Sunday, May 27, 2012

అందరివాడు 'అమరపనాయుడు'

'మా ముత్తాత ఊరది. ఆయన పేరుతో ఆ ఊరు వెలసింది. అదే నా మూలం, అదే నా ఊరు, అదే నా చిరునామా' అంటున్న లగడపాటి రాజగోపాల్ తన ముత్తాత పేరుతో తనకున్న అనుబంధం మరువలేనిదంటారు. మా ముత్తాత పేరుతో చేసే ప్రతీ పని ఫలిస్తుందని అంటున్న ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. నేనెన్ని ఊళ్లు తిరిగినా నా ఊరు మాత్రం 'అమరపనాయుడు కండ్రిక' అంటున్న ఈ ఎంపీగారి కబుర్లే ఈ  'మా ఊరు'.
"ఊరగానే పచ్చనిపైర్లు, మట్టి రోడ్లు, పెంకుటిళ్లు, వాగులు, వంకలు గుర్తుకొస్తాయి. నేను పుట్టింది నెల్లూరు పట్టణంలోనైనా ఊరి జ్ఞాపకాలనగానే మా అమ్మమ్మ ఊళ్లో నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతుంటాయి. నా చిన్నప్పుడు వేసవి సెలవులు రాగానే మా తాతయ్యల రాకకోసం వేయికళ్లతో ఎదురుచూసేవాడ్ని. ముందు మా అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడ్ని. అక్కడి నుంచి నాన్నఊరికి. అమ్మమ్మ ఊళ్లో అడుగుపెట్టడంతో మొదలయ్యేది నా హడావిడి. అక్కడ నాకొక బ్యాచ్ ఉండేది. ఓ పదిమంది కుర్రాళ్లు కలిసి ఊరి చివరన ఉన్న తాటి చెట్ల దగ్గరికి పరిగెట్టేవాళ్లం. అప్పటికే మా తాతయ్య మాకోసం నాలుగు తాటి గెలలు కొట్టించేవాడు.

నువ్వెన్ని అంటే నువ్వెన్ని అంటూ పోటీ పడి తినేవాళ్లం. ముంజల కాలం అయిపోయాక తేగల కాలం వచ్చేది. పచ్చి కర్రలు చేతిలో పట్టుకుని తేగల కోసం మట్టి తవ్వడంలో బిజీ అయిపోయేవాళ్లం. పొద్దున్నే తవ్వుకుని వాటిని కాల్చి తినేవాళ్లం. సెలవులన్నీ ఇట్టే గడచిపోయేవి. మరో పదిరోజులు సెలవులున్నాయనగా మా నాన్నూరు నుంచి కబురు వచ్చేది. మా మూత్తాత పేరు అమరపనాయుడు. మా ఊరి పేరు కూడా అదే. 'అమరపనాయుడు కండ్రిగ'. నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. మా తాత (వెంకట సుబ్బానాయుడు), నాన్న (వెంకట రామానాయుడు) అందరూ అదే గ్రామంలో పుట్టి పెరిగారు. నేను మాత్రం నెల్లూరు పట్టణంలో పుట్టాను. చదువులు టౌన్‌లో, సెలవులు ఊళ్లో. నాలుగు తరాలవారు పుట్టి పెరిగిన అమరపనాయుడు కండ్రిగే నా ఊరు, ఉనికి.
http://www.tv5news.in/en/politics/photos/1971/Lagadapati%20Rajgopal2.jpg
అమరపనాయుడి ప్రాంతం...

మా ఊరికి మా ముత్తాత పేరు ఎలా వచ్చిందంటే...ఆ ప్రాంతానికి ఆయనే మొదట వచ్చారని చెప్పేవారు మా పెద్దలు. చాలా పెద్ద రైతాయన. కండ్రిక అంటే పలానా వారి ప్రాంతం అని అర్థం. మా ముత్తాతే ముందు వెళ్లిన ప్రాంతం కావడంతో ఆయన పేరుతో 'అమరపనాయుడు కండ్రిక' అని పిలవడం మొదలెట్టారని మా తాతయ్య చెప్పారు. నాన్న, పెదనాన్న, మేనత్త అందరూ మా ముత్తాత కట్టిన ఇంట్లో కలిసే ఉండేవారు. మా తాతది పెద్ద కుటుంబమే అయినా ఊరు మాత్రం చాలా చిన్నది. అందరూ రైతులే. మా తాతగారు కూడా వ్యవసాయమే చేసేవారు. నేను పుట్టింది నెల్లూరి టౌన్‌లోనైనా ఎక్కువగా మా తాతయ్య దగ్గరికి వెళ్లేవాడ్ని. నా చిన్నప్పుడు ఆ ఊళ్లో వందిళ్లకు మించి ఉండేవి కావు.

లారీ డ్రైవర్ నాన్న...
నాన్న మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లలేదు. మొదట్లో ఒక లారీ కొనుక్కుని ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేశారు. కొన్నాళ్ల తర్వాత ఒక ప్రయివేటు బస్సు తీసుకున్నారు. మా చదువులు, నాన్నగారి వ్యాపారం కలసి మమ్మల్ని నెల్లూరు పట్టణం దాటనివ్వలేదు. అయినా సరే సెలవులు వస్తే చాలు నాన్నతో అమరపనాయుడు కండ్రిక, అమ్మతో పెరుమాళ్లపాడు వెళ్లిపోయేవాడ్ని.

తాత చెప్పిన కథలు...

కథలు వినాలంటే అమరపనాయుడు కండ్రికకు వెళ్లాలి. తాటి ముంజలు కావాలంటే పెరుమాళ్లపాడుకి అంటే మా అమ్మమ్మ ఊరికి వెళ్లాలి. మా తాతయ్య వెంకట సుబ్బానాయుడు నన్ను తన పక్కనే పడుకోబెట్టుకుని బోలెడు కథలు చెప్పేవాడు. ఊరికి సంబంధించి, మా పూర్వీకులకు సంబంధించి యధార్థ సంఘటల్ని కథలుగా మలచి ఎంతో ఆసక్తిగా చెప్పేవారు. ఆయన చెప్పిన ఒక సంఘటన నేను ఎప్పటికీ మరచిపోలేను. ఒకరోజు మా చిన్నతాతయ్య పొలం గట్టు నుంచి వస్తుంటే పాము కరిచి చనిపోయాడట. ఆయన పేరే మానాన్నకు పెట్టారు. మా నాన్న పెద్దయ్యాక ఒకరోజు నాన్న కాలికి పాము చుట్టుకుందట. వెంటనే నాన్న దాన్ని చేత్తో పట్టుకుని దూరంగా విసిరేశాడట. మా నాన్న ధైర్యసాహసాల గురించి రకరకాల సంఘటల్ని వివరిస్తూ బోలెడు కథలు చెప్పేవాడు తాతయ్య. ఆయన చెప్పిన కబుర్లని ఊళ్లోని నా స్నేహితులతో గొప్పగా చెప్పేవాడ్ని నేను.
http://www.andhralekha.com/homepage_images/1261195594lagadapati.jpg
అమ్మఊరు...

మా అమ్మ తండ్రి వేమన మాలకొండయ్యకి నేనంటే ప్రాణం. సెలవులు వచ్చాయంటే చాలు నెల్లూరుకి వచ్చి నన్ను తీసుకెళ్లేవాడు. పెరుమాళ్లపాడులో తాతయ్యకు మంచి పేరుండేది. ఎందుకంటే అక్కడ తాతయ్యే ఆల్ ఇన్ వన్. జబ్బు చేసినవారికి ఇంజక్షన్ చెయ్యడం నుంచి రేడియో రిపేర్లవరకూ అన్ని పనులు తాతయ్యే చేసేవాడు. (నవ్వుతూ...) ఏ పనికీ లైసెన్సు ఉండేది కాదు. పోస్టుమెన్ ఉద్యోగం కూడా ఆయనదే. ఆ ఊళ్లో ఎక్కువగా తాటి చెట్లు ఉండేవి. తాటి ముంజలు, తేగలు బాగా దొరికేవి. తాటి ముంజలు పట్టుకుని మామిడి తోటల్లోకి వెళ్లి అక్కడ కూర్చుని తాపీగా తినేవాళ్లం. తేగలకోసం మట్టిని తవ్వడం, కాల్చుకుని తినడం, స్నేహితులకి పంచడం....చాలా హడావిడిగా ఉండేది. ఇప్పటికీ తాటి ముంజల పేరు వినపడగానే పెరుమాళ్లపాడు గుర్తుకొస్తుంది. అమ్మకు ఆ ఊరితో అనుబంధం ఎక్కువ. ఊళ్లోని ప్రతి గడపతోను పరిచయం ఉందామెకు.
http://www.gulte.com/content/2012/01/news/I-will-ask-Chiranjeevi-to-resign--Lagadapati-165.jpg
లాంకో నామకరణం...

నేను రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో అడుగుపెట్టాను. నా వ్యాపారాలన్నీ లాంకో (లగడపాటి అమరపనాయుడు కంపెనీ) పేరుతోనే ఉంటాయి. అంటే మా ముత్తాత పేరుమీద. మా పెదనాన్న పేరు కూడా అదే. వ్యాపారాలు,సేవా కార్యక్రమాలు అన్నీ మా ముత్తాత పేరు మీదే. అమరపనాయుడు కండ్రికలో మా ముత్తాత కట్టిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో మా మేనత్త ఉంటున్నారు. ఊళ్లో పెద్దగా ఆస్తులు లేకపోయినా మా ముత్తాత పేరుతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము గుంటూరు వచ్చేశాక మా తాతల ఊర్లతో సంబంధాలు బాగా తగ్గిపోయాయి. మూడేళ్ల క్రితం లాంకో పేరుతో అమరపనాయుడు కండ్రికలో బస్‌షెల్టర్ కట్టించాను. అలాగే మంచినీటి సౌకర్యం లేక ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశాను. ఆ సమయంలో ఊరి ప్రజల కళ్లలో ఆనందం నేను ఎప్పటికీ మరువలేను. ఆ ఊళ్లో ఇప్పటికీ మా ముత్తాత గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. ఆయన రోజుల్లో తన స్థోమతకు తగ్గట్టుగా తాతయ్య ఊరి ప్రజలకు చేసిన సాయాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఆయన బాటలోనే నేనూ నడుచుకుంటున్నాను.
http://www.thehindu.com/multimedia/dynamic/00661/HY19LAGADAPATI_G3M2_661735e.jpg
12 కోట్లతో...

లాంకో ఫౌండేషన్ తరపున అమరపనాయుడు కండ్రికలో 12 కోట్ల వ్యయంతో వృద్ధాశ్రమం కట్టిస్తున్నాను. దీని గురించి ముందు మా ఊరి ప్రజలతో మాట్లాడాను. మా ఊరి ప్రజలే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ల వారు కూడా వృద్ధాశ్రమం కావాలన్నారు. చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో ఊళ్లొదిలే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా లేదంటే జంటగా వెళుతున్నారు. కాని వృద్ధుల్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం లేదు. దాంతో సొంతూర్లో ఉంటూనే పెద్దలు అనాథలవుతున్నారు. అవసానదశలో నా అన్నవాళ్ల తోడులేక ఇబ్బందిపడుతున్నారు. మా చుట్టుపక్కల గ్రామాల్లో అలాంటివారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుసుకుని పూర్తి వసతులతో కూడిన వృద్ధాశ్రమం కట్టడానికి నిశ్చయించుకున్నాం. అది కూడా మా ముత్తాత పేరుతో కడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ పని చేసినా మన పెద్దల్ని గుర్తుచేసేలా ఉండడం సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం ఊళ్లో వృద్ధాశ్రమం పనులు మొదలయ్యాయి. మా ఊరిప్రజలకు అవసరమ్యే సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

ఆ ఊళ్లో ఎక్కువగా తాటి చెట్లు ఉండేవి. తాటి ముంజలు, తేగలు బాగా దొరికేవి. తాటి ముంజలు పట్టుకుని మామిడి తోటల్లోకి వెళ్లి అక్కడ కూర్చుని తాపీగా తినేవాళ్లం. తేగలకోసం మట్టిని తవ్వడం, కాల్చుకుని తినడం, స్నేహితులకి పంచడం....చాలా హడావిడిగా ఉండేది. ఇప్పటికీ తాటి ముంజల పేరు వినపడగానే పెరుమాళ్లపాడు గుర్తుకొస్తుంది.
http://www.hindu.com/2007/01/18/images/2007011807680501.jpg
అమ్మ కోసం...
అమ్మకు తన ఊరి(పెరుమాళ్లపాడు)తో అనుబంధం ఎక్కువ. ఊరికి కావాల్సిన ఎలాంటి సాయాన్ని చేయడానికైనా ముందుకెళుతుంది. ఈ మధ్యనే తన ఊళ్లో రామాలయం కట్టించింది. మా తాతయ్య మాలకొండయ్యకు ఊళ్లో మంచి పేరుందని చెప్పాను కదా! ఆయన తర్వాత ఊరివాళ్లంతా అమ్మనే తలిచేవారు. అమ్మ కూడా అందరితో కలిసిపోయేది. తను ఏ స్థాయిలో ఉన్నా ఊరికి వెళ్లిందంటే నా చిన్నప్పటి అమ్మలా మారిపోతుంది. నాన్న కూడా అంతే తనకి ఊరు గుర్తొచ్చినప్పుడల్లా అమరపనాయుడు కండ్రికకు వెళ్లివస్తుంటారు. వెళ్లొచ్చాక ఊరి కబుర్లను ఎంతో ఆసక్తిగా చెబుతారు. నేను పెద్దగా పూజలు చేయను. కాని మా అమ్మ ధైవభక్తురాలు. ఆమెకు మానవసేవ, మాధవసేవ రెండూ కావాలి. నేను అప్పుడప్పుడు పెరుమాళ్లపాడుకి వెళ్లివస్తుంటాను.

Saturday, May 19, 2012

మహానేతకు ఇదా నివాళి?

ఈ రోజుల్లో మనం చూస్తున్నవి రాజకీయాలే కాదు! ప్రజాక్షేమం కోసం సర్వస్వాన్ని అర్పించి, నిజాయితీతో బతికి, అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయులెందరో రాజకీయాల్లో ఉండేవారు. వారిలో తెలుగునేలపై పుట్టి, యావత్ భారత ప్రజల జేజేలందుకున్న నీలం సంజీవరెడ్డి అగ్రగణ్యులు. నేడు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరిద్దాం.


"గాం«ధీ వంటి నైతిక విలువలున్న మహనీయుడూ, మహాత్ముడూ మళ్లీ పుట్టాలి. జాతీయ, ప్రాంతీయ సమస్యలన్నిటికీ అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. నా దగ్గర కొచ్చే జిల్లాల రాజకీయ నాయకులందరికీ నిక్కచ్చిగా చెపుతున్నాను-ఈ హత్యలేమిటి? పదవుల కోసం ఇంత నైతికంగా దిగజారటమేమిటి? ప్రజలను తక్కువగా అంచనా వెయ్యకండి. ఎప్పుడో ఒకసారి ఎదురు తిరిగి తగిన బుద్ధి చెపుతారు. జాగ్రత్త... ఏమిటీ కోట్ల సంపాదన? ఎందుకింత కూడబెట్టటం? బ్రతకడానికి ఇంత అవసరమా?'' అంటూ మాజీరాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్టీనేతలను నిలదీసేవారు. ఈ కాలంలో అలాంటి నేతలు కనిపించరు. అలాంటి హితవాక్యాలు మచ్చుకైనా వినిపించవు. కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదాయన. నిరాడంబరంగా జీవించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.


సి.ఎం. పదవి తృణప్రాయం
1914 మే 19వ తేదీన అనంతపురం జిల్లా అల్లూరులో రైతు కుటుంబంలో జన్మించిన ఈ మహానేత 18 సంవత్సరాల చిరు వయస్సులోనే సత్యాగ్రహం నిర్వహించటం ద్వారా వెలుగులోకి వచ్చారు. 25 సంవత్సరాల వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ ప్రొవెన్షియల్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శిగా ఎన్నికై 10 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 1940-45 సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం, వి.వి.గిరి తదితరులతో అనేకసార్లు జైల్లో సహజీవనం చేశారు. 1947లో భారత రాజ్యాంగ పరిషత్‌లో కీలక పదవిలో ఉండి, రాజ్యాంగ రచనలో ముఖ్యపాత్రను నిర్వర్తించారు.


1953లో ఉపముఖ్యమంత్రిగా, 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1959లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, 1962లో తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్సు రూట్ల జాతీయకరణపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావటంతో నెహ్రూ వద్దని ఎంతగా వారిస్తున్నా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించారు. కేంద్రమంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు. 1967లో లోక్‌సభ స్పీకరుగా ఆ పదవికే వన్నెతెచ్చారు. ఎమర్జెన్సీ తరువాత 1977 జూలై 13వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.


నిరాడంబరుడు నీలం
రాష్ట్రపతి భవన్‌లో ఉన్న 5 సంవత్సరాలూ బంగారు పంజరంలో బందీగా ఉన్నట్టు బాధపడిపోయేవారు సంజీవరెడ్డి దంపతులు. అన్ని వందల గదులున్న రాష్ట్రపతి భవనంలో కేవలం మూడు గదులను మాత్రమే వారి కోసం కేటాయించుకున్నారు. ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడటం నిజంగా నా అదృష్టం. 1996వ సంవత్సరం మే 19వ తేదీన అంకుల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి జన్మదినం సందర్భంగా- ఎప్పటిలాగే శుభాకాంక్షలు చెప్పాలని బెంగళూర్ ఫోన్ చేశాను. అంకుల్ ప్రేమపూరితమైన పిలుపు వింటుంటే కళ్ల నీళ్లు తిరిగాయి.


"వారం రోజులు శలవు పెట్టి రా కృష్ణా! మీ ఆంటీ కూడా ఎదురుచూస్తోంది''- సమాధానంగా కళ్లు వర్షించాయి. 50 సంవత్సరాల పైగా మా కుటుంబాల మధ్యన పెనవేసుకుపోయిన గాఢానుబంధం అటువంటిది. నా తండ్రి కాజ జగన్నాథరావు, సంజీవరెడ్డి అంకుల్ ప్రాణ స్నేహితులు. ఒక విధంగా చెప్పాలంటే-అంకుల్, మా ఆంటీ నాగరత్నమ్మగారూ-నాకు పెంపుడు తల్లిదండ్రులు.


నా కోరిక ప్రకారం అంకుల్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు(1962లో) కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో సీటు తెప్పించి-నాన్నగారితోబాటు స్వయంగా వచ్చి-నన్ను కాలేజ్‌లో అడ్మిట్ చేశారు. క్లినికల్స్ లోకి అడుగు పెట్టినప్పుడు స్వయంగా స్టెతస్కోప్ పంపించి ఆశీర్వదించారు. అతి చిన్న వయస్సులోనే నాన్నగారు శాశ్వతంగా దూరమైతే-ఇంటి పెద్దగా అండగా నిలిచారు. అంకుల్ రుణాన్ని నేను తీర్చుకోగలనా?


సర్వస్వం దేశం కోసం..
అంకుల్‌కు, దగ్గరవారికి ఆంటీనే స్వయంగా వంట చేసేవారు. తమ్ముళ్లతోసహా కొన్ని రోజులు రాష్ట్రపతి భవన్‌లో ఉండే అదృష్టం నాకు కలిగింది. అంకుల్ రామభక్తులు. వెంకటేశ్వరస్వామి భక్తులు కూడా. ప్రొద్దుటే స్నానం చేసి పూజ చేసుకునే బయటకు వెళ్లేవారు. తరిమెలలోని రామాలయంకు బావ నాగిరెడ్డితో కలిసి తరచుగా వెళ్లి ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. ఈ దేశం కోసం ఆ మహానేత ఎంతో చేశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన సర్వస్వం ధారపోశారు.


తుంగభద్ర, నాగార్జునసాగర్, శ్రీశైలం మొదలైన ఎన్నో ప్రాజెక్టుల ఆవిర్భావానికి నిద్రాహారాలు మాని కృషిచేశారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక-అనంతపురంలో ఉండగా, జ్ఞానీ జైల్‌సింగ్, వెంకట్రామన్, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్.టి.ఆర్ వంటివారు ఈ రాజనీతిజ్ఞుని సందర్శించి తగిన సలహాలను పొందేవారు. ఆయన తరచు నాతో అనేవారు, "కృష్ణా! మనిషన్న తరువాత కృతజ్ఞతా భావం ఉండాలి. అది లేనివాడు మనిషనిపించుకోడు''అని. కన్నకూతురిలా చూసుకున్న అంకుల్ వర్ధంతి సభలని ఇన్నేళ్లుగా నిర్వహిస్తున్నప్పుడు నాకనిపించేది... అనిపిస్తోంది...ఈ రాష్ట్రానికి ఎంతో చేశారే మహానుభావుడు... కాని, కనీస కృతజ్ఞతనేది చూపిస్తున్నారా ఎవరైనా?!


నివాళి ఇదేనా?
ఆయన చివరి రోజుల్లో ఒక కోరిక కోరారు. "నేను భారతీయుడిని. ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వాడిని కాను. అందుకే నా మరణానంతరం నేనెక్కడుంటే అక్కడే నా అంత్యక్రియలు జరిపించండి'' అని. ఆయన ఆఖరి కోరిక నెరవేరింది. ఎన్నో సంప్రదింపుల తరువాత, సుదీర్ఘ తర్జన భర్జనల తరువాత, చివరికి హైదరాబాద్‌లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.


అంతటి మహానేతకు, అంతటి త్యాగమూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, రాష్ట్ర ప్రజలూ అర్పించే నివాళి ఇదేనా? ఇంతేనా?! ఘనంగా నిర్వహించాల్సిన, చూపించాల్సిన కృతజ్ఞత తాలూకు చిహ్నాలేవీ? మే 19వ తేదీన ఈ త్యాగధనుని జయంతిని, జూన్ మొదటి తేదీన వర్ధంతినీ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, దేశాధినేత అయిన ఆ రాజనీతిజ్ఞుని చిత్రపటాన్ని జూబ్లీ హాల్లో ఆవిష్కరించాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాను-చేస్తూనే ఉంటాను. 
from: Andhrajyothi Daily

Sunday, December 11, 2011

అనుములనే అమ్మ అనుకున్నాను ...... కుందురు జానారెడ్డి సొంతూరు కథ

మూడేళ్ల వయసప్పుడే అమ్మ చనిపోయింది. అప్పుడు 'అనుముల' గ్రామమే అమ్మ ఒడయ్యింది. జీవితపు దారుల్లో నడిపించింది. నాయకుడిగా తీర్చిదిద్దింది. దాంతో తల్లికి చేయాల్సిన సేవలన్నీ ఆయన అనుముల ఊరికి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందురు జానారెడ్డి సొంతూరు కథ ఇది. ఆయన చెబుతున్న అనుముల కబుర్లే ఈ 'మా ఊరు'


"ఊళ్లోకి జింకల గుంపు వచ్చిందని తెలియగానే చేతిలో ఉన్న పుస్తకాలు విసిరేసి పరిగెట్టేవాడ్ని. కుర్రాళ్లందరం కలిసి నాలుగు రాళ్లు వేయగానే జింకలన్నీ పరుగందుకునేవి. రోజుల వయసున్న జింక కూనలు పరిగెట్టలేక పొదల్లో చిక్కుకుని ఉండిపోయేవి. వాటిని పట్టుకుని ఇంటికి తెచ్చుకునేవాడ్ని. జీతగాడ్ని పిలిచి మేకపాలు తీయించి కొబ్బరిచిప్పలో పోసి జింక పిల్లకి తాపేవాడ్ని. అలా నాలుగైదు నెలలు సాకి మళ్లీ జింకల గుంపుల్లో వదిలేసేవాడ్ని. ఇప్పుడు మా ఊళ్లో మేకపిల్లలే కనిపించడం లేదు ఇక జింకలెక్కడుంటాయి. జూపార్కుకి వెళ్లాలి(నవ్వుతూ...) ఊరు పేరు చెప్పగానే నాకు గర్తొచ్చే దృశ్యాల్లో ఇదొకటి.


వాగు పక్క వ్యవసాయం...
మాది ఉమ్మడి కుటుంబం. నాన్న, చిన్నాన్న తాత(మల్లారెడ్డి)తోనే కలిసి ఉండేవారు. నాన్నకి నేనొక్కడ్నే. చిన్నాన్నకు ఇద్దరూ ఆడపిల్లలే. నేనే వారసుడ్ని. మాది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌కిఎడమవైపున ఉన్న 'అనుముల' గ్రామం. నాకు తెలివొచ్చేటప్పటికి డెబ్బై, ఎనభై ఇళ్లు ఉండేవి. అందరికన్నా మా ఇల్లే పెద్దది. మిద్దె ఇల్లు. ఆరు గదులుండేవి. నాకు మూడేళ్ల వయసుండగానే అమ్మ (లక్ష్మీ నర్సమ్మ) చనిపోయింది. దాంతో ఇంట్లోవాళ్లందరూ చాలా గారం చేసేవారు. మాకు 40 ఎకరాల పొలం ఉండేది. అందులో ఒకే ఒక్క ఎకరం వరిపొలం, మిగతాదంతా మెట్ట పంటలు.


శెనగలు, ఉలవలు, కందులు, పెసలు, ఆముదాలు, పల్లీలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఒరిగలు, కుసుమలు, జొన్నలు...ఇలా అన్ని రకాల పంటలూ పండేవి. మా పొలంలో పండని ధాన్యం లేదు. కాయని కూరలు లేవు. నాన్న(వీరారెడ్డి) ఆకుకూరల్ని కూడా చాలా శ్రద్ధగా పండించేవాడు. పుంటికూర(గోంగూర), కలగూర, ఒంగంటి కూర, పాయల్‌కూర...ఒక్క పురుగుబట్టే కాలం తప్పిస్తే ఏడాదంతా ఈ ఆకు కూరలు మా పొలంలో ఉండేవి. ఇవి కాకుండా పశువుల కొట్టాల్లో, మా ఇంటి దొడ్లో అన్ని రకాల పాదులూ ఉండేవి. పొట్లకాయ, బీర కాయ, చెమ్మకాయ, దోసకాయ, కాకరగాయ పాదులు ఎప్పుడూ ఉండేవి.


వీరారెడ్డి ఇంటికొచ్చిన ఏ బంధువైనా సంచులనిండా ధాన్యాలను, కాయగూరల్ని తీసుకుపోవాల్సిందే. ఊరికి మాదే పెద్ద కుటుంబం కావడంతో ఎవరికి ఏది కావాల్సివచ్చినా వచ్చేవారు. అప్పట్లో పొలాల్లో కరెంటు మోటార్లు ఉండేవి కావు. మోటదోలేవాళ్లం. మోట అంటే ఒక తాడుకి డొప్ప కట్టి బావిలో వేసి ఆ తాడుని రెండు ఎద్దులకు కట్టేవాళ్లు. మధ్యలో తొండంలాంటిది ఉండేది. ఎడ్లు లాగినపుడు నీళ్ల డొప్ప పైకి వచ్చేది. ఆ నీటిని పొలం కాలువలో పోసేవాళ్లు. మామూలుగా ఈ పని చేయడానికి జీతగాళ్లు ఉండేవారు. అప్పుడప్పుడు నేను కూడా సరదాగా మోటదోలడానికి వెళ్లేవాడ్ని. చేతులు బాగా నొప్పిపుట్టేవి. అయినా వెళ్లేవాడ్ని. ఇది కాకుండా నాన్న, జీతగాళ్లు అన్నం తినడానికి వెళ్లినపుడు మధ్యలో ఆపేసిన పనుల్ని నేను కొనసాగించేవాడ్ని. గుంటగొట్టడం, గొర్రె తోలడం(బురద పొలాన్ని చదును చేయడం) కూడా చేసేవాడ్ని. మా నాన్న 'అరె...నీకెందుకురా...' అనేవాడు.


బర్రెలు...గొర్రెలు
డెభై ఆవులు, పది గేదెలు, యాభై గొర్రెలు, అరవై మేకలు ఉండేవి మాకు. వీటన్నిటినీ చూసుకోడానికి ఇంట్లోవాళ్లు కాకుండా నలుగురు జీతగాళ్లు ఉండేవారు. చిన్నాన్న, మేనత్త వాళ్ల పిల్లలు, మేము కలిపి మొత్తం పదిమంది ఉండేవాళ్లం. అందరికీ మా అత్తనే వండిపెట్టేది. పెద్దవయసువారికి వరి అన్నం, చిన్నపిల్లలకు ఒరిగెలన్నం, కొర్రన్నం. జీతగాళ్లకు సజ్జన్నం, జొన్నన్నం. మొత్తానికి ప్రతి రోజు అన్ని రకాల అన్నాలు వండేది. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ సమృద్దిగా ఉండేవి కాబట్టి పెద్ద పెద్ద బొగాణాలలో వండేవారు. మా ఇంటికున్న మరో స్పెషల్ ఏంటంటే...ప్రతి రెండు రోజులకూ నాన్‌వెజ్ ఉండేది.


చేపలు, రొయ్యలు కాదు ఆల్‌టైం మటన్. (నవ్వుతూ..) తిన్నవారికి తిన్నంత. విషయం ఏమిటంటే...మాకు మేకలు, గొర్రెలు ఉండేవి కదా! అవి మేతకు వెళ్లినపుడు వాటిని తినడానికి తోడేళ్లు వెంటపడేవి. అవి మేకని పట్టినపుడు జీతగాడు చూస్తే కర్రతో కొట్టేవాడు. అవి దాంతో మేకని అక్కడే వదిలి పోయేవి. చచ్చిన మేకల్ని జీతగాడు తెచ్చి ఇంటిముందు పడేసేవాడు. మా అత్త వండినంత వండి మిగతా మాంసం ఊళ్లోవాళ్లని పిలిచి పంచేది. పొలాల్లో కల్లాలు ఉన్నప్పుడు నాన్న నన్ను వెంట బెట్టుకుని వెళ్లేవాడు.


వాటికి కాపలా ఉండమనేవాడు. ఆ సమయంలో ఒక్క విజిల్ వేస్తే చాలు నా దోస్తులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఒక గంట కాపలా ఉండడం, మరో గంట గుట్టలెంబడి, చెట్టులెంబడి ఉరకడం. రేగిపండ్లు, పులిచేరు కాయలు, కలింకాయలు...వీటి కోసమే ఉరికేవాళ్లం. 'ఉన్నార్రా...అక్కడ' అని కేక వినిపించగానే మళ్లీ కల్లాలకాడికి వచ్చేసేవాళ్లం. మా ఊళ్లో ఒక్క పండ్లచెట్టు ఉండేది కాదు...జామపండు, మామిడిపండు, దానిమ్మపండు పేరు వినడమే కాని చెట్టు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. పక్క ఊళ్లకు వెళ్లినపుడే వాటి దర్శనం. సీజన్‌లో వచ్చే చిప్పలకాయలు, రేగిపండ్లే మాకు పెద్ద ఫలాలన్నట్టు.


వెన్నెల్లో ఆటలు...
పగలంతా చదువు, చిన్న చిన్న పనులు. వెన్నెలరాత్రులొచ్చాయంటే రాత్రిపూట కూడా ఆటలు ఆడేవాళ్లం. రాత్రి పన్నెండయినా పట్టించుకునేవాళ్లం కాదు.'అర్ధరేత్రయింది పండుకోండిరా...'అంటూ తాత అరుస్తూనే ఉండేవాడు. లెక్కజేస్తే కదా! ఇవి కాకుండా పగలు జింకల్ని సాకడం, గులేరుతో పిట్టల్ని కొట్టడం...బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. బాల్యాన్ని నేను ఎంజాయ్ చేసినదానిలో నా బిడ్డలు పదోవంతు కూడా ఎంజాయ్ చేయలేదు. అది నా గొప్పతనం కాదు. ఊరి వాతావరణంలో పొందే గొప్ప అనుభవం. ఆ రోజుల్లోని తిండి, నీరు, పొల్యూషన్ లేని గాలి...ఇప్పుడు వేలకోట్లు పెట్టినా దొరకవు.


కళకళలాడే కళ్లాపి రోడ్లు...
అప్పట్లో మెయిన్‌రోడ్లన్నీ కంకరరోడ్లే. మా చుట్టుపక్కల ఊర్ల సంగతి నాకు తెల్వదు గాని మా ఊరు మాత్రం అద్దంలా ఉండేది. రోడ్డుపైన చెత్త అనేది ఉండేది కాదు. ఇళ్లని చూసి కాదు వాకిల్ని చూసి ఆ ఇంటికథేందో చెప్పొచ్చు. కరెంటు, మంచినీరు, మరుగుదొడ్లు...వీటి గురించి ఎవ్వరికీ ఎరికలేదు. స్కూలు విషయానికొస్తే ఒకే ఒక్క చిన్నగదిలో ప్రైవేటు పాఠశాల ఉండేది. ఒకే ఒక్క టీచరు ఉండేవారు. మూడవ తరగతి వరకూ ఉండేది.


నాకు ఐదేళ్లు రాగానే నాన్న అక్కడ చేర్పించిండు. మా అత్త చెప్పేది. నేను చిన్నప్పుడు బాగా శ్రద్ధగా చదువుకునేవాడ్నంట. అక్కడ స్కూలు అయిపోయాక చల్లకుర్తికి పంపారు. అక్కడ పాపిరెడ్డి అనే టీచర్ ఇంట్లో ఉండి చదువుకునేవాడ్ని. ఎనిమిదో తరగతి పూర్తయ్యాక మిర్యాలయాలగుడాకి వెళ్లాను. హెచ్ఎస్‌సి పూర్తిచేశాక నాగార్జున సాగర్ కాలేజ్‌లో పియుసి చదివి టీచరయ్యి ఊరికి తిరిగొచ్చాను.


టీచర్ జానారెడ్డి...
అప్పటివరకూ ఊళ్లో సరదాగా ఆడుతూపాడుతూ తిరిగిన కుర్రాడు టీచర్ అయ్యాడని ఊరంతా సంతోషించింది. నేను టీచర్ అయ్యేసరకి ఊళ్లో స్కూల్లో ఐదో తరగతి వరకూ ఉంది. అన్ని సబ్జెక్‌లు చెప్పేవాడ్ని. పాతికేళ్లవయసులోనే 200మంది ఉపాధ్యాయులున్న సంఘానికి అధ్యక్షుడ్ని అయ్యాను. ఊళ్లో యూత్ అసోసియేషన్ పెట్టాను. నేనే నాయకుడ్ని. అందరి దగ్గరా చందాలు వసూలుచేసి రామాలయం కట్టించాను. నాలుగేళ్ల తర్వాత టీచర్ ఉద్యోగాన్ని వదిలేశాను.


రాజకీయాల్లోకి వచ్చాను. 1979లో ఊరికి కరెంటు స్తంభాలు వేయించాను. సిమెంటు రోడ్లు కూడా. ఊళ్లో ఉండగానే ఎమ్ఎల్ఎ అయ్యాను. మంత్రిగా కూడా పనిచేశాను. ఆ సమయంలోనే నలభైఎకరాల ప్రభుత్వ స్థలంలో ఊళ్లోని పేదలందరికీ ఇళ్లు కట్టించాను. పాత ఊరు పక్కనే కొత్త ఊరు వెలసింది. పంచాయితీ అయింది. నేను మంత్రిగా ఉన్న సమయంలోనే అంటే 1985లో మండలాల ఏర్పాటు జరిగింది. మా ఊరు మండల కేంద్రం అయింది. ఊరు రూపురేఖలన్నీ మారిపోయాయి. రాజకీయాల్లో పెద్ద పదవులు వచ్చాక హైదరాబాద్‌కి వచ్చేశాను. నేను రాజకీయాల్లోకి రాకముందు మా ఊరికి 250 ఎకరాల ఆయకట్టు ఉండేది. దాన్ని నేను 2800 ఎకరాలకు తీసుకొచ్చాను. ఒక పక్క నాగార్జునసాగర్ కెనాల్, శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్, మరో పక్క కృష్ణ మంచినీరుతో ఊరంతా సస్యశ్యామలమైంది.


కుంట భూమిలేకపోయినా...
మండల కేంద్రం అయింది కాబట్టి ఇప్పుడు మా ఊళ్లో పదివేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదారు ప్రైవేటు కాలేజీలున్నాయి. ఐటి కాలేజ్, 30 పడకల ఆసుపత్రి, ఆలియా జంక్షన్ మార్కెట్‌యార్డ్, వ్యవసాయ రైతుల అభివృద్ధి కమిటీ హాలు...ఇలా అన్నీ వచ్చేశాయి. అయినా ప్రత్యేకంగా నా ఊరికి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మరో విచిత్రమైన విషయం ఏంటంటే నాన్న ఇచ్చిన నలభై ఎకరాల పొలంలో ఇప్పుడు నాకు కుంట భూమి కూడా మిగల్లేదు. చాలా వరకూ కొత్త ఊరు నిర్మాణమపుడు విరాళంగా ఇచ్చాను. మిగతాది అమ్మేశాను. ఇప్పుడు ఊళ్లో నాకు ఏమీ లేదు.


బంధువులు కూడా లేరు. అయినా ఊళ్లో ప్రజలందరూ నావాళ్లే. నా తర్వాత ఊరిని ఎవరు చూసుకుంటారు? దానికోసం ఒక ప్లాన్ వేశాను. అక్కడ రోడ్డుపక్కనే ఓ నాలుగైదు షాపులు కొందామనుకుంటున్నాను. వాటిపైన వచ్చే కిరాయితో ఊళ్లోని పేదల్ని, ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాలనేది నా ఆలోచన. ఆ డబ్బు ఎప్పటికీ ఊరి ప్రజలకే ఉంటుంది. ఈ విషయం గురించి మా అబ్బాయిలతో కూడా మాట్లాడాను. 'నేను పోయాక నా ఊరితో సంబంధాలు మీరు కొనసాగించాలి. ఎందుకంటే నా మూలం అదే కాబట్టి. నా ఊరి ప్రజలు కోరినంత కాకపోయినా...మీకు తోచినంత సాయం చేస్తూ, మేమున్నామనే ధైర్యం ఇవ్వండి చాలు, అదే నేను మిమ్మల్ని కోరే కోరిక' అని చెప్పాను. నన్నింతవాణ్ని చేసినందుకు అనుముల గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ం భువనేశ్వరి ఫొటోలు: రఫీ, భిక్షంరూథర్


వెన్నెల రాత్రులొచ్చాయంటే మా ఇంటిముందు ఓ ఇరవైమంది పిల్లగాళ్లు చేరేవారు. కబడ్డీ ఆటలు ఆడేవాళ్లం. చూడ్డానికి పెద్దోళ్లందరూ వచ్చేవాళ్లు. వాళ్లే ఆడియన్స్ అన్నమాట.


మా ఊళ్లో మట్టి రోడ్లయినా సిమెంటురోడ్డుకంటే బాగుండేవి. సీక్రెట్ ఏం లేదు...సూర్యుడి రాకముందే మా ఊరు ఆడోళ్లు చిక్కగ కళ్లాపి కొట్టి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవారు.


భోజనం విషయానికొస్తే జొన్నన్నం, కొర్రన్నం, మటన్ కూర, మీగడ పెరుగుతో నాన్న దగ్గరుండి పెట్టేవాడు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు. జానా...అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకునేవాడు నన్ను.


నాన్న పోయాక ఊళ్లో నాకు బంధువులెవరూ లేరు. నాకు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆ ఊరు నాదే కదా. అందువల్ల నేనున్నంతవరకూ నా ఊరి ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలను.

Sunday, December 4, 2011

ఊరు మరచినా...నేను మరవలేదు * నటసామ్రాట్ అక్కినేని 'మా ఊరు'

నీడనెప్పుడైనా చూశారా? వెన్నంటే ఉంటుంది.
ఊరూ అలాంటిదే. మన మూలం.
ఎంత దూరం వెళ్లినా మనతోనే ఉంటుంది. పలకరిస్తూనే ఉంటుంది.
అమ్మ, నాన్న, ఊరు- మనం మార్చుకోలేనిది ఈ మూడింటినే.
సొంత ఊరిలో గాలి, నీరు, చెట్లు, పుట్టలు, స్నేహితులు, బంధువులు...అన్నీ ప్రత్యేకమే.
ఊరి స్మృతులు చెబుతుంటే మొహం వెలిగిపోతుంది. గుండె కదిలిపోతుంది. ఒళ్లు పులకరిస్తుంది. మనసు పరవశిస్తుంది.
ఆ మట్టి వాసనను పరిమళింపచేసేదే ఈ నటసామ్రాట్ అక్కినేని ఊరి కబుర్లే   'మా ఊరు'.


ఇది పదిహేనేళ్ల కిందటి జ్ఞాపకం. అప్పట్లో జన్మభూమి కార్యక్రమం జోరుగా సాగుతోంది. నేను కూడా మా ఊరికి తోచినంత సాయం చేద్దామని.. ఫ్యామిలీని వెంటబెట్టుకుని మా ఊరెళ్లా. అక్కడున్న వాళ్లంతా నన్ను చూసి 'అక్కినేని గారొచ్చారు! అక్కినేని గారొచ్చారు..' అంటూ బిలబిలా చుట్టుముట్టారు. వాళ్ల అభిమానాన్ని తప్పించుకుంటూ.. ఊరంతా ఒక రౌండ్ చుట్టేశాను. "ఈ ఊర్లో మీ ఇల్లేదీ?'' అని ఎంతో ఆసక్తిగా అడిగారు నా వెంట వచ్చిన కూతుళ్లు, కోడలు.

ఎప్పుడో ఊరు విడిచిన నేను నా ఇల్లు ఎక్కడని చూపించను..? బాగా గుర్తు చేసుకుని ఓ ఇంటిని చూపిస్తూ "అదిగో అదే నా చిన్నప్పటి ఇల్లు'' అన్నాను. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. "అక్కినేని గారూ ఇది మీ ఇల్లా? మా నాన్న నలభై ఏళ్లకిందట ఎప్పుడో దీన్ని కొన్నాడు'' అని చెప్పాడు ఆ ఇంటి ప్రస్తుత యజమాని.

ఎవరైనా నన్ను సొంతూరి మనిషిగా గుర్తుపట్టి పట్టెడన్నం పెడతారేమోనని నా మనసు చాలా ఎదురుచూసింది. చివరికి ఒక అభిమాని ఇంట్లో భోజనం చేశాం. అతను కూడా మా ఊరివాడే. అప్పుడు మా పిల్లలు ఒక మాటన్నారు.. "నాన్నా... ఈ ఊళ్లో నీకు కనీసం ఎకరం పొలమైనా ఉంటే ఈ ఊరోళ్లందరికీ నువ్వు తమవాడివని తెలిసేది. కనీసం ఇల్లయినా ఉంటే బాగుండేది'' అని అన్నారు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. ఓ చెట్టు దగ్గర నిలబడి...కాలువ గట్టువైపు చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను.

అక్కడ చిన్నపాకలో అక్షరాలు దిద్దుకున్న జ్ఞాపకాలు, మొదటిసారి నాటకం వేసిన అపురూప దృశ్యాలు కళ్లకు కనిపించాయి. పిల్లలు చెప్పిన మాట నిజమేననిపించింది. ఒక ఇల్లు ఉంటే అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉండేది. వచ్చినపుడల్లా ఎంచక్కా ఊరంతా తిరిగి చిన్ననాటి స్మృతుల్ని గుర్తుచేసుకునేవాడ్ని... అని మనసులో అనుకున్నాను. కాని పిల్లలకి నేను చెప్పిన సమాధానం వేరు. "సొంత ఊళ్లో పదెకరాల పొలం, ఓ పెద్ద ఇల్లు ఉంటేనే ఊరి మీద అభిమానం, అనుబంధం ఉన్నట్టు కాదర్రా. ఒకవేళ అలా ఉండి ఊరికి ఏమైనా సాయం చేస్తే..."ఎవడి కోసం చేస్తున్నాడు...వాడి ఆస్తులు కూడా ఉన్నాయి కదా...'' అని అనేవారు కూడా ఉంటారు'' అని సర్ది చెప్పాను


**** చెట్లు...పుట్టలు...
నేను రేపో మాపో పుడతాననగా మా అమ్మ పున్నమ్మకి నాగుపాము కల్లోకి వచ్చింది. దాంతో నాకు నాగేశ్వరరావు అని పేరు పెట్టింది. నాగులచవితి నాడు పుట్టలో పాలు పోయడానికి అమ్మ చేయి పట్టుకుని ఊర్లో ఉన్న పుట్టలు, చెట్టులు తిరగడంతో మొదలైంది నా బాల్యం. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాకి ఉత్తరాన 9 మైళ్ల దూరంలో ఉన్న వెంకట రాఘవాపురం నా జన్మస్థలం. చిన్న ఊరు. మహా అయితే యాభై ఇళ్లు ఉంటాయేమో. పాతికెకరాల అసామి మా తండ్రి వెంకటరత్నం. ఐదుగురు కొడుకుల్లో నేను ఆఖరివాడ్ని. అతి సామాన్యరైతు కుటుంబం. మాదే కాదు...మా ఊర్లోని అందరూ సామాన్యులే. నాలుగు నిట్రాళ్ల మా ఇల్లే ఊర్లోని అందరి ఇళ్లలోకి పెద్దది. మా ఇంట్లో ఐదు గదులుండేవి.

పాకలో...పాఠశాల

చెరువుగట్టున ఒక చిన్న పాక ఉండేది. అదే మా ఊరి పాఠశాల. రెండో తరగతి వరకూ ఉండేది. పగలు పాఠశాల. సాయంత్రం పేకాటశాల. రాత్రయితే గోశాల. మా ఊళ్లోనే కాదు అప్పట్లో అన్ని పల్లెటూళ్లలో అదే పరిస్థితి. ఆ రోజుల్లో అదే గొప్ప. నా నాల్గవ ఏటనే నాన్న చనిపోయారు. దాంతో అప్పటివరకూ కలిసి ఉన్న అన్నదమ్ములంతా విడిపోయారు. అంత పెద్ద ఇంట్లో అమ్మా..నేను మిగిలాం. ఇల్లు, మా వాటాకి వచ్చిన ఐదు ఎకరాల పొలం అమ్మేసి నన్ను పెద్ద చదువులు చదివిద్దామనుకుంది అమ్మ. మా ఊళ్లో రెండవ తరగతి వరకే ఉండడంతో పక్కనే ఉన్న పెదఊరిపాడు ఊళ్లోని స్కూల్లో చేర్పించింది.

రోజూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడ్ని. చదువుకుంటూనే అన్నల పొలాలకు వెళ్లి నారు కట్టలు మోయడం దగ్గర నుంచి వరి కట్టలు మోసేవరకూ అన్ని పనులూ చేసేవాణ్ని. అలాగే ఇంట్లో అమ్మకి కూరలు తేవడం కూడ.అన్నట్టు కూరలంటే గుర్తు వచ్చింది. నాకు ఒక సైకిల్ ఉండేది. కూరలు, సరుకులు ఏం కావాలన్నా..పక్కఊరికి వెళ్లాలి. ఆరేడేళ్ల వయసులో ఆ సైకిల్ తొక్కడానికి చాలా పాట్లు పడేవాణ్ని. అందీ అందని కాళ్లతో ఉడతకొట్టుడు కొడుతూ పక్కఊరికి వెళ్లి ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేవాడ్ని. ఒకరోజు మా ఊరి పాఠాశాలలో ఏవో నాటకాలు వేస్తున్నారంటే చూడ్డానికి వెళ్లాను. వెళ్లి ఊరుకోలేదు. నేను వేషం వేస్తానని రెడీ అయ్యాను. చంద్రమతి వేషం ఇచ్చారు. చీర కట్టి నా నోటికొచ్చిన గాలిపాటలు పాడాను. నాటక బృందం వారు శభాష్ అని మెచ్చుకుని అర్ధ్థరూపాయి చేతిలో పెట్టి పంపించారు.

పాఠశాలలో నాటకం..
నాటకం ముగిసాక నేరుగా ఇంటికెళ్లి అమ్మకి చేతిలోని అర్ధరూపాయిని చూపించాను. అమ్మ అర్ధరూపాయని చూడలేదు. నా మొహంలోని సంతోషాన్ని చూసింది. నా నటన గురించి ఊరి జనం చెప్పిన కబుర్లన్నీ విన్నది. 'మన వంశంలో ఎవరూ చదువుకోలేదు. చిన్నాడినైనా పెద్ద చదువు చదివిద్దామనుకున్నాను. వాడికి కూడా అబ్బేట్టు లేదు. వాడిలో నాకు మంచి నటుడు ఉన్నాడనిపిస్తోంది. పోనీ ఆ రంగంలోనైనా వాడ్ని ముందుకు పంపుదామనుకుంటున్నార్రా' అని అన్నయ్యల దగ్గర చెప్పింది. వాళ్లూ సరేనన్నారు. కుదరవల్లి గ్రామంలో 'కనకతార' నాటకం వేస్తున్నారని తెలిసింది. అందులో తార వేషం వేయమని పిలుపొచ్చింది. మరో అర్ధరూపాయి చేతిలో పడింది. అలా...మా ఊరి పాఠశాల్లో వేసిన నాటకమే నాకు బతుకుతెరువు చూపించింది.

రాజకీయాలు...

యాభై గడపలే కదా...అని మా ఊరిని తక్కువ అంచనా వెయ్యకండి. ఆ చిన్న ఊళ్లోనే పెద్ద పెద్ద రాజకీయాలు. ఎప్పుడూ రెండు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉండేది. ఈ కొట్లాటలు జరుగుతున్నప్పుడు మా అన్నలకు కర్రలు గటా అందించేవాడ్ని. ఏడాదిలో పంటల కాలం పోగా మిగతా కాలమంతా అందరూ ఖాళీగా ఉండేవాళ్లు. ఏ చెట్టుకింద చూసినా పేకాట రాయుళ్లే. పెద్దన్నయ్యకి గుడివాడతో బాగా పరిచయం. అక్కడ నాటకాలవారిని పరిచయం చేసుకుని నన్ను అక్కడికి కూడా పంపేవాడు. అక్కడ వేషాలు ఎక్కువగా రావడంతో అమ్మని తీసుకుని గుడివాడకి వెళ్లిపోయాను. ఘంటశాల బలరామయ్యగారి కంట్లో పడేవరకూ బోలెడు నాటకాల్లో వేషాలు వేశాను. ఆయన పరిచయంతో నా మకాం మద్రాసుకి మారింది. నా జీవితంలో బోలెడు మార్పులు జరిగిపోయాయి. కాని దశాబ్దాలు గడచినా...నా ఊళ్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

కళాశాల నిర్మాణం...

నా చదువు నాలుగో తరగతితో ఆగిపోయింది. అయినా మా కుటుంబంలో నా చదువే పెద్ద చదువు. అమ్మా...నాన్న, నలుగురు అన్నయ్యల్లో ఎవరికీ సంతకం చెయ్యడం రాదు. నాకు మాత్రమే చదవడం, సంతకం చెయ్యడం వచ్చు. మా వాళ్లకి చదువుల తల్లి అల్లంత దూరంలో ఉండేది. సినిమాల్లోకి వెళ్లాక నాలుగు రూపాయలు సంపాదించాక నేను చేసిన మొదటి పని గుడివాడలో కళాశాల కట్టించడం. బాగా చదువుకున్నవాడి కంటే చదువుకోలేని వాడికే చదువు విలువ బాగా తెలుస్తుంది. దానికి నేనే నిదర్శనం. అందుకే ఎఎన్ఆర్ పిజి కాలేజి నిర్మాణానికి పూనుకున్నాను. అమ్మ చాలా సంతోషించింది. గుడివాడ ప్రజలు అంతకన్నా ఎక్కువ సంతోషపడ్డారు.

ఊరిని వదిలి...

నాటకాల పేరుతో నేను గుడివాడకి మకాం మార్చాక అన్నయ్యలు కూడా ఊళ్లోని భూములు అమ్ముకుని వేరే ఊళ్లకి వెళ్లిపోయారు. సొంత ఊళ్లో మాకంటూ సెంటు భూమి కూడా మిగల్లేదు. అమ్మకి ఊరి అభిమానం చాలా ఎక్కువ. ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉండేది. నేను మాటల్లో తలుచుకోవడమే కాని ఎప్పుడూ వెళ్లలేదు. ఇల్లు, పొలం లేకపోవడం ఒక్కటే కారణం కాదు ఆ ఊళ్లో ఒక్క బంధువు కూడా మిగల్లేదు మాకు. అందరూ వలసలు పోయారు. సినిమా రంగంలో నేను రోజురోజుకీ ఎదుగుతున్నాను.

డబ్బు సంపాదించుకుంటున్నాను...అంతా బాగానే ఉంది. వీధి దీపం తెలియని రోడ్లు, మరుగుదొడ్లు ఎరుగని మహిళలు, మంచినీరులేని నూతులు...ఇవే నా ఊరి జ్ఞాపకాలు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో నాకున్న పరిచయంతో ఒకసారి వెళ్లి కలిసాను. ' నా సొంత ఊరిలో నాకు ఏమి లేకపోయినా బాధ కలిగించే జ్ఞాపకాలు మిగిలిపోయాయి. నా ఊళ్లో ఇప్పటికీ కరెంటు లేదు. ఊరికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కరెంటు స్తంభాలు వచ్చాయని తెలిసింది. అక్కడి నుంచి నాలుగు కరెంటు వైర్లు మా ఊరికి కూడా లాగించండని' అడిగాను. ఓ నాలుగైదు సార్లు వెంటపడితే పనైంది. ఊళ్లో కరెంటు బల్బులు వెలిగాయని తెలిసాక చాలా సంతోషమనిపించింది.

గుర్తుపట్టలేదు...

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకరోజు ఆయన జూబ్లిహాల్లో ఒక మీటింగ్ పెట్టారు. నన్ను కూడా పిలిచారు. జన్మభూమిలో భాగంగా పల్లెటూళ్లని అభివృద్ధి పరుచుకునే పథకం గురించి చెప్పారు. ముందుగా నేనే స్పందించాను. అరవైశాతం ప్రభుత్వం పెట్టుకుంటే, నలభైశాతం ఊరి ప్రజలు భరించాలని, మంచినీరు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ముందుగా మా ఊళ్లోని వాళ్లతో మాట్లాడడానికి చంద్రబాబుతో కలిసి హెలికాఫ్టర్‌లో వెళ్లాను.

'మన ఊరు చూడ్డానికి అక్కినేని నాగేశ్వరరావు వస్తున్నారంటూ' ఊళ్లో హోరెత్తిపోయిందట. 'బాబు..ఇది మీ ఊరు మాత్రమే కాదు...నాది కూడా ఇదే ఊర'ని ప్రతిఒక్కరికి నోరు తెరిచి చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ ఊళ్లో నా వయసువారంతా అప్పటికే చనిపోయారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకోడానికి ఎవరూ లేరు. తర్వాత తరాలవారికి నేను నటుడిగానే తెలుసు కాని ఊరి మనిషిగా పరిచయం లేదు. ఊరి అభివృద్ధి గురించి ఊరి పెద్దల్ని కలిసి మాట్లాడితే ఊళ్లోని మునుసుబుగారి అబ్బాయి ముందుకు వచ్చాడు. తనకు తోచింది తాను చేశాడు. మిగతా డబ్బంతా నేను పెట్టాను. వెంకట రాఘవాపురానికి కరెంటు, ఇంటింటికీ మంచినీళ్ల పైపులు, రోడ్లు, సానిటరీ...అన్ని సదుపాయాలు వచ్చాయి. దశాబ్దాలుగా నా గుండెల్లో ఉండిపోయిన దిగులంతా పోయింది.

వంతెన నిర్మాణం..

గుడివాడ నుంచి ఏలూరుకి వెళ్లాలంటే బుడమేరు వాగు చుట్టూ తిరిగి వెళ్లాలి. అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. లేదంటే రెండు కిలోమీటర్లు కాలువపైన పడవలు, బల్లకట్ల మీద వెళ్లాలి. జన్మభూమి కార్యక్రమం సమయంలోనే ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. బ్రిడ్జి కట్టించకపోతే కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నాను. ప్రభుత్వం ఒప్పుకుని రెండు కిలోమీటర్ల వంతెన నిర్మాణం పూర్తి చేసింది. గుడివాడ నుంచి ఏలూరికి నేరుగా వంతెన వచ్చేసింది. ప్రయాణం సులువైంది. రైతుల భూముల రేట్లు కూడా పెరిగాయి. ఆ వంతెనకు అక్కినేని వారధి అని పేరు పెట్టారు.

మా ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మూడేళ్లక్రితం కుదరవల్లి దగ్గర అక్కినేని కళాకేంద్రం నిర్మించాము. మా పక్కఊరికి చెందిన డాక్టర్ ఎఎస్ నారాయణ ఈ కళాకేంద్రంలో బుక్‌బైండింగ్ వర్క్ పెట్టించాడు. పని కావాల్సినవారు అక్కడికి వచ్చి నేర్చుకుని పని చేసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల ప్రైవేటు స్కూళ్లకి మా కళాకేంద్రం నుంచే నోటు పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. మొన్నామధ్య నా ఫొటోతో కొన్ని పుస్తకాలు ముద్రించారు. నేను రెండు వేల పుస్తకాలు కొనుక్కుని నా పుట్టినరోజునాడు నా అభిమానులకు బహుకరించాను. పుట్టిన ఊళ్లో సెంటు భూమి లేకపోయినా ఊరి గురించి ఆలోచించడం మానలేకపోతున్నాను. కన్నతల్లిని ఎలా మరువలేమో పుట్టిన ఊరిని కూడా అలాగే మరవలేము.

ప్రస్తుతం మా ఊరికి సంబంధించి ఒక ముఖ్యమైన పని చేసే ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మా ఊరికి ఉత్తరం రాస్తే అడ్రస్‌లో కుదరవల్లి శివారు అని రాయాలి. అలా కాకుండా వెంకట రాఘవాపురాన్ని ఒక పంచాయితి చేస్తే బాగుంటుందని నా కోరిక. దానికోసం మంత్రిగారిని కలవాలనుకుంటున్నాను. ఈ ఒక్క పనీ పూర్తయితే నా సొంతూరి రుణం ఎంతోకొంత తీర్చుకున్న తృప్తి మిలుగుతుంది.

ఆ చుట్టుపక్కల ప్రైవేటు స్కూళ్లకి మా కళాకేంద్రం నుంచే నోటు పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. మొన్నామధ్య నా ఫొటోతో కొన్ని పుస్తకాలు ముద్రించారు. నేను రెండు వేల పుస్తకాలు కొనుక్కుని నా పుట్టినరోజునాడు నా అభిమానులకు బహుకరించాను.

Sunday, November 20, 2011

సువాసనల కాక్‌టెయిల్ - బీనాదేవి

http://www.eemaata.com/images/jan2010/SSusa.jpg
నూరేళ్ళ తెలుగు కథ
నూరేళ్ళంటే వయసైపోయింది
దానికి మళ్ళీ యవ్వనం తేవాలి
"60లో 20 ఎలా తేగలవు ఖదీరూ'' అన్నారు శ్రీశ్రీ

"జమానా బదల్ గయా సాబ్. ఇప్పుడు మేక్-అప్‌లో, ఫేస్-లిప్ట్‌లు, బ్యూటీ పార్లర్‌లు ఒకటేమిటి? 60లో 20 సునాయాసంగా తెప్పిస్తున్నారు. మనిషికి తెప్పించగా లేనిది కథకి తేలేనా ? నేనున్నా - నేనున్నానన్నారు'' ఖదీర్. ఇదొక యజ్ఞం
ఖదీర్ ఋష్విక్

నూరుమంది ప్రసిద్ధ కథకుల్ని ఏరాలి
వాళ్ళు రాసిన వాటిలో ఓ మంచి కథ ఏరాలి
అది చదివి, అర్ధం చేసుకోవాలి
విమర్శకాదు. విశ్లేషణా కాదు.
మరి?
అదే కథని అందరిచేత చదివించేలా తిప్పి రాయాలి.
ఖదీర్ ప్రతి రచయితలోనూ పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ బుర్రలో దూరిపోయి, "నీకంటే బాగా రాస్తాను చూడు'' అన్నారు.
రాశారు. ఎలా ఉన్నాయి?
ముళ్ళపూడి రాసిన "వెలుగు నీడలు'' సినిమా నవల చదివిన కాట్రగడ్డ నర్సయ్య గారు "ఇడ్లీ కంటే పచ్చడి బావుంది'' అన్నారు.
నాకు ఈ కథలన్నీ చదివాక అలాగే అనిపించింది.
అసలు కథని నామమాత్రంగా తీసుకొని దానికి చక్కటి ఆకారం, అలంకారాలు ఇచ్చి ముస్తాబు చేసి (మనీష్ మల్‌హోత్రాలా కథకి ఫ్యాషన్ డిజైనింగు చేసి) పాఠకుడి గుండెలోకి గురిచూసి వదిలారు. "తాంబూలాలు ఇచ్చేశారు. తన్నుకు చావండి'' అన్నట్టు " రాసి పారేసాను. చదివి చావండి'' అన్నారు.
పాఠకులు చదివారు
కాని చావలేదు.
"శభాష్'' అన్నారు
ఎవరో ఎందుకూ? నేనే అనుకున్నాను.
నా కథ "జలుబు చేసిందా?''ని ఎంత బాగా రాశారంటే "ఇంత బాగా రాయొచ్చా?'' అనిపించింది. ఓ వారం రోజులు కథ గురించి నిరంతర ఫోను స్రవంతి. "అది నేను రాయలేదు మొర్రో. అది ఖదీర్ రాశారు'' అని మొత్తుకున్నాను. పైగా టైటిల్ కూడా అతి రసవత్తరంగా "అసలే మొగుడు ఆపై జలుబు చేశాడు'' అని పెట్టారు.
నా పీత బుర్రకెందుకు తట్టలేదూ?
అసలు గమ్మత్తు
ఆ రచయిత కథ రాశాడే తప్ప ఖదీర్ అందులోంచి పీకిన భావాలు అతనికి లేకపోవచ్చు.
ఒప్పుకుంటారా ఖదీర్ గారూ!
ప్రతి కథ చివర చక్కటి కొసమెరుపు.
సమాజాన్ని ప్రశ్నించడం
పాఠకుడ్ని ఆలోచించమనడం
దీనికో చిన్న ఉదా : "ముత్యాల ముగ్గు'' సినిమాలో - కాలువలో లాంచీలో శ్రీధర్ వెళ్తున్నాడు. గట్టుమీద సంగీత చెట్లు కింద కూర్చుంది. పెద్ద అరటి బోదె పాపం దాని మానాన అది లాంచీ వెనక పోతోంది. కాని అది 'సంగీత జీవితం' అని ప్రేక్షకులు, పత్రికలు పొగిడాయి.
"నేనే పాపం ఎరగను బాబోయ్. అది డి.పి (దర్శకుడి ప్రతిభ) కాదు'' అన్నారు బాపు.
అలాగే రచయితకి రాని ఆలోచనలు, ప్రశ్నలు ఖదీర్‌గారికి వచ్చాయి.
వాటినే కథ చివర కొసమెరుపుల్లా వాడుకున్నారు.
"పంచ భూతాలను గుప్పిట బిగిద్దామని ప్రయత్నించిన వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. భూమిని జయిద్దామనుకున్న వాళ్ళ గతీ అంతే. భూమి ఇప్పుడు భరిస్తోంది. ఏదో ఒకనాడు ఒక్క క్షణం పాటు ఒళ్ళు విరుచుకుంటుంది. అప్పుడు మిగిలేది మరుభూమి. మన టూ బెడ్ రూమ్ ఫ్లాట్ విత్ హాల్ అండ్ కిచెన్ అదే'', అని శపిస్తారు ఖదీర్ "మురళి ఊదే పాపడు'' అన్న కథ చివర.
ఖదీర్ గారూ మీకు గుర్తుందా?
టాల్‌స్టాయ్ కూడా ఇలానే అన్నాడు.
"మనిషిక్కావల్సింది ఆరడుగుల నేల''
"దేవుడు మనిషికి రెండు చేతులిచ్చాడు బాగుపడమని. మనిషి ఆ రెండు చేతుల్తోనూ చెయ్యగలిగినంత విధ్వంసం చేశాడు.
యుగాంతానికి వేరే శకునాలక్కర్లేదు.
పిచ్చిక మాయమవడమే అతి పెద్ద దుశ్శకునం.
మనిషికి మూడింది.
ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకా మూడుతుంది
మూడాలి''
అంటారు ఆగెరి పిచ్చుక కథ చివర్న.
కొన్ని కథలు ఖదీర్‌లో ఆవేశం రేపాయి. ఈ సమాజాన్ని, అందుల్లో ఉన్న స్వార్ధపరుల్నీ దుయ్యబట్టారు. చేటతో గాకుండా మాటలతో చేరిగేసారు.
మరికొన్ని కథలు చదివి ఆలోచించమన్నారు.
"గొప్పవాళ్ళు ఒక్క రాత్రి మందు పార్టీలో పెట్టే ఖర్చుతో వంద మంది ముసలోళ్ళు చచ్చేదాకా బతకొచ్చు. వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎందుకున్నట్టు? వాళ్ళవి ఇంత చిల్లర బతుకులు ఎందుకైనట్టు?'' అని మనల్ని నిలదీసి అడుగుతారు. ఖదీరు గారూ! మీరు చదవలేదేమో. కుక్క "రోషనారాకి'' పెళ్ళి చేశాడు. ఆ పెళ్ళికి వైశ్రాయితో సహా అందరు రాజుల్ని ఆహ్వానించాడు. ఆ రోజుల్లో 60,000 పౌన్లు ఖర్చు అయిందిట. ఆ డబ్బుతో 12,000 మంది ఓ సంవత్సరం బతకొచ్చుట. దీన్నేమంటారు?
ఒళ్ళు బలుపు, డబ్బు పొగరు.
ముళ్ళపూడి భాషలో "కోటీశ్వరులు, కోటి చమత్కారాలు''.
ఖదీర్ గారిలో ఆవేశం, అసహనం కాకుండా నాకు మరో కోణం కూడా కనిపించింది.
ఏమిటది?
ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం, జాలి, సానుభూతి.
"కువైట్ సావిత్రమ్మ'' కథకు ఆయన ముక్తాయింపు ఎంత అద్భుతంగా ఉంది!
'స్త్రీ దేహం ఈ దేశానికి ఆదిమ పెట్టుబడి. ఐటమ్ సాంగ్‌ని చేసి ఆడిస్తున్నారు. బారుసీసా బ్రాండు కోసం అర్ధనగ్నంగా నిలబెడుతున్నారు. స్త్రీ మగాడి చేతిలో సిద్ధంగా ఉండే అగ్గిపుల్ల''.
" ఈ అగ్గిపుల్లే ఎప్పుడో అప్పుడు వాడ్ని
దావాగ్నిలా దహించేస్తుంది'' నా ముక్తాయింపు.
"మనం ఈ మధ్యనే జరిగినట్టు ఇలాంటి కథనే చదివినట్టులేదూ?'' అంటారు ఖదీర్, మల్లాది వారు రాసిన "సర్వమంగళ'' కథ చివర. "అంతేకాదు'' రెండు వక్షోజాలు, ఒక గర్భాశయం ఉన్నంత కాలం ఆడది అవస్త పడుతూనే ఉండాలా? మగాడు అవస్త పెడుతూనే ఉండాలా?'' అని బాధపడతారు. ఇలా రాస్తూపోతే మరో సంకలనం అవుతుంది.
ఖదీర్ కలానికి అన్నివైపులా పదునే.
సంపెంగ, సన్నజాజి, మల్లె, మాలతి, మరువం, దవనం, గులాబి - ఈ పువ్వులన్నిటికీ సువాసన ఉంటుంది.
అన్నీ కలిపి ఒకే మాలగా గుచ్చితే
అది సువాసనల కాక్‌టెయిల్
అదే ఈ నూరేళ్ళ కథ.
అంతేనా ఖదీర్ సాబ్!

- బీనాదేవి

Sunday, August 28, 2011

తెలుగువారంతా మా వాడని గర్వంగా చెప్పుకోగల ప్రతిభావంతుడు...కళాత్మక ఫోటోగ్రాఫర్...ద గ్రేట్ బండి రాజన్‌బాబు.

ఆయన ఫోటోలు మాట్లాడతాయ్

ఆయనెక్కువ మాట్లాడరు. ఆయన ఫోటోలు మాట్లాడతాయి. ఆయన చేతిలో కెమెరా ఒక పరికరమే కాదు...కళాఖండాన్ని తీర్చిదిద్దే 'కుంచె' కూడా. ఫోటోలతో తన భావాలను సృజనాత్మకంగా మాట్లాడించి, తన కళా దృష్టిని శాశ్వతంగా మనకు మిగిల్చి...నిశ్శబ్ద ముద్రతో ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు... తెలుగువారంతా మా వాడని గర్వంగా చెప్పుకోగల ప్రతిభావంతుడు...కళాత్మక ఫోటోగ్రాఫర్...ద గ్రేట్ బండి రాజన్‌బాబు. ఆయన అంతిమ యాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమాన ఫోటోగ్రాఫర్ల నోట ఒకే మాట వినిపించింది. "మనకు మరో రాజన్‌బాబు దొరకరు'' అని అవును, మరో రాజన్‌బాబు పుట్టక పోవచ్చు... ఎందుకంటే ఆయన ఫోటో తీస్తే అది 'కళారాజం' అవ్వాల్సిందే. కెమెరా పట్టుకోకముందే రంగులతో బొమ్మలద్దే సృజనకారుడాయన. ఆ తృష్ణతోనే, ఆయనతో చదివిన మిత్రులూ, తమ్ముడూ మెడిసిన్‌లో చేరితో తాను మాత్రం జెఎన్‌టీయూ ఆర్ట్స్ కళాశాలలో చేరి ఓ చేత్తో కుంచెనీ, మరో చేత్తో కెమెరానీ పట్టుకున్నారు.

లైట్‌తో ఆడుకున్నారు

ఆయన దగ్గర పని నేర్చుకోవడమంటే కత్తి మీద సామే. మౌనంగా, చుట్టూ ఏం జరుగుతుందో గమనించనంత ఏకాగ్రతతో పనిచేసుకు పోతుంటారు. ఆయన కొద్ది మాటలతో చెప్పే మెళకువల కన్నా, పనిచేసే తీరులో నుంచి గ్రహించ గలిగితే బోలెడన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఫోటోలకు కుంచెనద్దవచ్చని ఆయన్ని చూసే తెలుసుకున్నాన్నేను. నాకూ ఆయనకీ గురుశిష్య సంబంధం కన్నా ఆత్మీయబంధమే ఎక్కువ.

ఫోటోగ్రఫీ మీదున్న అభిరుచితో నేను తీస్తున్న నేచర్ ఫోటోలు చూసి ఫొటో ప్రేమికులు 1990లో నన్ను ఆయనకు పరిచయం చేశారు. అది మొదలు కెమెరా భుజాన వేసుకొని ఆయన శిష్య బృందంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశాను. ఫోటోగ్రఫీలో లైటుని ఫర్‌ఫెక్ట్‌గా వాడుకోవడం కొందరికే అబ్బిన విద్య. అందులో ఆయన రారాజు. వాడుకొంటారనే కన్నా లైట్‌తో ఆడుకుంటారంటేనే బాగుంటుంది.
ఎన్నెన్నో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించడం ఆయనకే సొంతం. వర్క్‌షాప్‌లో ఒకే సబ్జెక్టుని ఫోటోగ్రాఫర్లు గుంపుగా వెళ్లి ఫోటోలు తీస్తుంటే ...అందరి దగ్గరా అదే ఫోటో కదా అని నేనో పక్కన నిలబడేదాన్ని. అది చూసి ' ప్రకృతిలో ఉండేది ఒకే సబ్జెక్టు. నీ దృష్టి కోణంలోనే మార్పు ఉండాలి. నువ్వేం చూస్తావ్, ఎలా చూస్తావ్ అనేది నీ సృజనాత్మక ఆలోచన, అభిరుచి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నా కళ్లు తెరిపించిన మహానుభావుడాయన.
http://www.thehindu.com/multimedia/dynamic/00765/25hykvw02-rajanbabu_765108e.jpg
ఒకే ఒక్కడు...

రాజా త్రయంబక్ రాజ్ గత తరంలో పేరొందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్. రాజన్‌బాబుకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. రాజా శిష్యుడినని చెప్పుకునేటపుడు కళ్లూ, మొహం కాంతివంతంగా వెలిగిపోవడం నేననేక సార్లు చూశాను.
రాజన్‌బాబు ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతితోపాటు సహజత్వానికి దగ్గరగా బతికే గిరిజనులంటే ఆయనకి ప్రాణం. ముఖ్యంగా అరకులోయ గిరిజనులతో ప్రత్యేక అనుబంధం. ఆ ఆత్మబంధువుల కోసం గత నలభై ఏళ్లుగా ఆ కొండలూ, లోయలూ ఎక్కి దిగుతూనే ఉన్నారు. అందమంతా ఆ గిరిపుత్రికల్లోనే ఉందని అనేకసార్లు చెప్తుండేవారు. 'అరకు' అంటే చాలు...ఏ అనారోగ్యమూ ఆయన్ని ఆపలేదు.
http://www.fullhyderabad.com/images//previews/mar08/arts_entt/events/photography_rajan_iccr.jpg
ఉత్సాహం ఉరకలేస్తుంది. అక్కడ వాళ్లకీ రాజన్ వచ్చారంటే చుట్టమొచ్చినంత సంబరం. నెలన్నర క్రితం 73వ ఏట కెమెరా తీసుకొని అరకు వెళ్లారంటే...అక్కడి గిరిజనులపై ఆయనకున్న ప్రేమని ఆర్థం చేసుకోవచ్చు. సహజత్వపు వేటలో భద్రాచలం అడవులూ, చత్తీస్‌గఢ్ కొండలూ, ఒడిస్సా గోండులూ ఆయన కెమెరా నుంచి తప్పించుకోలేదు.

నాగరికత పేరుతో గిరిజనులు సహజత్వం కోల్పోతున్నారని ఈ మధ్య కాలంలో ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ సహజత్వంలో తాదాత్మ్యం పొందడం కోసం లోపలి అడవుల్లోకి కెమెరాలతో ప్రయాణించిన సందర్భాలెన్నో. స్త్రీ శారీరక ఒంపులను ప్రకృతి అందాలలో భాగంగా చూపిస్తూ తనదైన టెక్నిక్‌తో అద్భుతమైన నగ్నచిత్రాలు తీశారాయన. ఆ ఫోటోలకు ముగ్ధులై ఇంగ్లాండ్‌లోని రాయల్ ఫొటోగ్రఫీ సోసైటీ 1987లో ఎఫ్ఆర్‌పీఎస్ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. రాష్ట్రంలో ఆ స్థాయి గౌరవాన్ని పొందిన ఫోటోగ్రాఫర్ అప్పటికీ, ఇప్పటికీ ఆయనొక్కరే.
http://profile.ak.fbcdn.net/hprofile-ak-snc4/186046_100002013714722_6421927_n.jpg
అయినా, ఆయనెప్పుడూ తనకు డాక్టరేట్ ఉందని చెప్పుకోలేదు. చిన్న పని చేసి పదింతలు ప్రచారం చేసుకునే ఈ రోజుల మనిషి కాడాయన. ఆయనదొక ప్రత్యేక వ్యక్తిత్వం. తోచింది చేసుకుపోవడమే తప్ప ప్రచారం కోసం వెంపర్లాడలేదు. తాను తీసిన నగ్నచిత్రాలను ఒక స్థాయి కలిగిన ఫోటోగ్రాఫర్లకి క్లాసులో ప్రదర్శించడానికి కూడా ఇబ్బందిగా ఫీలవుతుండే వారు. తన దృష్టి కోణంలో నుంచి గాక మరోలా అర్థం చేసికొంటారేమోననే జంకు ఆయన్నెప్పుడూ పీడిస్తూ ఉండేది. స్లైడ్ షో జరిగినపుడల్లా టెన్షన్‌గా ఉండేవారు. 'ఎవరి ఆలోచనా స్థాయిని బట్టి వాళ్లు మాట్లాడుతుంటారు. వాళ్ల కోసం మీరు మెట్టు దిగి ఆలోచించాల్సిన పని లేదని' అనే దాన్ని. 'సంస్కారాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సంస్కారం కావాలి' అనే కొడవటిగంటి మాటని గుర్తు చేసేదాన్ని.

జీవనసౌందర్యం

అద్భుతమైన ఫోటోలతో ఒక జాతి కాలాన్నీ, సంస్కృతినీ, భావోద్వేగాలనీ రికార్డు చేసినందుకూ, కళానైపుణ్యంతో ప్రకృతిలో స్త్రీ సౌందర్యాన్ని మమేకం చేసినందుకూ పద్మ, పద్మభూషణ్ పురస్కారాలు ఆయన్నెప్పుడో వరించి ఉండవలసింది. దేశదేశాలు ఆయన అసమాన ప్రతిభని గుర్తించి గౌరవించినా...మనలో చాలామందికి రాజన్‌బాబు పేరు తెలియక పోవడం శోచనీయం. ఫోటో కళాకారుల పట్ల మన నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం. సుదీర్ఘ పరిచయంతో నేనూ వారి కుటుంబంలో ఇమిడి పోయాను. నాకు వారింట్లో అమితంగా నచ్చే పిలుపు భార్య పద్మను రాజన్‌గారు 'మమ్మీ' అని పిలవడం. పద్మగారు రాజన్‌బాబును 'నాన్నా' అని పిలవడం. పెద్దతనపు బంధంలోని ఆ పిలుపులో గొప్ప జీవన సౌందర్యం కనిపించేది నాకు. "నాన్నా నాతో ఒక్కసారి మాట్లాడవా'' అని పార్థీవశరీరంపై పడి ఆవిడ విలపిస్తుంటే తట్టుకోలేక పోయాను.

కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండి ఆయన్ని కలవడంలో కొన్ని నెలలు గ్యాప్ వచ్చింది. ఆయన నుంచి ఫోన్... "నేనింకా బతికే ఉన్నా... చచ్చిపోలేదింకా...ఇంటికి రావడం మర్చిపోవడమేనా'' అంటూ మాట్లాడారు. వెళ్లి కలిశాను. కానీ , 'నిష్క్రమణం' ముందే తెలిసినట్లున్న ఆ మాటలు ఇప్పుడు మనసుని మెలిపెడుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా...పెద్ద వాళ్లని చూసి రావడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి.

రియల్ టీచర్

'మంచి ఫోటోగ ఫ్రీకి రూల్స్ లేవు.. కానీ మంచి ఫోటోగ్రాఫ్‌లు ఉంటాయ'ంటారు తెలుగు ఫోటోగ్రఫీకి అంతర్జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన రాజన్‌బాబు. ఈ రోజున దేశ, విదేశాల్లో అవార్డులు అందుకుంటున్న తెలుగు ఫోటోగ్రాఫర్లందరూ ఆయన శిష్యులే.

తనకు తెలిసిందంగా నవతరానికి నేర్పాలనే ఆయనలోని తపన అద్భుతం. క్లాస్‌రూమ్‌లో కూర్చోపెట్టి నేర్పితే ఫోటోగ్రఫీ రాదంటారాయన. వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభ నింపవచ్చన్నారు. దేశమంతా తిరిగి వేలాది వర్క్‌షాప్‌లు నిర్వహించారు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అయనను వెతుక్కుంటూ వచ్చాయి.

Alumni portfolio

KV Reddy

BK Agarwal

Chandana Srinivas

MC Shekher

Suneeta

Sadanandam S

Srinivas Mekala

Amzad


కానీ ఆయన ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. పద్మశ్రీ వంటి పురస్కారాలు ఆయనకు దక్కకపోవడానికి అదే కారణం కావచ్చు. ఆయనకు పద్మ పురస్కారం మిగలకపోవచ్చు కానీ ఈతరం ఫోటోగ్రాఫర్లకు అపురూపమైన చిత్రాలు మిగిల్చివెళ్లారాయన. ఫోటోగ్రఫీలో అరుదైన డోపింగ్ కళ ఆయనకే సొంతం. ప్రపంచంలో పిక్టోరియల్ ఫోటోగ్రఫీ లోతులు తెలిసిన మహనీయుల్లో రాజన్ మొదటివరసలో ఉంటారు. ఈ రోజున ఆయన లేరు... ఆయన స్ఫూర్తి ఉంది. 
- కె. విశేవందర్ రెడ్డి, హైదరాబాద్ ఫొటోసర్కిల్ కార్యదర్శి

ఇంకా ఇచ్చేవారు!


ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి తొమ్మిదిన, మళ్లీ మూడు వారాల క్రితం ఫ్యామిలీ ఫంక్షణ్‌లో ఎంతో ఆనందంగా కనిపించిన ఆయన ...కేర్ హాస్పిటల్ బెడ్‌లో అచేతనంగా పడి ఉండడం జీర్ణించుకోలేని దృశ్యం. ఏదో చెయ్యాలి... ఇంకా చెయ్యాలన్న తపన ఉన్న మనుషులు వెళ్లిపోతే నష్టం వ్యక్తుల కన్నా సమాజానికే ఎక్కువ.

మిత్రుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి అన్నట్లు "ఇప్పటి రోజుల్లో 73 ఏళ్ల వయసు ఏమీ చెయ్యలేని వృద్ధాప్యం మాత్రం కాదు. ఇప్పటికీ రాజన్ తాను ఇవ్వదల్చుకున్నది సమాజానికి ఇచ్చేసినా, ఇంకా ఇవ్వగలిగింది ఇచ్చుండే వారు. మెరికల్లాంటి యువ ఫోటోగ్రాఫర్లని సమాజానికి అందించ గలిగుండేవారు.

ముఖ్యంగా, ఈ రాష్ట్ర ఛాయాచిత్ర కుటుంబం ఇంటి పెద్దని కోల్పోయింది'' ఎక్కడికి వెళ్లినా ఆయన వెనకే ఉండి ఫోటోగ్రఫీ మెళకువలు నేర్చుకొని, అమెరికాలోనూ అదే విద్యని అభ్యసించి వచ్చిన ఆయన చిన్న కుమారుడు చిరంజీవి రమణలో రాజన్ గారిని చూసుకోవచ్చన్న చిన్న ఓదార్పు మాత్రమే నాలాంటి వారికి ఊరటనిస్తోంది. 

Students portfolio

Anil Kumar T

Anupama Chakraborthy

Karthik Raju

S N Reddy

Dinesh Parchuri

Thursday, August 25, 2011

అయామ్ లెజెండ్..'' నేనే బలాన్ని''

మరుగుదొడ్లు సాఫు చేసే మెహతర్ కులంలో పుట్టి దేవుళ్లను, దేవుళ్ల ఆస్తులను సంరక్షించే మంత్రిత్వ శాఖను నిర్వహించే స్థాయికి ఎదిగిన టి.ఎన్.సదాలక్ష్మి ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు సిసలైన స్ఫూర్తికి గొప్ప నిదర్శనం. ఎందరో నాయకులను నిగ్గదీస్తూ, అన్యాయాలను ఎదుర్కొంటూ, నిత్యం న్యాయం వైపే నిలబడుతూ, ఎక్కడా రాజీపడకుండా బతికిన మనిషి సదాలక్ష్మి. ఒక స్త్రీగా, మాదిగగా, తెలంగాణవాదిగా... ఎన్నిటికి ఎదురీది ఆమె గొప్ప నాయకురాలిగా, మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకుందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే 'అడుగడుగునా నాకు చరిత్ర ఉంది' అని అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిందామె. ఆమె జీవితకథ నుంచి కొన్ని ఆసక్తికర భాగాలు .....

డిప్యూటీ స్పీకర్‌గా నా అనుభవాలను, అప్పటి అచీవ్‌మెంట్స్‌ను తలుచుకుంటే చాలా సంతోషమనిపిస్తుంది. సభలో అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, వావిలాలగోపాల కృష్ణయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, వందేమాతరం రామచందర్ రావు లాంటి హేమాహేమీలంతా ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ నాకు ఇబ్బంది కాలేదు. నా రూలింగ్‌ను ప్రతిపక్షం వాళ్లే మెచ్చుకునే వారంటే ఇగ అర్థం చేసుకోండి.

నేనొకటి గమనించాను. సభలో ఎక్కువ ఛాన్స్ అపోజిషన్‌కు ఇవ్వాలి. వారు స్టడీ చేసి వస్తరు. సప్లిమెంట్ క్వశ్చన్స్ వేస్తరు. అపోజిషన్ వారికి అవకాశం ఇస్తే గవర్నమెంట్‌కు కూడా మంచిది. విమర్శ వస్తే కనువిప్పు కలుగుతుంది గద. అప్పట్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా అల్లూరి సత్యనారాయణ ఉండేవాడు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వవలసిందిపోయి ప్రతీసారీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కలగజేసుకునేవారు. ఆ మంత్రికి జవాబు చెప్పడానికి వీలుకాకపోతే ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది కానీ, ముందే ముఖ్యమంత్రి కలగజేసుకోవడం నాకు నచ్చేది కాదు.

దాంతో ఒకసారి 'ప్లీజ్ ఆనరబుల్ సి.యం..యు మే టేక్ యువర్ సీట్. కన్సర్న్‌డ్ మినిస్టర్ మస్ట్ రిప్లయ్' అన్నాను కటువుగా. ఒక ముఖ్యమంత్రిని 'కూసో..' అన్నోళ్లు చరిత్రలోనే లేరు. నా వరకు నేను ప్రొసీడింగ్స్ తప్పితే భరించలేను. అది అసెంబ్లీ అయినా. కుటుంబమైనా. ఎవర్నయినా పేరు పెట్టే పిలుస్తాను, 'మాదిగది ఎంత పొగరు' అనుకున్నా నేను పట్టించుకునేది కాదు. అధికారం ఒక దళిత మహిళ చేతుల్లోకి వస్తే ఆమె మనసు పెట్టి పని చేస్తుందనడానికి నేనుఉదాహరణ.

పి.వి.జి రాజుతో హోరాహోరీ

ఎమ్మెల్యేగా వున్నప్పుడు ప్రజల్ని సదువుకోవాలి. ఆ రోజుల్లో నన్ను అడిగేవారికి, 'ఎవరికి శాసనం అవసరమో ఆ శాసనానికి సభ్యులు వాల్లు గావాలి' అని చెప్తుంటి. అగ్రకులస్తులైతే ఆ శాసనం వారికేమి వర్తిస్తది! అంటే బాగ బల్సినోడికి.. ఆకలి దీర్చే విధానం ఎట్ల తెలుస్తది? దీనిని ఆకలంటరు అంటే..ఏమాకలి? ఎందుకైతది ఆకలి? అని అడుగుతరు. ఆ కోవకు చెందిన వాడే పి.వి.జి. రాజు. అప్పుడు హెల్త్ మినిష్టరుగున్నడు.

ఒకసారి 'వాటీజ్ దిస్ సదాలక్ష్మి .. హంగ్రీ హంగ్రీ...! వాటీజ్ దిస్ హంగ్రీ! ఐ కాంట్ అండర్‌స్టాండ్' అన్నడు. 'చెప్త అయ్యా నువు రాజువురా నీకెందుకర్దమైతదీ ఆకలి అన్న. ఎంబడే అన్న 'సిల్వర్ స్పూన్...గోల్డ్ స్పూన్ పుట్టుక నీది. బీద వాళ్ల ఆకలి నీకేందెల్సు?' అన్నాన్నేను. 'నీ కొరకు అన్నం కాచుకొనుంటది. పేదవాడు అన్నం కొరకు కాచుకొనుంటడు. దటీజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్!' అంటే అతను నోరిప్పలేదు. కండ్లెల్ల వెట్టిండు'.

దళితుల దగ్గర గుగ్గిళ్లు కూడా కొనరే...

ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ 'ఆ పల్లెటూర్లు బాగుపడాలంటే, ఆర్థికంగా మెరుగుపడాలంటే మొట్టమొదటగా ఆయా గ్రామాల దళిత వాడలు ఆర్థికంగాను, అన్ని రకాలుగాను బాగుపడాలి. అందుకు దళితులకు భూములివ్వాలి. గ్రామాలలో ఇతర కులాల బీదలు కూడా ఉన్నారు. ఆ ఇతర బీదలకు, దళితులకు ఆర్థికంగా భేదం లేకపోచ్చును గాని, నాదొక మనవి. ఆ ఇరువురికీ ఒక ముఖ్యమైన భేదం ఉంది.

ఇతర జాతి బీదవాండ్లు ఏదో ఒక వృత్తి చేసుకుని బతకొచ్చు. గుగ్గిళ్లయినా వేసుకొని అమ్ముకొని బ్రతుకవచ్చు. కాని ఆ అవకాశం కూడా దళితులకు లేకపోవచ్చు. దళితులను అంటరానివాళ్లుగా చూస్తూ ఆఖరుకి వాళ్ల గుడ్డలు అంటుకున్నా కాని ఆ గుడ్డలను నీళ్లలోవేసి తడుపుకొనేటపుడు, ఇంక వాళ్ల దగ్గర గుగ్గిళ్లు ఎవరు కొంటారు? అంటే ఆ గుగ్గిళ్లయినా అమ్ముకొని బ్రతికే అవకాశం దళితులకు లేదన్నమాట. కనుక భూములను ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దళితులకివ్వాలని నేను మనవి చేస్తున్నాను'.

ఎండోమెంటు బాపనోల్ల రిజర్వేషనుగా ఉండె

ఎండోమెంటు శాఖలో రిజర్వేషన్లు గూర్చి చెబుతూ ఆమె... 'దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజర్వేషన్లు లేవు గద. అంతా బాపనోల్లే. ఆల్లకే రిజర్వేషను నడిసింది. అక్కడ కమిటీల్లో పూజార్లుగ దళితులను నియమించాలని'బెట్టిన నేను. అండ్ల పదిహేను శాతం మాల మాదిగలు పూజార్లు కావాలె. దానికి యాదగిరి గుట్టలో ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ జేసిన. ఇపుడు పదిహేను శాతం రిజర్వేషన్‌లు తీసుకుంటున్నరు. దేవాదాయ భూములున్నయి.

అవి ఆక్షన్ బెడితే ఎవరో వేరే కులస్తుడు దీసేసుకుంటడు. దాన్ని ఆప్షన్ బెట్టకుండ మూడు సంవత్సరాలు యావరేజ్ తీసుకొని దళితులకిచ్చే విధానాన్ని చేసేసిన. అస్సలు గుడుల నుంచే అన్‌టచబులిటీ స్టార్టయ్యింది. అందుకే ప్రతీ ట్రస్టులో ఒక దళితుడుండాలని, ఒక ఆడ మనిషి ఉండాలని పెట్టిన. ఇంకొకటి ఏమంటే భక్తి ఎక్కువుంటది ఆడవాల్లకు. ఆ విధంగా నేను స్వయాన ఆడ మనిషినైనందుకు, నా కులం దళిత అయినందువల్ల దళితుల నుంచి రిప్రజెంటేషన్ ప్రతీ ట్రస్టులో పెట్టిన. అన్‌టచబులిటీ పోవాలనేసి.

ప్రతీ ట్రస్టులో 'షెడ్యూల్డ్ క్యాస్ట్' అనేటాల్లకు లబ లబ లబ మొత్తుకున్నరు దేశమంత. అన్ని దిక్కుల్నించి వ్యతిరేకత వచ్చింది. తిరుపతి ట్రస్టులో వేసుకోవటం అయితే వాళ్లకు చాలా కష్టమైంది. అయినా నేను చేసేసిన గద. తప్పని స్థితిలో ఇంప్లిమెంట్ చేయాల్సొచ్చిందన్నట్టు. నాపై వ్యతిరేకత ఎంతవరకంటే చంపేస్తమని బెదిరింపులదాక వచ్చింది.'చంపేస్తం. నువు మాల మాదిగలను అర్చకులను ఎట్ల ఏస్తావ్' అని టెలిఫోన్లు, ఉత్తరాలు.

ఇంక కొంత మంది ప్రజలు 'ఎట్లేస్తవమ్మ, ఎట్ల తయారు చేసినవు' అని గునుగుడు. కాంగ్రెస్ అధిష్టానం నా ముందు ఏమన్లే. ఒక వేల వాల్లు ఒత్తిడి చేసినా నేను భయపడగద... భయపడను. అందర్కిదెల్సు, ఆమె అనుకున్నది జేస్తదని. అందుకే మినిస్ట్రిల ఉండనివ్వలేదు. రెండు సంవత్సరాలకే మార్చేసిన్రు గద! ఎండోమెంటు నించి ఎక్కువ దళితులకు సాయం చేస్తుండేది గుడుల తరఫు నుంచి. దాన్ని ఓర్చుకోలేకపోయిన్రు. ఇగ నన్ను ఉంచలేదు. నా కొరకు పార్టీల అడిగెటోడు లేడు. దిక్కు దివానం లేదు. ఏది జేసినా నేనే జేసుకోవాలె.

లెదర్ బోర్డుతో రగులుకొని 'ఏబీసీడీ' ఉద్యమమైంది

'లిడ్‌క్యాప్ 1960లో అనౌన్స్ అయ్యింది. నేను 1984-85 మధ్య సంవత్సరం పాటు దాని చైర్‌పర్సన్‌గ పనిజేసిన. అప్పుడు లిడ్‌క్యాప్‌ను అభివృద్ధిలోకి తెచ్చేందుకు చాలా జేసిన. కెపాసిటి పెంచినం. దాని విషయాలన్నీ స్టడి చేసేందుకే సంవత్సరమయింది. లిడ్‌క్యాప్‌లో చాలా పన్జెయ్యగలుగుతం అని మనవాల్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన, ఇంక నన్ను తీసేసిన్రు. నేను పొజీషన్‌లో ఉన్నప్పుడు అన్ని గూడ వాల్లకూ వీల్లకు అంటే మాలోల్లకు మాదిగోల్లకు కల్సి చేసుకుంటూ వచ్చిన.

అప్పుడు అందరు నన్ను పొగిడిండ్రు. 'మన షెడ్యూల్డ్ క్యాస్ట్‌ల కొరకు ఒక్కతే ఫైట్ చేస్తది, సాధిస్తది' అని అందరు మెచ్చుకున్నరు. కాని మాలలు పొజీషన్‌లో ఉన్నప్పుడు మాత్రం వ్యతిరేకం జేస్తూ బోయిండ్రు. అదెట్లాగో చెబుత. లెదర్ పని మాదిగలు జేస్తరు. అందుకే లెదర్ బోర్డును కూడా 'హ్యాండ్లూమ్ బోర్డు' లెక్కనే చెయ్యాలి, అప్పుడే మాదిగలు ఆర్థికంగ బాగుపడ్తారనేసి నేను చెబ్తూ వస్తున్న. అప్పుడు చీఫ్ మినిష్టరుగున్న దామోదరం సంజీవయ్య 'నీకెందుకు నేను చేస్తగద' అంటూనే దాన్ని 'అడ్వైజరీ బోర్డు' కింద జేసేసి అందుట్ల అందర్ని బెట్టిండు.

అంటె దాన్ని జనరల్ చేసేసిండు. ఆయన మాల. ఆ తర్వాత అడ్వయిజరీ బోర్డుకు మేనేజింగ్ డైరెక్టర్‌గ ఇంకో మాల ఐ.ఏ.ఎస్ వచ్చిండు. ఆయనొచ్చి ఢిల్లీకి బోయి లెదర్ బోర్డుని ఏకంగా కంపెనీ యాక్ట్ కిందకు తెచ్చిండు. అది కంపెనీ అయిపోయిందిక. అంటె ఏ కులంది గాదు. అన్ని కులాలవాల్లు జేరిండ్రు. దీని వల్ల చివరికి ఎక్కువగ కమ్మోల్లు, ముస్లింలు అందులో జేరి లబ్ది పొందిన్రు. మాదిగోల్లకు మాలోల్లు చేసిన మహోపకారం ఇది!

ఆరోజు సంజీవయ్య గుర్తుబెట్టుకోని మరీ దాన్ని అడ్వైజరీ బోర్డు జేసినాడంటె మాదిగోల్ల నోటికాడి కూటిని తన్నినట్లు కాలేదా? ఇంత కక్ష ఉన్నదా? మన మీద అనిపించింది. ఇదే గాదు. అన్ని చోట్ల ఇట్లనే జేసిండ్రు. 1952 నుంచి కౌన్సిల్ టికెట్ మాలలకియ్యడం, అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు మాలలకే ఇయ్యడం, అది ఎంతవరకూ వచ్చిందంటే 'రిజర్వుడు నియోజక వర్గాల్లో మాలలకు తప్ప ఎవ్వరికీ అవకాశం లేదు'అనే కాడికొచ్చింది.

ఇటువంటివన్ని నా కడుపులో రగులుకున్నవి. రగులుకోని రగులుకోని ఇక నాకు అప్పట్నించి క్యాటగిరైజేషన్ కావాలి అనేసి మనసుకొచ్చింది. ఇంకా హెచ్ఎమ్‌టి, ఐడిపియల్ వంటి పబ్లిక్ సెక్టార్లు వున్నయి కదా. అక్కడ రిజర్వేషన్ పోస్టులన్ని గూడ అప్పుడు అప్పారావు ఐ.ఎ.యస్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్‌గ ఉండె. ఆయన చక్రం తిప్పి పెద్దకాడి నుంచి చిన్నకాడికి పోస్టులన్నీ చివరికి చెప్రాసీ పోస్టు గూడ మాలోల్లకే ఇచ్చిండు. అదీ ఆంధ్ర మాలలకే. ఒక్కటి గూడ మాదిగకియ్యలే.

అంటె వాల్లకు చాన్సున్నప్పుడు వాల్లోల్లకే ఇస్తూ బోయిండ్రు. నాకు ఛాన్సున్నప్పుడు ఇద్దర్కి కల్పి ఇచ్చిన.ఈ బ్రాడ్ మైండ్ వాల్లకు లేకపాయె. మల్ల అందరమొక్కటే పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో ఉండి గూడ ఆ విధంగ జేసిండ్రు వాల్లు. మనోల్లకు ఇంత నష్టమైపోతుంది గద కనీసం క్యాటగిరైజేషన్ చేస్తేనే మాదిగలకు అవకాశముంటుంది ఇగ తప్పదు అని నా మనసుకు బలంగా వచ్చింది. అక్కడే దండోరకు పునాదులు పడ్డయనుకో. నాకు అడ్వైజర్స్ ఎవ్వరు లేరు. అందులో ఈ సంజీవయ్య టైములోనే బ్యాక్‌వర్డ్ క్లాస్‌కు క్యాటగిరైజేషన్ గూడ వచ్చింది.

నేను దాన్ని బేస్ చేసుకుని, నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌ని అప్లయ్‌జేస్తు ఆలోచించిన. దానికంత సమయం పట్టింది. ఇక ఎస్సీలల్ల వర్గీకరణ కావాలని 1972లో జలగం వెంగళరావు చీఫ్ మినిస్టర్‌గ ఉన్నపుడు మెమోరాండం సబ్‌మిట్ జేసిన. అప్పటి నుంచి చీఫ్‌మినిస్టర్లకంత చెప్తూ, చెప్తూ వచ్చిన మొన్నటి దాక. దానెనుక అంత ఉందన్నట్టు. అపుడు కొందరు నన్ను 'నువు పిచ్చి దానివా? అట్ల ఎట్లయి దనుకుంటవ్' అన్నరు. 'మీకర్దమైత లేదండి నా కర్దమైతుంది' అనే దాన్ని.

ఆడది సమానమెట్లవుతది... ఎక్కువ కదా!

సమానత్వం, సమానత్వం అంటూ వుంటే నా చిన్న బుద్ధికి అదే అందకుండా ఉంది. అర్థం కాకుండా ఉంది. ఒక వేళ పురుషులు పురుషులకి పుట్టినట్టయితే, స్త్రీలకి స్త్రీలు పుట్టినట్టయితే సమానమనడంలో అర్థం వుండెటిది. అట్ల కాదే ఈ సృష్టే సృష్టిని ఆడవారి చేతిలో పెట్టింది. అంటే దేవుడనే వాడు ఒకడుండి, సృష్టిని సృష్టించి ఆ సృష్టిని ఆడవాళ్లకి పెట్టిండని నా దృక్పథం. కనుక మరి ఆడవారికి జన్మ ఆడదే ఇస్తది. మగవారికీ జన్మ ఆడదే ఇస్తది. మరి శరీరంలో వుండే రక్తమాంసాలన్నిటిని కరిగించి వారికి జన్మనిచ్చే ఆడది గొప్పదా? జేబులో చేతులు పెట్టుకుని తిరిగే మగవాడు గొప్పవాడా? కనుక నా దృక్పథంలో స్త్రీ గొప్ప. అది యదార్థం. సత్యం, ఒప్పుకుని తీరాల్సిందే సమాజం ఒక రోజు.

ఒక చిన్న ఉదాహరణ. ఒక యంత్రం వుంటది. ఆ యంత్రం ద్వారా ఒక పరికరం ఉత్పత్తి అయితది. ఆ పరికరం, మరి యంత్రం ఒకటేనా? యంత్రం అంటే స్త్రీ గర్భం అనుకోండి. పరికరంను యంత్రాన్ని సమానంగా చూస్తారా?ఆ ఉత్పత్తి ఎంతో బలంగా ఉండాలె, నాణ్యతగా ఉండాలె అని ఆ యంత్రాన్ని ఎంతో అపురూపంగా, జాగ్రత్తగా దానిని అప్పుడప్పుడూ సర్వీస్ చేయించడమో, లేకపోతే రిపేర్, అంటే వస్తువులు తగిలి పాడవకుండా చూడడమో జరుగుతుంది.

మామూలు యంత్రం పట్లనే ఇట్ల ఉంటే అందరికీ జన్మనిచ్చే స్త్రీ పట్ల ఎట్ల ఉండాలి. ఈ తల్లికి పరికరాలుగా పుట్టే ఈ జనాభా ఆడ, మగ ఎంత మంచిగ చూడాలి. మంచి సంతానం కొరకై తల్లిని సమాజం అపురూపంగా చూడాలె. ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని చూడాలె. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదని నా అభిమతం. అంతేగాని పురుషులను గుడ్డిగా ద్వేషించడం నా ఉద్దేశం అసలే కాదు. నిజానికి నాకు రాజకీయాలు నేర్పిన గురువులు పురుషులే.

మిక్స్‌డ్ హాస్టళ్లు పెట్టిన

1967లో సాంఘిక, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా నేనున్నప్పుడు ఎస్సీలు, బీసీలు, ఓసీలు కలిసిపోవాలని ప్రయత్నం జేసిన. కేవలం మాల, మాదిగ అంటే 'మామా' విద్యార్థులనే బెడ్తే అదే పరిస్థితులు వుంటాయని, అందరూ మిక్స్‌డ్ కావాలెనని ఆలోచన చేసిన. అట్ల సాంప్రదాయంగా ఎదగాలంటే ఒకరి అలవాట్లు ఒకరు చూసుకోవాల, నేర్చుకోవాలని అన్ని హాస్టల్లల బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మ, వెలమలను కూడా పెట్టిన.

అది ఇప్పటికీ నడుస్తున్నది. ఇంకా వీకర్ సెక్షన్స్ హౌజెస్‌లో గూడా బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు, దళితులకు వేర్వేరుగ వుండేవి. నేను ఒకటే దగ్గర నిర్మించే ఏర్పాటు చేసిన. నాకు ఎవ్వరు నేర్పలేదు. ఇట్లైతే బాగయితది. ఇట్లైతే ఈ చైతన్యం వొస్తది. వాళ్ల అలవాట్లు వీళ్లకి, వీళ్ల అలవాట్లు వాళ్లకు అబ్బి స్నేహం పెరిగి గ్యాప్ తగ్గుతదని. లేకుంటె ఎక్కడున్న వాళ్లు అక్కడే వుంటరు కదా అని అట్ల జేసిన'.

'చంపేస్తం. నువు మాల మాదిగలను అర్చకులను ఎట్ల ఏస్తావ్' అని టెలిఫోన్లు, ఉత్తరాలు. ఇంక కొంత మంది ప్రజలు 'ఎట్లేస్తవమ్మ, ఎట్ల తయారు చేసినవు' అని గునుగుడు. కాంగ్రెస్ అధిష్టానం నా ముందు ఏమన్లే. ఒక వేల వాల్లు ఒత్తిడి చేసినా నేను భయపడగద... భయపడను. అందర్కిదెల్సు, ఆమె అనుకున్నది జేస్తదని. అందుకే మినిస్ట్రిల ఉండనివ్వలేదు. రెండు సంవత్సరాలకే మార్చేసిన్రు గద!