెలిసేవి జంధ్యాల రచనలో, చిత్రాల్లో.
ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. “క”తో ఇస్తా ఏకాకి… కాకీక కాకికకాక కోక… ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా…!? ఇందులో 24 “క”లున్నాయి… ఎలా ఉంది?
పోనీ ఇంకోటిస్తా… “న” మీద “నాని నాని… నీనూనె నీనూనె నానూనె నూనె… నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూననీ నిన్న నేనన్నానా ..నోనో.. నేన్నానా నున్నని నాన్నా… నెననై…ఇందు లో 56 ‘నా’లున్నాయి లెక్కచూసుకో కావాలంటే. - అని సవాల్ విసరగల “దమ్మున్న” రచయిత జంధ్యాల.
తెలుగు భాషకు, అధ్యాపకులకు పడుతున్న దుస్థితిని “హై హై నాయకా!” చిత్రంలో నరేశ్ పాత్ర ద్వారానూ, “చూపులు కలసిన శుభవేళ” చిత్రంలో కోట శ్రీనివాసరావు పాత్ర ద్వారానూ చూపించినా, ఫక్తు హాస్యచిత్రంగా సాగే “చంటబ్బాయ్” చిత్రంలో అనాథలుగా వదిలివేయబడుతున్న బిడ్డల గురించిన ఆవేదనను జొప్పించినా, రకరకాల వ్యాపకాలతో, తదనుగుణమైన సాధనలతో శ్రీలక్ష్మి పాత్రల ద్వారా హాస్యం తుళ్ళించినా, ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూ ఉండే వాళ్ళని దెప్పుతూ “హై హై నాయకా!” చిత్రంలో కోట శ్రీనివాసరావును, “మొగుడూ పెళ్ళాలు” చిత్రంలో సుత్తి వీరభద్రరావును మలచినా అది జంధ్యాలకే చెల్లు!
కృష్ణ గోదావరుల్లో ప్రవహించది నీరుకాదు, కన్నీరు… కట్నమిచ్చు-కోలని కన్నెపలల కన్నీరు. - అని తన ఆక్రందనను వినిపించిన సమాజవాది. “అసలు జంధ్యాల మన పక్క ఇంట్లో ఉండి మన ఇంట్లో జరిగేవన్నీ వ్రాసుకుని తన సినిమాలలో పెట్టేస్తాడేమో!” అని హాస్యప్రియులకే కాక అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుమానం వచ్చే ఉంటుంది కొన్ని పాత్రలు తెర మీద చూస్తున్నప్పుడు! కాఫీ కి స్పెల్లింగ్ KAUPHY అని ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి సంబంధం లేకుండా చెప్పడం వేరొకరికి సాధ్యం కాదేమో! అంతగా మన మనసుల్లో దూరి గిలిగింతలు పెట్టే ఆరోగ్యకరమైన హాస్యం కమర్షియల్ మూసలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాకి కొత్త ఊపిరులూదిందంటే కాదనేదెవరు!
మొదలు “ముద్దమందారం” చిత్రం విడుదల సమయానికి ముసలివారి పడుచు ప్రేమలు చూసి విసుగెత్తిన అప్పటి జనాలకి అది చల్లని “జంధ్యామారుతం”లా అనిపించింది. “నాలుగు స్తంభాలాట” మొదలు తీసిన చిత్రాలలో పుష్కలంగా సెంటిమెంట్ ఉన్నా కాని హాస్యం బాగా పండింది. దానికి తోడు “అహ.. నా పెళ్ళంట!” వసూళ్ళలో పెద్ద చిత్రాలని మించిపోవడంతో . హాస్యంగా సాగిన, “ఆనందభైరవి”, “రెండు జెళ్ళ సీత”, “లేడీస్ స్పెషల్”, “నెలవంక”, “సత్యాగ్రహం” లాంటి చిత్రాలు జంధ్యాల ఎంతటి ఆలోచనా-పరుడో, ఎంతటి “సెన్సిటివ్” వ్యక్తో తెలుస్తుంది.
“శ్రీవారికి ప్రేమలేఖ”, “చంటబ్బాయ్”, “పడమటి సంధ్యారాగం” లాంటి చిత్రాలని ఆయన తప్ప ఇంకొకళ్ళు తీయలేరు అని అనడం అతిశయోక్తి కాబోదు. ఆయన పరిచయం చేసిన కొత్త నటీనటుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నరేశ్, ప్రదీప్, పూర్ణిమ, రాజేష్, “సుత్తి” జంట, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం... ఇలా ఒక పెద్ద జాబితానే అవుతుంది! పొట్టి ప్రసాద్, శ్రీలక్ష్మి వంటి నటీనటులని ఒకే రకమైన పాత్రికేయంతోనే మళ్ళీ మళ్ళీ వాడుకున్నా, కోట శ్రీనివాసరావుతో రకరకాల హావభావాలను చేయించినా ఎన్నో చిత్రాలలో వాడుకున్నా ఒక్క సారైనా విసుగు తెప్పించకుండా చిత్రాలని మలచగల నేర్పరితనం జంధ్యాలకే సొంతం! రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేశ్ వంటి వారిని చిత్రరంగానికి తానుగా పరిచయం చేయకున్నా కథానాయకులుగా వారికి కొత్త బాణీ కల్పించి, బాలకృష్ణ, చిరంజీవి వంటి కమర్షియల్ హీరోలతో కూడా హాస్యప్రధానమైన చిత్రాలు తీసి, ఆఖరికి “తెరంగేట్రం” చేస్తున్న అమెరికన్ నటుడితోనూ,స్వతహాగా నటుడు కాని “డ్రమ్మర్” శివమణితోనూ కూడా హాస్యాన్ని పండించి సినిమాలలో “హాస్యం” అన్న మాటకే సరికొత్త నిర్వచనం కల్పించిన 'హాస్యబ్రహ్మ'
వారి చిత్రంలో పాటలు కూడా ఒక్కొక్కటి ఒక ఆణిముత్యంల తీర్చిదిద్దించుకునేవారు.. తాను తీసినవి హాస్య చిత్రాలయినా, మరే రకమైన కోవకు చెందినవైనా జంధ్యాల చిత్రాలలో పాటలను ఎవరూ మరువలేరు! “ముద్దుకే ముద్దొచ్చే సింగారం...” (ముద్దమందారం), “తొలి చూపు తోరణమాయె, కళ్యాణ కారణమాయె...”, “సన్నజాజి తీవెలలోనే సన్నాయి...” (మల్లె పందిరి), “మందారంలో ఘుమఘుమనై...” (రెండు జెళ్ళ సీత), “పిలచిన మురళికి...” (ఆనందభైరవి), “కాస్తందుకో, దరఖాస్తందుకో...” (రెండు రెళ్ళు ఆరు)... ఇలా ఎన్నని చెప్పగలం! “ఆనందభైరవి” చిత్రంలో ఒక్కో పాట ఒక్కో అణిముత్యమే. “చైత్రము కుసుమాంజలి...”, “పిలచిన మురళికి...”, “కొలువైతివా రంగశాయి...” - ఇలా ఒక్కో పాట చిత్రీకరణలో అయన వాడిన శైలి ఎన్ని సంవత్సరాలైనా మరపు రాదు! “ఆనందభైరవి”లో ఒక్కో సన్నివేశం వెనుక ఎంత అర్థం ఉన్నదో చెప్పలేము! విడుదలయ్యాక ఘనవిజయం సాధించిన ఆ చిత్రానికి మొదట విడుదల హక్కులు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని (“శంకరాభరణం” చిత్రం లాగా) తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది!
“కళాతపస్వి” విశ్వనాథ్ తీసిన శంకరాభరణం మార్కు చిత్రమైన “'ఆనందభైరవి' జంధ్యాల సినిమానా?” అని ఆశ్చర్యపోయేవారికి “శంకరభరణం” చిత్రానికి కూడా జంధ్యాల మాటలు వ్రాసారని తెలియకపోవచ్చు! అటువంటి కళాత్మక చిత్రాలకూ, తానే బాటే వేసిన హాస్యచిత్రాలకు మాత్రమే కాదు... జంధ్యాల కలం “వేటగాడు” లాంటి కమర్షియల్ చిత్రాలలోనూ తన వాడిని నిరూపించుకుంది!
సినిమా రచయితకి “స్టార్ స్టేటస్” తెచ్చి హాస్యాభిమానుల మనసుల్లో ఎంతో ఎత్తున స్థిరత్వాన్ని సంపాదించిన జంధ్యాల చిన్న వయసులోనే అందుకోలేని స్వర్గాలను చేరుకుని నేటికి సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు. రచయితగానూ, ఉత్తమ సంగీతాభిరుచినీ, హాస్యాభిరుచీనీ కలిగిన దర్శకుడిగానూ, “ఆపద్బాంధవుడు” చిత్రంలో నటుడిగానూ కూడా తన బహుముఖప్రజ్ఞను ప్రదర్శించిన గురించి “మన” జంధ్యాల ఎంత రాసిన తక్కువే.
అయినా వజ్రోత్సవం వేడుకల సందర్భంగా వారిని హాస్యబ్రహ్మ బ్రహ్మానందంగారు తప్ప యెవ్వరు తలచుకోకపోవడం ఆ కార్యక్రమంయొక్క డొల్లతనాన్ని చూపించిందని చెప్పవచ్చు.
చివరిగా హాయిగా నవ్వుకోగలిగే కొన్ని మచ్చు తునకలు వారి చిత్రాలనుండి:
ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడ పిల్ల కాలు గడపదాటకూడదు. నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు! మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు! 
  • గత దశాబ్దంగా తమ ఒంపు సొంపులతో, ఆటపాటలతో ఆంధ్ర పేక్షకుల గుండెకాయల్ని వేరు శనక్కా యల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం…
  • ఈ సోదరీమణులిదరూ ఆంధ్రులపాలిట ఇషదవాలు. ఆవకాయ, గోంగూర లాంటివారు. ఈ పచ్చళ్లలో ఏదో ఒకటి లేని దే ఏ తెలుగువారి భోజనం ఎలా ఉండదో, వీరిదరిలో ఏ ఒక్కరెనా లేకుండా తెలుగు సినిమాయే అసలు ఉండదు.
  • భర్త భార్యను ప్రేమించే పదతికి, భార్యభర్తను వేధించే పదతికి సరెన నిర్వచనం నా కవితారూపంలో ఇస్తా…
    పెళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క
    ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచక్క-నీ పీక నొక్కో
  • పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే దడుసుకొని పారిపోతారు!
  • మొక్కుబడకి బుక్కులన్ని చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొటేసన చెక్కముక్కలా, కుక్కపీకేసన పిచ్చిమొక్కలా, బిక్కుమొహం వేసుకుని, వక్కనోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్కపెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెదవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టు వేసుకుని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద బక్కచిక్కి ఇలా పడుకోకపోతే ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్ది తిరిగి, నీడొక్క శుద్దితో వాళని ఢక్కాముక్కీలు తినిపంచి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. 

    ఇందులో 56 ‘క్కా లు ఉన్నాయి తెలుసా?
  • శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి ‘అప్పాజీ’ అని పేరు పెట్టు కున్నాడంటే.. అప్పు ఎంత విలువనదో గ్రహించండి. ఇంగ్లీష్లో కూడా ‘డౌన్’ కంటే ‘అప్’ ఉన్నతమైన కాదా?
  • మన భారతదేశం చేసిన పనే మనమూ చేయటం తప్పు కాదుకదా… మనదేశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాం. మనదేశం క్రమశిక్షణ పాటిస్తే మనమూ అనుసరిస్తాం. ఇప్పుడు మనదేశం ఏం చేస్తోంది? పరాయి దేశాలనుంచి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకు హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటది భారతదేశం అయితే రెండోది బెల్జియం. అంచేత అప్పు చేయటం తప్పు చేయటం కాదు. అసలా మాట కొస్తే అప్పు చేయటం భారతీయుడి జన్మహక్కు, ప్రథమ కర్తవ్యమూనూ…. ఏషియాడ్లో మన గుర్తు గున్న ఏనుగు పేరు ఏమిటి? ‘అప్పూ’… మన వెజాగ్లో ఉన్న సింహాచలం దేవుడి పేరు ఏమిటి? సింహాద్రి “అప్ప”న్న.
  • డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.
  • ఫస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది లాస్,ట ఇన్ బిట్వీన్ టు జీరోస్ అంటే ఏమిటో చెప్పండి? ఫస్ట్లో మొదటి అక్షరం ‘ఎఫ్’, లాస్లో మొదటి అక్షరం ఎల్. ఇన్ బిట్వీన్ ట్టూ జీరోస్ అంటే ఫూల్!

Monday, November 1, 2010

అభినవ తెలుగు సాహిత్యానికి మావయ్య - కాళ్ళకూరి నారాయణరావు


 
    
గురజాడ వారి " కన్యాశుల్కం" సాంఘిక దురాచారాలని ఖండిస్తూ, మార్పుకు అంకురార్పణ చేస్తే, కాళ్ళకూరి నారాయణరావు గారి సాంఘిక నాటకం - వరవిక్రయం (1921), అప్పటి సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ అనర్ధ హేతు చర్యలు వ్యతిరేకిస్తూ, సాంఘిక ధర్మానికి పాటుపడింది. అప్పటి వాళ్ళు కలసి కట్టుగా బహిష్కరించే సాహసం చేయలేదు. చేసుంటే నారాయణరావు గారు ఏమి చేసేవారు?

నారాయణరావు గారి " చింతామణి " నాటకం తెలుగు నాటక రంగాన్ని ఓ ఊపు ఊపింది. ఒక వ్యసనం , చక్కగా ఉన్న వ్యక్తిని ఎంత హీన స్థితికి దిగజారుస్తుందో, పర్యవసానాలు ఎంత దారుణముగా ఉంటాయో ప్రతిబింబించారు. ఈ నాటకానికి కనీ వినీ ఎరుగని ఆదరణ లభించింది. ఆదాయానికి లోటులేకండా ఇంకా మరిన్ని నాటకాలు సమర్పించడానికి వీలుగా బోళ్ళు డబ్బు తెచ్చి పెట్టింది.

ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతి రావు గారు " వరవిక్రయం" తెలులో సాహిత్యంలోని పది అత్యుత్తమ రచనలలో ఒకటి అని తెలిపారు.

వరవిక్రయము

గురజాడ వారి కాలంలో " కన్యాశుల్కం", తరువాత " వరవిక్రయము " అంతటి ఘనత లభించింది. రెండూ తెలుగు నాటక రంగ ఇతిహాసంలో ఆణిముత్యాలే. కన్యాశుల్కం అప్పటి సాంఘిక దురాచారాన్ని ఎదుర్కుంటే, వరవిక్రయము ఆ కాలం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ ఆ సాంఘిక దుస్థితిని ఎండకడుతూ వచ్చింది.

ఆ కాలంలోని సామాజిక సమస్యలకు తనదైన విచార ధారతో విశ్లేషించి, లోకం తీరును " వరవిక్రయం " రూపంలో మలిచారు. పెళ్ళి చేసుకోవడానికి భారీగా కట్న కానుకలు వసూలు చేస్తూ, వివాహం ఐదు రోజులు జరిపించుకొని, వైభవోపేతముగా సేవలు చేయించుకోవడం, పిల్ల తల్లి తండ్రులను అప్పుల ఊబిలోకి నెట్టి వేయడం వంటి పరిస్థితులను ప్రతిఘటించడానికి, నైతిక భాద్యతలను నిర్వర్తించేందుకు పిలుపునిచ్చారు. ఇలా చేయడానికి ఒక చక్కన్ని ఒరవడి, సంస్కారం, అధర్మాన్ని నిర్భయంగా ఎదుర్కునే శక్తి, ధైర్యం, సామాజిక స్పృహ, నైతిక విలువలపట్ల విశ్వాసం, బాధ్యతలు విస్మరించిన వారిని వెన్ను తట్టి లేపడం అవసరం. ఇవన్ని కలిగి ఉన్న వారు కాళ్ళకూరి నారాయణరావు గారు.

సి.పిల్లయ్య గారు 1939 లో " వరవిక్రయము " సినిమా తీసారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో కాళింది గా నటించారు. దీనితో ఆమెకు మంచి పేరు వచ్చిందని వినికిడి. సింగరాజు లింగరాజు గా బలిజేపల్లి లక్ష్మికాంత కవి గారు వేశారు. బ్రహ్మాండంగా రాణించారు. " నటన అంటే అది " అని అనిపించుకున్నారు.

సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య మేమి దాంపత్యము? అని సూటిగా అడిగి అప్పటి సమాజిక స్థితి గతులను ఓ పక్క చాటుతూ, మరో పక్క వ్యత్యాసాలను, అసమంజస వైనాన్ని వేలెత్తి చూపారు. ఇది నారాయణరావు గారిలో ఉన్న ధర్మ నిరతి, సమానత, ఆదర్శ భావాలు, ముఖ్యంగా సరికాని దానిని వ్యతిరేకించే దైర్య స్థైర్యాలను చాటుతోంది. అలా రాయడమే గొప్ప!. ఇంక అది నాటకంలో ప్రదర్శించి సమాజంలోని అసమానతలను ప్రదర్శించడం ద్వారా తన సత్తాను, ప్రగాడ ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఇది బహు గొప్ప!. మెచ్చుకోక తప్పదు. ఇలాంటి వారు ఆట్టే కాన రారు మరి!.

ధనమె ప్రధానభూతముగ దంతము లూడినవాని కేనియుం
దనయులం గట్టిపెట్టు తల్లిదండ్రులు హెచ్చగుచున్న ఇట్టి
దుర్జనములోన, నింతిగ, ధరిత్రి పయిం జనియించుకుంటె
నిర్జన వనవాటిలో, నజగరంబుగ నేని జనింపగా దగున్!
ఇలా పద్యం రూపంలో పొందుపరచి వారి సామాజిక స్పృహ చెప్పకనే పరిచయం చేశారు కాళ్ళకూరి గారు.

వరవిక్రయంలో ఓ అద్బుతమైన సన్నివేశంలో లింగరాజు ఇలా అంటాడు:

ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు
వరుస బండ్ల మొక్కు వాడొకండు
కష్టపడి గృహంబు గట్టువాడొకండు
వసతిగ నివసించు వాడొకండు
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు
వచ్చినది మృంగు వాడొకండు
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు
వలపు కాండై పొందు వాడొకండు

అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు
పడిగం దగులబెట్టు వాడొకండు
ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
లీలగాదు దీని కేల గోల?


ఇలా లోకం పోకడ ఓ పాత్రలోకి లీనం చేసి, స్వచ్చమైన భాషలో అంత్య ప్రాశతో లేస్యం చేసి అందించడంలో కాళ్ళకూరి ఆయనికి ఆయనే సాటి అని నిరూపించుకున్నారు.

ఇంకో సంధర్భములో లింగరాజు ఇలా అంటాడు:

సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుపండైయ్యె
చచ్చునప్పుడు వెనువెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో
ఇలా ధనమునే అత్యయంత ప్రీతిగా కొలిచే ప్రబుద్ధుల మనో స్వభావ ప్రలోభ భావాలను చమత్కారముగా చిత్రీకరిస్తూ ఈ లోకం వైనం చెప్పకనే చెప్పారు.

చింతామణి (1933)
తెలుగు నాటక రంగంలో పది అత్యుత్తమ నాటకాలలో ఇదొకటి.
ఈ నాటకం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. 1956 లో చింతామణి సినిమా వెలువడింది. శ్రీ హరి సుబ్బి శెట్టి సన్నివేశాలు కళగా ఉంటాయి.

గతంలో, " నా గురించి ఓ పుస్తకం రాయండి. నాకో పుస్తకమైనా అంకితమివ్వండి" అని అడిగారంట మల్లవరాజు. ఏమైనా తప్పులున్నాయి అని నా మీద దావా వేస్తే నేను ఏమైపోతాను " అని అన్నారు నారాయణరావు గారు. " మీరు ఏమైనా వ్రాయండి. నేను తప్పు పట్టుకోను" అని లిఖితపూర్వకముగా రాసి ఇచ్చాడు మల్లవరాజు.

" సింగరాజు లింగరాజు " అచ్చు మొచ్చు మల్లవరాజులా నటించారట"; మరి దీన్ని మల్లవరాజుని దృష్టిలో పెట్టుకుని రాశారట; మల్లవరాజు కి కోపం వచ్చినా పూర్వ ఒప్పందం వల్ల - " నా పేరును చిరస్థాయి చేశారు " అని మావయ్య గారిని సత్కరించారు ". గౌరవం అంటే అది!.

ఓ సారి బ్రాహ్మణుడు వచ్చాడు - అప్పుడు ఏమి జరిగింది అంటే ....
బసవరాజు సుబ్బారావు గారు కృష్ణాజీ కి ఈ విషయాలు చెప్పారు - ఒకనాడు ఓ బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం జరిపించుటకై నిశ్చయించి ఖర్చులకోసం డబ్బు అర్ధించగా మరునాడు రండి అని చెప్పి పంపేశారు కాళ్ళకూరి నారాయణరావు గారు. చేతిలో దమ్మిడి లేదు. లేదు అన్న చింతా లేదు. హాయిగా ఉండేవారు. మర్నాడు ఆ బ్రాహ్మడు వచ్చిన తరువాత ఆయనకి, రాత్రికి రాత్రి రాసిన నాటకం దస్తూరి ఇచ్చారు. ఆశ్చర్య చకితుడైయ్యాడు ఆ బ్రాహ్మణుడు. దాన్ని పలాన కొట్టు వానికి ఇవ్వండి. మీకు తగినంత పైకం ముడుతుంది అన్నారు. అలాగే జరిగింది. కొట్టు వాడు రెండు మూడు వందలు ఇచ్చాడు. చక్కగా ఉపనయనం జరిపించాడు. కొన్నాళ్ళకి ఆ కొట్టు వాడు నాటకం అచ్చు వేయించాడు.

కాళ్ళకూరి నారాయణరావు 1919 లో " పద్మవ్యూహం " నాటకంలో పద్య డయలాగులు పొందుపరిచారు. ఇలా పలు ప్రక్రియలు చేయడానికి వెనుకాడలేదు. సారంగధార నాటకం, తర్కాన్ని, ఇతిహాసాన్ని జోడించి రాశాడు. మధుసేవ (1926) ఒక కొత్త దిశామార్గాన్ని చూపించింది.

కృష్ణ జి కళ్ళకూరి గారి గురించి ఉదాహరిస్తూ ఇలా అన్నారు - " ఓ మంచి వాడి గురించి చెప్పుకొనటానికి ఈ జీవితంలో తీరిక దొరకదు. దీనికి తోడు అతడు ప్రతిభావంతుడు కూడా ఐతే, తీరిక అస్సలు దొరకొదు " అని చమత్కరించారు.

- నారాయణరావు గారు బయటికి వెళ్ళి నప్పుడు, ఒక్క బుద్ధిరాజు గారి ఇంట్లో తప్ప ఇంకెక్కడా ఎవరింట్లోనూ భోజనం చేసేవారు కాదు. అనేక మందికి ఉపకారాలు చేశారు. యవ్వరు వచ్చినా ఆదరించేవారు.

- గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా నారాయణరావు గారి శిష్యుడే.

- డాక్టర్ కొత్తె వెంకటాచారి గారు నరాయణరావు గారి - నాటకాల మీద పి హెచ్ డీ చేశారు.

తెలుగు నాటక రంగ వైభవం చాటే నాటకాలు - " వరవిక్రయము", " చింతామణి" చిరకాలం నిలచిపోయాయి. ఈ రెండూ కూడా చలన చిత్రాలుగా రూపొంది ప్రజాధరణ పొందడం విశేషం. వరవిక్రయము అప్పటి సాంఘిక దురాచరాన్ని ఎండగడితే " చింతామణి" సజాఉగా నడిచే జీవితం ఎలా నాశనం అయిపోవచ్చో అద్దం పడుతుంది. ఇలాటి అసాధారణ ధారణ కలిగి ఉన్న నారాయణరావు తెలుగు సాహిత్యానికి మావయ్యే.

Friday, October 1, 2010

తెలుగునాట గాంధీజీ అడుగుజాడ


... ఈశ్వర్-అల్లా తేరేనామ్ సబ్‌కో సన్మతి దే భగవాన్
‘‘మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి రక్తమాంసా లతో భూప్రపంచంలో నడయాడాడంటే భవి ష్యత్తు తరాల వారు నమ్మరు’’ అని ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టయిన్ అన్నారు.

స్వజాతిని, స్వదేశాన్ని సత్యాగ్రహ విధానం ద్వారా ప్రభావితం చేసిన మహితాత్ముడు మహా త్ముడు. భారత దేశోన్నతితోపాటు సమస్త మానవ కళ్యాణం కోసం కృషి చేసిన మహాత్ముని అడుగు జాడల్లో తెలుగుజాతి నడిచింది. మహాత్ముని ప్రభావంతో ఎందరో తెలుగు ప్రముఖులు సర్వస్వం అర్పించి స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. నిర్మాణ కార్యక్రమానికి తమ జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ సేవాపరాయణులెందరో ఉన్నారు. గాంధీజీ మెచ్చిన తెలుగు ప్రముఖులను మహాత్ముని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడమే మా ఉద్దేశం.


కాశీనాథుని నాగేశ్వరరావు
కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుపై మహాత్ముడు ఎంతో మమకారం చూపారు. మద్రాసులో స్వయంగా 1933 డిసెంబరు 22న చెన్నపురి ఆంధ్ర మహాసభలో దేశోద్ధారకుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంలో విశ్వదాతపై వారు చేసిన ప్రసంగం మహత్తరమైంది. ‘నేను నాగేశ్వరరావు పంతులుగారిని ఎరిగి ఉన్నప్పటి నుంచి ఆయనలో ఒక ప్రత్యేక లక్షణం గమనిస్తున్నాను. అవసరమైనప్పుడు సహాయం ఆపేక్షించే వారికి ఆత్మ సమర్పణ చేయడమే ఆయన ఆదర్శం. అదే ఆయన ప్రత్యేకత. నేనొకమారు వారితో చలోక్తిగా ‘‘అమృతాంజనం పేరుతో ప్రజలను మీరు వంచిస్తున్నారు గదా’’ అన్నాను. ‘‘నిజమే, నేను మీ మాట కాదనను, అది వంచన అయినా నిరుపద్రవ మయిన వంచన. అది ఎవరికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయదు. అమృతాంజనం వాడేవారు దాని నివారణ శక్తిలో విశ్వాసముండే కొంటున్నారు. ఆ నమ్మకం వల్లనే వారికి గుణం ఇస్తున్నది. ఆ నమ్మకమే నా వ్యాపారానికి ఆధారం. కాని నేనొక మాట మాత్రం నిశ్చయంగా చెప్పగలను. అమృతాంజనం వల్ల వచ్చే లాభంలో ఎక్కువ భాగం ఆర్తుల కష్ట నివారణకు వినియోగిస్తున్నాను. ఈ వ్యాపారానికిదే పరమ ప్రయోజనం’’ అన్నారు నాగేశ్వరరావుగారు. ఈ సమాధానం విన్నంతనే ఇతడే నాకు నచ్చిన మనిషని పించింది. ఆయన ప్రత్యుత్తరంలో త్రికరణ శుద్ధి, వినమ్రత, సత్యసంధత ప్రతిబింబించాయి.

యాచకులెవరైనా కన్నీరుపెట్టి ‘దేహీ’ అంటే ‘నాస్తి’ అనే మాట ఆయన నాలుకకు రాదు. ‘నా వంటి వారు కూడా వారిని ఆశ్రయించి రిక్త హస్తాలతో తిరిగి రాలేదు’ అని గాంధీజీ అన్నారు. సద్గుణాలను, ఉదారాశయాలను మీ జీవితాలలో మీరు ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఈ చిత్ర పటావిష్కరణలోని సంపూర్ణ ఫలితం మీరు పొందగలరు’ అని మహాత్ముడు తమ ప్రసంగంలో కాశీనాథుని వారిపై తనకున్న ప్రేమాభామానాలు వ్యక్తపరిచారు.

కొండా వెంకటప్పయ్య
దేశ భక్త కొండా వెంకటప్పయ్య మహాత్ముని అడుగు జాడల్లో నడచిన తెలుగు ప్రముఖుల్లో ప్రథముడు. గాంధీజీ గౌరవాదరాలకు పాత్రుడైన మహోన్నతుడు. ‘కొండా వెంకటప్పయ్య ఆంధ్రుల ఔన్నత్యానికి చిహ్నమని నా అభిప్రాయం. ఆ ప్రాంతంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఆయన మేల్కొన్నారు. ఆయన గొప్ప శీలవంతుడు. ఆయన అహింసను స్వమతధర్మంగా స్వీకరించారు. ఆయన పూర్తిగా అహింసావాది’’ అని ప్రస్తుతిస్తూ 1921లో యంగిండియాలో గాంధీజీ రాశారు.

అల్లూరి సీతారామరాజు

18.7.1929 యంగిండియాలో ‘‘అల్లూరి సీతా రామరాజు గురించి నాకేమీ తెలియదు. కాని విచారిం చగా ఆయన వీరోచిత కృత్యాల గురించి అనేక కథలు నాకు వినవచ్చాయి. అవి భావస్ఫోరకాలుగాను, ఉత్సాహజనకాలుగాను ఉన్నాయి. సాయుధ విప్లవం పైన నాకు సానుభూతి గానీ, అభిమానంగానీ లేవు. రాజు వంటి శీలవంతుడు, నిరాడంబరుడు, త్యాగి, ధైర్యవంతుడు, ఉన్నతాశయుడు అయిన యువకుడిని నేను అభినందించకుండా ఉండలేకపోయినాను’’ అని రాశారు. కాంగ్రెస్ పత్రిక సంపాదకులు మద్దూరి అన్నపూర్ణయ్య పంపిన సీతారామరాజు జీవిత గాథను ‘యంగిండియా’లో ప్రచురించారు.

డా॥భోగరాజు పట్టాభి సీతారామయ్య
‘‘వైశ్య సూత్రకారుణ్ణి అయిన నాకు పట్టాభి బ్రాహ్మణ భాష్యకారుడు’’ అని మహాత్ముని మన్ననను పొందిన మేధో సంపన్నుడు డా॥భోగరాజు. 1939లో గాంధీజీ పట్టాభి గారిని కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలని ఆకాంక్షించారు. అయితే సుభాష్ చంద్రబోస్ చేతిలో పట్టాభి ఓడిపోయారు. ‘‘పట్టాభి ఓటమి- నా ఓటమి’’ అని గాంధీజీ ప్రకటించారు. దీన్నిబట్టి పట్టాభిపై గాంధీజీకి ఎంత గౌరవమూ, అభిమానం ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. 1929లో తన ఆంధ్రదేశ పర్యటనపై యంగిండియాలో రాసిన వ్యాసంలో ‘‘డాక్టర్ పట్టాభి వ్యాపార సరళి కలిగిన చురుకైన కార్యకర్తలలో ఒకరు. అనవసరమైన ఖర్చు లన్నిటినీ, తన యాత్రలో తగ్గించగలిగారు’’ అని రాశారు. పట్టాభి పొదుపరి తనం గాంధీజీని ఎంతో ఆకర్షించింది.

ముట్నూరి కృష్ణారావు
‘సూత్రయజ్ఞం’ అనే పదానికి సృష్టి కర్త ‘కృష్ణా పత్రిక’ సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణారావు అన్న సంగతి మనకెవరికీ తెలియదు. ఆంధ్ర జాతీయ కళాశాల విద్యార్థులతో ఖద్దరు వడకటం గురించి చర్చిస్తున్న సందర్భంలో ‘‘ముట్నూరి కృష్ణారావు నన్ను శ్రద్ధగా వింటూ అప్పుడప్పుడు చర్చలలో పాల్గొనేవారు. కొంతసేపు ఇట్లా ఉన్నట్లే ఉండి ఆయన ‘‘అయితే మీరు నూలు వడకటాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నారన్నమాట’’ అన్నారు. అప్పుడాయన కళ్లల్లో ఆధ్యాత్మిక జ్యోతి విద్యుల్లత మాదిరి ప్రకాశించింది. వెంటనే ‘‘మీరందించిన భావానికి నేను చాలా కృతజ్ఞుడను’’ అన్నాను. అప్పటి నుంచి నూలు వడికే సందర్భం వచ్చినప్పుడల్లా నేనీ ప్రయోగం (సూత్ర యజ్ఞం) చేస్తున్నాను అని 13.4.1921 నాటి యంగిండియాలో గాంధీజీ రాశారు.

కోపల్లె హనుమంతరావు
ఆంధ్ర జాతీయ కళాశాలపై మహాత్మునికి ఎనలేని మమకారం. రెండు పర్యాయాలు బందరులో ఆంధ్ర జాతీయ కళాశాలలో వారు మకాం చేశారు. కళాశాల వ్యవస్థాపకులు కోపల్లె హనుమంతరావు మృతి చెందినట్లు డా॥పట్టాభి లేఖ ద్వారా తెలుసుకున్న గాంధీజీ. ‘‘ఆడంబరం లేని శ్రమచేస్తున్న అగ్రగణ్యు నొకరిని ఆంధ్రదేశం కోల్పోయింది. ఆంధ్రదేశం చూసి మురిసి పోతున్న బందరులోని గొప్ప విద్యాలయం కోసం హనుమంతరావు శ్రమ చేశారు. ఆయన దానికోసమే బతికి తుదకు దాని కోసమే ప్రాణాలు విడిచారు’’ అని యంగిండియాలో నివాళులర్పిం చారు. 1929లో రెండవసారి జాతీయ కళాశాలను సందర్శించిన సందర్భంలో తన భావాలను యంగిం డియాలో తిరిగి సవివరంగా రాయడం విశేషం.

పింగళి వెంకయ్య
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గురించి ‘‘జాతీయ పతాకం’’ శీర్షికన యంగిండి యాలో 13.04.1921న రాసిన వ్యాసంలో ‘‘మచిలీ పట్టణంలోని ఆంధ్ర జాతీయ కళాశాలకు చెందిన పింగళి వెంకయ్య ఇతర దేశాల పతాకాలను గురించి వివరాలతో పాటు భారత జాతీయ పతాకానికి కొన్ని నమూనాలను సూచిస్తూ ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి ఏళ్ల తరబడి ప్రచారం సాగించారు. గడచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి కాంగ్రెస్ మహాసభలోనూ పట్టుదలగా జాతీయ జెండాను గురించి ఆయన చేసిన కృషిని నేను శ్లాఘించక తప్పదు. బెజవాడలో ఎరుపు (హిందూ రంగు), ఆకుపచ్చ (ముస్లిం రంగు) రంగులు గల పటం పైన రాట్నాన్ని చిత్రించి తీసుకుని రమ్మని నేను వెంకయ్యను అడిగాను. ఆయన అత్యుత్సాహంతో మూడు గంటలలో నాకా జెండాను అందించాడు’’ అని గాంధీజీ రాశారు.

పొట్టి శ్రీరాములు
పొట్టిశ్రీరాములు నెల్లూరులో హరిజనులను దేవాలయ ప్రవేశం చేయించడానికి ప్రయత్నించగా ధర్మకర్తలు అంగీకరించకపోవడంతో ఉపవాసం ప్రారంభించారు. అప్పుడు గాంధీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘‘శ్రీరాములు అజ్ఞాతుడు, నిరుపేద అయిన కాంగ్రెస్ కార్యకర్త. ఆయన నెల్లూరులో మానవసేవలో నిమగ్నమై ఉంటాడు. హరిజనుల కోసం ఆయన ఒక్కడే అక్కడ ఏకాకిగా పని చేస్తున్నాడు. శ్రీరాములు నిరాడంబరంగా పనిచేస్తు న్నాడు. హరిజనులకు దేవాలయం తెరిపించాలని ప్రయత్నిస్తున్నారు. శ్రీరాములు వంటి మనిషి ప్రజలకు తెలియకపోవడం వలన, వారి సహకారం లేకపోవడంవలన మరణించకూడదు’’ అని రాశారు.

సర్ అక్బర్ హైదరీ

హైదరాబాద్ ప్రభుత్వ కార్య నిర్వాహక శాఖాధ్యక్షుడు సర్ అక్బర్ హైదరీ మరణానంతరం గాంధీజీ ఆయన గురించి ‘హరిజన్’లో ఇలా రాశారు- ‘‘సర్ అక్బర్ హైదరీలో చాలా సుగుణాలున్నాయి. అట్లా ఉండటం చాలా దుర్లభం. ఆయన గొప్ప పండి తుడు, తత్వశాస్తవ్రేత్త, సంస్కరణవాది, భక్తిపరుడ యిన మహనీయుడు. రెండో రౌండ్ టేబుల్ మహాసభ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మేమిద్దరం కలిసి ఒకే నౌకలో ప్రయాణం చేశాం. నేను రోజూ చేసే ప్రార్థనకు ఆయన హాజరవుతుండేవారు. గీతా శ్లోకాలలోను, మేము చేసే భజన కీర్తనలలోను ఆయనకు ఆసక్తి కలిగింది. వాటినన్నిటినీ మహాదేవ్ దేశాయి చేత ఆయన అనువాదం చేయించుకున్నాడు. భారత దేశంలో మతసామరస్యం కోసం మేమిద్దరం కలసి విస్తృతంగా పర్యటన చేయాలనుకున్నాం. ఆయన నా చేత ఆ మేరకు వాగ్దానం చేయించుకున్నారు కూడా. కానీ దేవుడు అన్యధా తలచాడు’’ అని రాశారు.
మండలి బుద్ధప్రసాద్
మాజీ మంత్రి

Tuesday, September 28, 2010

తరగని స్ఫూర్తి ‘చిలకమర్తి’ * నేడు 143వ జయంతి

తరగని స్ఫూర్తి ‘చిలకమర్తి’
నేడు 143వ జయంతి

  ‘భరతఖండంబు చక్కని పాడియావు..
  హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 
  తెల్లవారను గడుసరి గొల్లవారు 
  పితుకుచున్నారు మూతులు బిగియబట్టి’

- పరపాలకుల దోపిడీని అరటి పండు వలిచి చేతపెట్టినట్టు చాటిన పద్యమిది. దీన్ని రచించి సామాన్యుల్లో సైతం దేశభక్తిని ప్రేరేపించిన చిలకమర్తి లక్ష్మీనరసింహమే తన ‘ప్రసన్నయాదవం’ నాటకం చతుర్థాంకంలో ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అంటూ స్ర్తీ విద్య ఆవశ్యకతను చాటారు. అకుంఠిత దీక్షతో, స్వయంకృషితో సాహితీవేత్తగా, సంఘ సంస్కరణాభిలాషిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, పత్రికా నిర్వాహకునిగా ఎదిగిన చిలకమర్తి తెలుగుజాతికి చిరస్మరణీయమైన సేవలు అందించారు.

చిన్నతనంలోనే చూపు మందగించి, 30 ఏళ్లకే అంధత్వం ప్రాప్తించినా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారు. 1867 సెప్టెంబర్ 26న ఖండవల్లిలో మధ్యతరగతికి చెందిన చిలకమర్తి రత్నమ్మ, వెంకయ్య దంపతులకు చిలకమర్తి జన్మిం చారు. వీరవాసరంలో ప్రాథమిక, హైస్కూలు విద్యాభ్యాసం అనంతరం 1885లో రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. కందుకూరి వీరేశలింగం సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు.

‘గయోపాఖ్యానం’తో రికార్డు
చిలకమర్తి ‘కీచకవధ’ నాటక రచనతో 22 ఏళ్లకే సాహితీరంగంలోకి అడుగుపెట్టారు. 60కి పైగా నవలలు, నాటకాలు, ప్రహసనాలు, జీవిత చరిత్రలు, శతకాలు రచించారు. చిలకమర్తికి చిరకీర్తి నందించిన ‘గయోపాఖ్యానం’ నాటకం లక్ష ప్రతులకు పైగా అమ్ముడవడం నాటికీ, నేటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఆయన నాటకాల్లో ‘ద్రౌపదీ పరిణయం, పారిజాతాపహరణం, ప్రహ్లాద చరిత్ర, చతురచంద్రహాసం’ చెప్పుకోదగ్గవి కాగా నవలల్లో ‘రామచంద్ర విజయం, విజయలక్ష్మీ గణపతి, రాజరత్నం’ విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. కొన్ని అనువాద రచనలు కూడా చేశారు. తన రచనలన్నీ సులభ గ్రాంథికంలోనే రచించారు.

హరిజన విద్యావ్యాప్తికి పాఠశాల స్థాపన
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి రావడానికి ముందే చిలకమర్తి హరిజన విద్యావ్యాప్తికి 1909లో రామ్మోహనరాయ్ పాఠశాల స్థాపిం చారు. ఉచితంగా చదువు చెప్పే ఈ పాఠశాలలో ఆంగ్లభాషను కూడా బోధించేవారు. వయోజనులకోసం 1915లో వివేకానంద పాఠశాలను స్థాపించారు. సమాజ ప్రగతికి స్ర్తీ విద్య తప్పనిసరని చిలకమర్తి భావించేవారు. 1928లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘ఉభయ భాషా ప్రవీణ’ పట్టం అందుకున్న తొలిమహిళ చిలకమర్తి మేనకోడలు రావూరు వెంకట సుబ్బమ్మ. పఠనాసక్తి పెంచడానికి గ్రంథాలయాలు తప్పనిసరని చిలకమర్తి గుర్తించారు. 1914లో విజయవాడలో జరిగిన ఒక సభలో ‘వాయువు ఎల్లవారికి ఎట్లు స్వాధీనమై ఉన్నదో జ్ఞానము కూడా అట్లు స్వాధీనం కావలయును. ఉదకం ఎల్లవారికీ ఎట్లు సేవ్యమై ఉన్నదో జ్ఞానము కూడా అట్లు సౌఖ్యప్రదముగా యుండవలయును’ అన్న ఆయన సందేశం నేటికీ వర్తిస్తుంది.

సాహిత్యమే ఆయుధంగా స్వాతంత్య్ర స్ఫూర్తి
ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి చిలకమర్తి సాహిత్యాన్నే ఆయుధంగా చేసుకున్నారు. బిపిన్ చంద్రపాల్, రమేష్ చంద్రదత్తు రాజమండ్రిలో చేసిన ఆంగ్ల ప్రసంగాలను చిలకమర్తి తెలుగులోకి అనువదించేవారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఆశువు గా చెప్పినదే చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే ‘భరత ఖండంబు...’ పద్యం. చిలకమర్తి 1906 జనవరిలో ‘మనోరమ’ మాసపత్రికను, 1910 ఆగస్ట్‌లో ‘దేశమాత’వారపత్రికను స్థాపించారు. ఆయనకు 1922లో విశాఖపట్నంలో పురప్రముఖులు ‘సాహిత్య చక్రవర్తి’ బిరుదునిచ్చి సత్కరించారు. 1943 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చింది. తెల్లవారు దేశం నుంచి నిష్ర్కమించడానికి ఒక సంవత్సరం ముందు 1946 జూన్ 17న చిలకమర్తి పరమపదించా రు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో పేర్కొన్నట్టు నవ్యాంధ్రలోకానికి చిలకమర్తి సుధాశరశ్చంద్రులే.

Saturday, September 25, 2010

జీవితం అందంగా, అర్థవంతంగా తీర్చి దిద్దుకునే గొప్ప కళ తెలిసిన వ్యక్తి .... డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్.

ఆయనకు సంచారమంటే మహా ప్రీతి

జీవితం అందరికీ ఉంటుంది. కానీ దాన్ని అందంగా, అర్థవంతంగా తీర్చి దిద్దుకునే కళ కొందరికే తెలిసుంటుంది. అలాంటి గొప్ప కళ తెలిసిన వ్యక్తుల్లో డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ఒకరు. గుంటూరు జిల్లా తుమ్మపూడిలో పుట్టిన ఆయన అక్కడి నుంచే ప్రపంచాన్ని చదివారు. పెయింటింగ్, ఫొటోగ్రఫీ, రచనలు, ప్రకృతి ఆరాధన, తాత్త్విక చింతన ... ఇలా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. ఆయన చనిపోయి 12 ఏళ్లు గడిచినా ఇంకా ఆయన తనకు ఇష్టమైన సపోటా తోటలో తిరుగుతున్నట్లే ఉందంటున్నారు సంజీవదేవ్ సతీమణి శ్రీమతి సులోచనాదేవి. ఆరు దశాబ్దాల జ్ఞాపకాల దొంతరలను ఆమె మురిపెంగా మనముందు పరిచారు.

పచ్చని వరిచేలు, ఆనందంగా తలలూపే కొబ్బరిచెట్ల సోయగాలు, బకింగ్‌హామ్ కెనాల్ అందాల మధ్య ఉంటుంది తుమ్మపూడి గ్రామం. ఊరి చివర పాతకాలం నాటి అందమైన డాబా ఒకటి కనిపిస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న అరటి, సపోటా తోటలు, వరిచేలు మనల్ని పలకరిస్తాయి. పెద్దగేటు తీసుకొని వెళితే, నిర్మలత్వం మూర్తీభవించిన 75 ఏళ్ల శ్రీమతి సులోచనమ్మ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తారు. వరండాలో గోడకు సంజీవదేవ్ ఫొటో ఉంటుంది. ఆ పక్కనే ఆయన పెళ్లికి రోరిక్ బహుమతిగా పంపిన పెయింటింగ్ కనువిందు చేస్తుంది.
లోపలి గదిలో సంజీవదేవ్ వేసిన పెయింటింగ్స్ మనల్ని కదలకుండా చేస్తాయి. "డాబాపైకి వెళ్లి రండి... అక్కడ ఆయన వేసిన పెయింటింగ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అక్కడే కూర్చొని రాత్రంతా బొమ్మలు గీసేవారు. తెల్లారే సరికి అందమైన పెయింటింగ్ గీసి, ఎలా ఉందో చెప్పమన్నట్లు నా ముందు పెట్టేవారు'' అంటూ మనిషిని తోడుగా ఇచ్చి డాబాపైకి పంపారు సులోచన. డాబా గదిలోకి వెళ్లగానే అరుదైన సంజీవదేవ్ చిత్రాలు, సన్మానపత్రాలు, జ్ఞాపికల మధ్య పట్నాయక్ వేసిన పెద్ద సంజీవదేవ్ వర్ణచిత్రం. కిటికీ పక్కన పాతకాలం నాటి పెద్ద టేబుల్, కుర్చీలు. బహుశా అక్కడే కూర్చొని సంజీవదేవ్ రచనలకు ప్రాణం పోసేవారేమో? పెయింటింగ్స్ వేసేవారేమో? అనుకుని ఆ కిటికీ తెరిస్తే... అద్భుత లోకం అవిష్కరించుకుంటుంది.

*

ప్రకృతే సర్వస్వం

"పైన గది అంటే వారికి చాలా ఇష్టం. వరిచేలు, అరటితోటల మీదుగా బకింగ్‌హామ్ కెనాల్ అందాలను చూస్తూ చదువుకొనే వారు. రాసుకొనే వారు. ఆయనకు మరో ఇష్టమైన ప్రదేశం పక్కనే ఉన్న సపోటా తోట. రోజూ ఒక్కసారయినా తోటలో కాసేపు అలా పచార్లు చేయనిదే ఆయనకు మనశ్శాంతి ఉండేది కాదు. అందుకే ఆయన సమాధిని అక్కడే ఏర్పాటు చేశాం.

ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ఎన్నో చోట్ల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఆయన తీసిన ఫొటోలే మా మధ్య బంధాన్ని పెంచాయి. మాది కొల్లూరు మండలం దోనెపూడి. నాన్నగారు మద్రాసులో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు. నేను అక్కడే ఇంటర్ చదువుతున్న రోజుల్లో సెలవులకని దోనెపూడి వచ్చాను. పెళ్లిచూపులకు సిద్ధం కమ్మన్నారు. ఆ రోజుల్లో పెద్దవాళ్లు చెప్పింది చేయడమే కానీ వాళ్లకు ఎదురు మాట్లాడడం ఉండేది కాదు. ఆ నోటా ఈ నోటా తెలుసుకున్నదేమిటంటే అబ్బాయికి ఆస్తి పాస్తులున్నాయి. బాగా చదువుకున్నాడు. పుస్తకాలు రాస్తాడు అని. పెళ్లి చూపులయ్యాయి. ఆయన తను తీసిన ఫోటోల ఆల్బంను నాకు పంపారు చూడమని. అలా ఫొటోలు మా బంధాన్ని పెంచాయి. పెళ్లయింది. తుమ్మపూడిలో కాపురం పెట్టాం. మొదట్లో మావాళ్లలో కొందరు గొణిగేవారు. చేతిలో ఇంత కళ ఉండీ ఈ మారుమూల పల్లెటూర్లో ఉండడం ఎందుకు? మద్రాసు వస్తే ఎంతపేరు ... ప్రఖ్యాతి అని. నాకూ పల్లె వాతావరణం ఇష్టం. ఆయనకు ప్రకృతే సర్వస్వం. అందుకే ఆ ప్రస్థావన మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ రాలేదు.

రాహుల్ సాంకృత్యాయన్ మా ఇంట్లో వారమున్నారు

రోజూ పోస్ట్‌మెన్ కోసం ఎదురు చూడడం ఆయనకు ఇష్టమైన పనుల్లో ఒకటి. ఉత్తరాలు రాగానే వాటికి వెంటనే బదులిచ్చేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బంధువు, శిష్యుడు అశిత్ కుమార్ హల్దార్, ఫెడ్రిక్ రోరిక్, రాహుల్ సాంకృత్యాయన్ వంటి వారెంద రి నుంచో ఉత్తరాలు వచ్చేవి. రాహుల్ సాంకృత్యాయన్ తుమ్మపూడి వచ్చి వారం ఉన్నారు. నేను ఆయన్ను కలవలేకపోయాను. ఆ సమయంలో నేను అమ్మావాళ్లింట్లో ఉన్నాను. ఆచంట జానకిరామ్, శారద, పట్నాయక్, ఎస్. రామారావు వంటి ప్రముఖులు, మరెందరో రచయితలు ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు. వచ్చిన వారితో వర్తమాన విషయాలపై చర్చలు నడిచేవి. అలాంటి వారు వచ్చినప్పుడు నాలుగురోజులు ఉండనిదే ఆయనకు తృప్తిగా ఉండేది కాదు. కొత్తవారయినా సరే ఇంటికి వచ్చిన వారికి అరిటాకులో భోజనం పెట్టకుండా పంపితే ఆయన నొచ్చుకొనే వారు. ఆయన ఎవరినీ కోప్పడిన సందర్భం లేదు. ఎప్పుడూ నిర్మలంగా ఉండేవారు. నిశ్శబ్దాన్ని ఇష్టపడేవారు. పుస్తకాలు, ఫొటోలు, పెయింటింగ్స్, లేఖలు, చింతన, చర్చలే ఆయన జీవితం.

ఎక్కువగా తాత్త్విక ధోరణి కనిపించేది

నాకు తెలిసిన రోజు నుంచి చివరి శ్వాస తీసుకొనే దాకా ఆయన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పులేదు. ఎలాంటి ఉరుకులు, పరుగులు లేని జీవన శైలిని ఆయన సాధన చేశారు. సొంతం చేసుకున్నారు. కష్టంలో కూడా ఆయన కలవరపడేవారు కాదు. మొదట మాకు ఒక అబ్బాయి పుట్టి పోయాడు. నేను బాధపడుతుంటే, "చింతపడకు, ఏడాది తిరగకుండా వాడే మళ్లీ పుడతాడు'' అంటూ ధైర్యం చెప్పారు. అలానే జరిగింది. అలా ఆయనలో ఎక్కువ సందర్భాల్లో తాత్త్విక ధోరణి కనిపించేది. పిల్లలు జోగేంద్రదేవ్, మహేంద్రదేవ్‌ల చదువుల విషయంలో కూడా వాళ్ల స్వేచ్ఛను కాదనే వారు కాదు.
మొదట్లో ఆయన పెయింటింగ్స్ వేసేవారు కాదు. దృష్టి అంతా ఫొటోగ్రఫీ మీద ఉండేది. దేశంలో చాలా పట్టణాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు పెట్టేవారు. నేను కూడా వెళ్లేదాన్ని. ఎందరో ప్రముఖులు ఆయన్ని పొగుడుతుంటే ఆయన వినమ్రంగా ఉండేవారు. అంతటి నిగర్వి ఆయన. ఆ తరువాత పట్నాయక్, ఆచంట జానకిరాంల ప్రోత్సాహంతో పెయింటింగ్ మీద దృష్టి పెట్టారు. ఆసేతు హిమాచలం ఆయన చూసిన ప్రకృతి అందాలన్నీ ఆ పెయింటింగ్స్‌లో ప్రతిఫలించేవి.

అరుదైన జీవన శైలి ఆయనది

చాలా సందర్భాల్లో నాకు ఆశ్చర్యం అనిపించేది. హైస్కూలు స్థాయి దాటని చదువుతో ఇంగ్లీషు, బెంగాలీ, ఫ్రెంచ్, హిందీ, ఉర్దూ భాషలు నేర్చుకోవడం ఏమిటి? తెలుగు, ఇంగ్లీషులో 23 పుస్తకాలు రాయడం ఏమిటి? ఇందరు ప్రముఖుల స్నేహాలు లభించడం ఏమిటి? ఆంధ్రాయూనివర్శిటీ నుంచి డి.లిట్‌తో పాటు ఇన్ని సత్కారాలు, గౌరవాలు అందుకోవడం ఏమిటని? ఎవరినీ అనుసరించని, అరుదైన ఆయన జీవన శైలి ఆయనలో ఆలోచనను పెంచింది. అద్భుతాలు చేయించిందనిపించేది. ఆయన రచనలు చేస్తుంటే నేను వాటిని టైప్ చేసి పెట్టేదాన్ని. నన్ను కూడా రాయమని ప్రోత్సహించే వారు. నాకు ఇల్లు, పిల్లలతోనే సరిపోయేది.

ఆయనకు సంచారం అంటే మహా ప్రీతి. పాతికేళ్లు నిండకుండానే హిమాలయాలన్నీ తిరిగి వచ్చారు. ఆ తరువాత కూడా ఆయనలో భ్రమణకాంక్ష తీరలేదు. తరచూ కులూమనాలి వెళ్లే వాళ్లం. ఆ వాతావరణం, ప్రకృతి అందాల్ని ఆయన బాగా ఇష్టపడేవారు. స్విట్జర్లాండ్ వెళ్లాలని అనేవారు కానీ కుదరలేదు. మనుమరాళ్లు కావ్య, మానసి అంటే బాగా ఇష్టపడేవారు. మా అబ్బాయిలకు కళల పట్ల ఆసక్తి కలగలేదు కానీ మనుమరాళ్లకు ఆ లక్షణాలు అబ్బాయి. వాళ్లు వేసిన పెయింటింగ్స్ చూసి ముచ్చటపడేవారు. చివరి శ్వాస విడిచేరోజు కూడా ఆయన పనులన్నీ చేసుకున్నారు. టిఫిన్ చేశారు. వంట్లో కాస్త నలతగా ఉందన్నారు. తెనాలిలో ఉండే డాక్టర్ దక్షిణామూర్తికి కబురు పంపాం. వారు వచ్చేలోగానే కన్నుమూశారు.

ఆయన లేకపోయినా ఈ ఇంటి నిండా ఆయన జ్ఞాపకాలున్నాయి. ఈ రోజుకీ ఆయన తోటలో షికార్లు చేస్తున్నట్లే ఉంటుంది. మా పెద్దబ్బాయి జోగేంద్రదేవ్ వ్యాపారంలో స్థిరపడ్డారు. చిన్నబ్బాయి మహేంద్రదేవ్ ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నాడు. వాళ్లు అక్కడికి వచ్చి ఉండమంటారు. దశాబ్దాల ఈ బంధాన్ని వదులుకోవడం నా వల్ల కావడం లేదు. ఆయన రోరిక్‌కు రాసిన లేఖలను న్యూయార్క్‌లోని రోరిక్ మ్యూజియంలో పెట్టారు. ఈయన వేసిన పెయింటింగ్స్‌ను అమెరికాలో ఉండే ఎస్.వి. రామారావు గారు తీసుకెళ్లి, అక్కడ ప్రత్యేక గ్యాలరీలా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆయన తిరిగిన నేల పరిమళాల్ని ఆస్వాదించేందుకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకాలను నిత్యనూతనంగా ఉంచుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
- టి. కుమార్
ఫోటోలు : బాబీ, చిలుమూరు