Tuesday, September 28, 2010

తరగని స్ఫూర్తి ‘చిలకమర్తి’ * నేడు 143వ జయంతి

తరగని స్ఫూర్తి ‘చిలకమర్తి’
నేడు 143వ జయంతి

  ‘భరతఖండంబు చక్కని పాడియావు..
  హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 
  తెల్లవారను గడుసరి గొల్లవారు 
  పితుకుచున్నారు మూతులు బిగియబట్టి’

- పరపాలకుల దోపిడీని అరటి పండు వలిచి చేతపెట్టినట్టు చాటిన పద్యమిది. దీన్ని రచించి సామాన్యుల్లో సైతం దేశభక్తిని ప్రేరేపించిన చిలకమర్తి లక్ష్మీనరసింహమే తన ‘ప్రసన్నయాదవం’ నాటకం చతుర్థాంకంలో ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అంటూ స్ర్తీ విద్య ఆవశ్యకతను చాటారు. అకుంఠిత దీక్షతో, స్వయంకృషితో సాహితీవేత్తగా, సంఘ సంస్కరణాభిలాషిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, పత్రికా నిర్వాహకునిగా ఎదిగిన చిలకమర్తి తెలుగుజాతికి చిరస్మరణీయమైన సేవలు అందించారు.

చిన్నతనంలోనే చూపు మందగించి, 30 ఏళ్లకే అంధత్వం ప్రాప్తించినా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారు. 1867 సెప్టెంబర్ 26న ఖండవల్లిలో మధ్యతరగతికి చెందిన చిలకమర్తి రత్నమ్మ, వెంకయ్య దంపతులకు చిలకమర్తి జన్మిం చారు. వీరవాసరంలో ప్రాథమిక, హైస్కూలు విద్యాభ్యాసం అనంతరం 1885లో రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. కందుకూరి వీరేశలింగం సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు.

‘గయోపాఖ్యానం’తో రికార్డు
చిలకమర్తి ‘కీచకవధ’ నాటక రచనతో 22 ఏళ్లకే సాహితీరంగంలోకి అడుగుపెట్టారు. 60కి పైగా నవలలు, నాటకాలు, ప్రహసనాలు, జీవిత చరిత్రలు, శతకాలు రచించారు. చిలకమర్తికి చిరకీర్తి నందించిన ‘గయోపాఖ్యానం’ నాటకం లక్ష ప్రతులకు పైగా అమ్ముడవడం నాటికీ, నేటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఆయన నాటకాల్లో ‘ద్రౌపదీ పరిణయం, పారిజాతాపహరణం, ప్రహ్లాద చరిత్ర, చతురచంద్రహాసం’ చెప్పుకోదగ్గవి కాగా నవలల్లో ‘రామచంద్ర విజయం, విజయలక్ష్మీ గణపతి, రాజరత్నం’ విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. కొన్ని అనువాద రచనలు కూడా చేశారు. తన రచనలన్నీ సులభ గ్రాంథికంలోనే రచించారు.

హరిజన విద్యావ్యాప్తికి పాఠశాల స్థాపన
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి రావడానికి ముందే చిలకమర్తి హరిజన విద్యావ్యాప్తికి 1909లో రామ్మోహనరాయ్ పాఠశాల స్థాపిం చారు. ఉచితంగా చదువు చెప్పే ఈ పాఠశాలలో ఆంగ్లభాషను కూడా బోధించేవారు. వయోజనులకోసం 1915లో వివేకానంద పాఠశాలను స్థాపించారు. సమాజ ప్రగతికి స్ర్తీ విద్య తప్పనిసరని చిలకమర్తి భావించేవారు. 1928లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘ఉభయ భాషా ప్రవీణ’ పట్టం అందుకున్న తొలిమహిళ చిలకమర్తి మేనకోడలు రావూరు వెంకట సుబ్బమ్మ. పఠనాసక్తి పెంచడానికి గ్రంథాలయాలు తప్పనిసరని చిలకమర్తి గుర్తించారు. 1914లో విజయవాడలో జరిగిన ఒక సభలో ‘వాయువు ఎల్లవారికి ఎట్లు స్వాధీనమై ఉన్నదో జ్ఞానము కూడా అట్లు స్వాధీనం కావలయును. ఉదకం ఎల్లవారికీ ఎట్లు సేవ్యమై ఉన్నదో జ్ఞానము కూడా అట్లు సౌఖ్యప్రదముగా యుండవలయును’ అన్న ఆయన సందేశం నేటికీ వర్తిస్తుంది.

సాహిత్యమే ఆయుధంగా స్వాతంత్య్ర స్ఫూర్తి
ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి చిలకమర్తి సాహిత్యాన్నే ఆయుధంగా చేసుకున్నారు. బిపిన్ చంద్రపాల్, రమేష్ చంద్రదత్తు రాజమండ్రిలో చేసిన ఆంగ్ల ప్రసంగాలను చిలకమర్తి తెలుగులోకి అనువదించేవారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఆశువు గా చెప్పినదే చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే ‘భరత ఖండంబు...’ పద్యం. చిలకమర్తి 1906 జనవరిలో ‘మనోరమ’ మాసపత్రికను, 1910 ఆగస్ట్‌లో ‘దేశమాత’వారపత్రికను స్థాపించారు. ఆయనకు 1922లో విశాఖపట్నంలో పురప్రముఖులు ‘సాహిత్య చక్రవర్తి’ బిరుదునిచ్చి సత్కరించారు. 1943 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చింది. తెల్లవారు దేశం నుంచి నిష్ర్కమించడానికి ఒక సంవత్సరం ముందు 1946 జూన్ 17న చిలకమర్తి పరమపదించా రు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో పేర్కొన్నట్టు నవ్యాంధ్రలోకానికి చిలకమర్తి సుధాశరశ్చంద్రులే.

No comments: