Sunday, December 4, 2011

ఊరు మరచినా...నేను మరవలేదు * నటసామ్రాట్ అక్కినేని 'మా ఊరు'

నీడనెప్పుడైనా చూశారా? వెన్నంటే ఉంటుంది.
ఊరూ అలాంటిదే. మన మూలం.
ఎంత దూరం వెళ్లినా మనతోనే ఉంటుంది. పలకరిస్తూనే ఉంటుంది.
అమ్మ, నాన్న, ఊరు- మనం మార్చుకోలేనిది ఈ మూడింటినే.
సొంత ఊరిలో గాలి, నీరు, చెట్లు, పుట్టలు, స్నేహితులు, బంధువులు...అన్నీ ప్రత్యేకమే.
ఊరి స్మృతులు చెబుతుంటే మొహం వెలిగిపోతుంది. గుండె కదిలిపోతుంది. ఒళ్లు పులకరిస్తుంది. మనసు పరవశిస్తుంది.
ఆ మట్టి వాసనను పరిమళింపచేసేదే ఈ నటసామ్రాట్ అక్కినేని ఊరి కబుర్లే   'మా ఊరు'.


ఇది పదిహేనేళ్ల కిందటి జ్ఞాపకం. అప్పట్లో జన్మభూమి కార్యక్రమం జోరుగా సాగుతోంది. నేను కూడా మా ఊరికి తోచినంత సాయం చేద్దామని.. ఫ్యామిలీని వెంటబెట్టుకుని మా ఊరెళ్లా. అక్కడున్న వాళ్లంతా నన్ను చూసి 'అక్కినేని గారొచ్చారు! అక్కినేని గారొచ్చారు..' అంటూ బిలబిలా చుట్టుముట్టారు. వాళ్ల అభిమానాన్ని తప్పించుకుంటూ.. ఊరంతా ఒక రౌండ్ చుట్టేశాను. "ఈ ఊర్లో మీ ఇల్లేదీ?'' అని ఎంతో ఆసక్తిగా అడిగారు నా వెంట వచ్చిన కూతుళ్లు, కోడలు.

ఎప్పుడో ఊరు విడిచిన నేను నా ఇల్లు ఎక్కడని చూపించను..? బాగా గుర్తు చేసుకుని ఓ ఇంటిని చూపిస్తూ "అదిగో అదే నా చిన్నప్పటి ఇల్లు'' అన్నాను. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. "అక్కినేని గారూ ఇది మీ ఇల్లా? మా నాన్న నలభై ఏళ్లకిందట ఎప్పుడో దీన్ని కొన్నాడు'' అని చెప్పాడు ఆ ఇంటి ప్రస్తుత యజమాని.

ఎవరైనా నన్ను సొంతూరి మనిషిగా గుర్తుపట్టి పట్టెడన్నం పెడతారేమోనని నా మనసు చాలా ఎదురుచూసింది. చివరికి ఒక అభిమాని ఇంట్లో భోజనం చేశాం. అతను కూడా మా ఊరివాడే. అప్పుడు మా పిల్లలు ఒక మాటన్నారు.. "నాన్నా... ఈ ఊళ్లో నీకు కనీసం ఎకరం పొలమైనా ఉంటే ఈ ఊరోళ్లందరికీ నువ్వు తమవాడివని తెలిసేది. కనీసం ఇల్లయినా ఉంటే బాగుండేది'' అని అన్నారు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. ఓ చెట్టు దగ్గర నిలబడి...కాలువ గట్టువైపు చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను.

అక్కడ చిన్నపాకలో అక్షరాలు దిద్దుకున్న జ్ఞాపకాలు, మొదటిసారి నాటకం వేసిన అపురూప దృశ్యాలు కళ్లకు కనిపించాయి. పిల్లలు చెప్పిన మాట నిజమేననిపించింది. ఒక ఇల్లు ఉంటే అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉండేది. వచ్చినపుడల్లా ఎంచక్కా ఊరంతా తిరిగి చిన్ననాటి స్మృతుల్ని గుర్తుచేసుకునేవాడ్ని... అని మనసులో అనుకున్నాను. కాని పిల్లలకి నేను చెప్పిన సమాధానం వేరు. "సొంత ఊళ్లో పదెకరాల పొలం, ఓ పెద్ద ఇల్లు ఉంటేనే ఊరి మీద అభిమానం, అనుబంధం ఉన్నట్టు కాదర్రా. ఒకవేళ అలా ఉండి ఊరికి ఏమైనా సాయం చేస్తే..."ఎవడి కోసం చేస్తున్నాడు...వాడి ఆస్తులు కూడా ఉన్నాయి కదా...'' అని అనేవారు కూడా ఉంటారు'' అని సర్ది చెప్పాను


**** చెట్లు...పుట్టలు...
నేను రేపో మాపో పుడతాననగా మా అమ్మ పున్నమ్మకి నాగుపాము కల్లోకి వచ్చింది. దాంతో నాకు నాగేశ్వరరావు అని పేరు పెట్టింది. నాగులచవితి నాడు పుట్టలో పాలు పోయడానికి అమ్మ చేయి పట్టుకుని ఊర్లో ఉన్న పుట్టలు, చెట్టులు తిరగడంతో మొదలైంది నా బాల్యం. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాకి ఉత్తరాన 9 మైళ్ల దూరంలో ఉన్న వెంకట రాఘవాపురం నా జన్మస్థలం. చిన్న ఊరు. మహా అయితే యాభై ఇళ్లు ఉంటాయేమో. పాతికెకరాల అసామి మా తండ్రి వెంకటరత్నం. ఐదుగురు కొడుకుల్లో నేను ఆఖరివాడ్ని. అతి సామాన్యరైతు కుటుంబం. మాదే కాదు...మా ఊర్లోని అందరూ సామాన్యులే. నాలుగు నిట్రాళ్ల మా ఇల్లే ఊర్లోని అందరి ఇళ్లలోకి పెద్దది. మా ఇంట్లో ఐదు గదులుండేవి.

పాకలో...పాఠశాల

చెరువుగట్టున ఒక చిన్న పాక ఉండేది. అదే మా ఊరి పాఠశాల. రెండో తరగతి వరకూ ఉండేది. పగలు పాఠశాల. సాయంత్రం పేకాటశాల. రాత్రయితే గోశాల. మా ఊళ్లోనే కాదు అప్పట్లో అన్ని పల్లెటూళ్లలో అదే పరిస్థితి. ఆ రోజుల్లో అదే గొప్ప. నా నాల్గవ ఏటనే నాన్న చనిపోయారు. దాంతో అప్పటివరకూ కలిసి ఉన్న అన్నదమ్ములంతా విడిపోయారు. అంత పెద్ద ఇంట్లో అమ్మా..నేను మిగిలాం. ఇల్లు, మా వాటాకి వచ్చిన ఐదు ఎకరాల పొలం అమ్మేసి నన్ను పెద్ద చదువులు చదివిద్దామనుకుంది అమ్మ. మా ఊళ్లో రెండవ తరగతి వరకే ఉండడంతో పక్కనే ఉన్న పెదఊరిపాడు ఊళ్లోని స్కూల్లో చేర్పించింది.

రోజూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడ్ని. చదువుకుంటూనే అన్నల పొలాలకు వెళ్లి నారు కట్టలు మోయడం దగ్గర నుంచి వరి కట్టలు మోసేవరకూ అన్ని పనులూ చేసేవాణ్ని. అలాగే ఇంట్లో అమ్మకి కూరలు తేవడం కూడ.అన్నట్టు కూరలంటే గుర్తు వచ్చింది. నాకు ఒక సైకిల్ ఉండేది. కూరలు, సరుకులు ఏం కావాలన్నా..పక్కఊరికి వెళ్లాలి. ఆరేడేళ్ల వయసులో ఆ సైకిల్ తొక్కడానికి చాలా పాట్లు పడేవాణ్ని. అందీ అందని కాళ్లతో ఉడతకొట్టుడు కొడుతూ పక్కఊరికి వెళ్లి ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేవాడ్ని. ఒకరోజు మా ఊరి పాఠాశాలలో ఏవో నాటకాలు వేస్తున్నారంటే చూడ్డానికి వెళ్లాను. వెళ్లి ఊరుకోలేదు. నేను వేషం వేస్తానని రెడీ అయ్యాను. చంద్రమతి వేషం ఇచ్చారు. చీర కట్టి నా నోటికొచ్చిన గాలిపాటలు పాడాను. నాటక బృందం వారు శభాష్ అని మెచ్చుకుని అర్ధ్థరూపాయి చేతిలో పెట్టి పంపించారు.

పాఠశాలలో నాటకం..
నాటకం ముగిసాక నేరుగా ఇంటికెళ్లి అమ్మకి చేతిలోని అర్ధరూపాయిని చూపించాను. అమ్మ అర్ధరూపాయని చూడలేదు. నా మొహంలోని సంతోషాన్ని చూసింది. నా నటన గురించి ఊరి జనం చెప్పిన కబుర్లన్నీ విన్నది. 'మన వంశంలో ఎవరూ చదువుకోలేదు. చిన్నాడినైనా పెద్ద చదువు చదివిద్దామనుకున్నాను. వాడికి కూడా అబ్బేట్టు లేదు. వాడిలో నాకు మంచి నటుడు ఉన్నాడనిపిస్తోంది. పోనీ ఆ రంగంలోనైనా వాడ్ని ముందుకు పంపుదామనుకుంటున్నార్రా' అని అన్నయ్యల దగ్గర చెప్పింది. వాళ్లూ సరేనన్నారు. కుదరవల్లి గ్రామంలో 'కనకతార' నాటకం వేస్తున్నారని తెలిసింది. అందులో తార వేషం వేయమని పిలుపొచ్చింది. మరో అర్ధరూపాయి చేతిలో పడింది. అలా...మా ఊరి పాఠశాల్లో వేసిన నాటకమే నాకు బతుకుతెరువు చూపించింది.

రాజకీయాలు...

యాభై గడపలే కదా...అని మా ఊరిని తక్కువ అంచనా వెయ్యకండి. ఆ చిన్న ఊళ్లోనే పెద్ద పెద్ద రాజకీయాలు. ఎప్పుడూ రెండు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉండేది. ఈ కొట్లాటలు జరుగుతున్నప్పుడు మా అన్నలకు కర్రలు గటా అందించేవాడ్ని. ఏడాదిలో పంటల కాలం పోగా మిగతా కాలమంతా అందరూ ఖాళీగా ఉండేవాళ్లు. ఏ చెట్టుకింద చూసినా పేకాట రాయుళ్లే. పెద్దన్నయ్యకి గుడివాడతో బాగా పరిచయం. అక్కడ నాటకాలవారిని పరిచయం చేసుకుని నన్ను అక్కడికి కూడా పంపేవాడు. అక్కడ వేషాలు ఎక్కువగా రావడంతో అమ్మని తీసుకుని గుడివాడకి వెళ్లిపోయాను. ఘంటశాల బలరామయ్యగారి కంట్లో పడేవరకూ బోలెడు నాటకాల్లో వేషాలు వేశాను. ఆయన పరిచయంతో నా మకాం మద్రాసుకి మారింది. నా జీవితంలో బోలెడు మార్పులు జరిగిపోయాయి. కాని దశాబ్దాలు గడచినా...నా ఊళ్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

కళాశాల నిర్మాణం...

నా చదువు నాలుగో తరగతితో ఆగిపోయింది. అయినా మా కుటుంబంలో నా చదువే పెద్ద చదువు. అమ్మా...నాన్న, నలుగురు అన్నయ్యల్లో ఎవరికీ సంతకం చెయ్యడం రాదు. నాకు మాత్రమే చదవడం, సంతకం చెయ్యడం వచ్చు. మా వాళ్లకి చదువుల తల్లి అల్లంత దూరంలో ఉండేది. సినిమాల్లోకి వెళ్లాక నాలుగు రూపాయలు సంపాదించాక నేను చేసిన మొదటి పని గుడివాడలో కళాశాల కట్టించడం. బాగా చదువుకున్నవాడి కంటే చదువుకోలేని వాడికే చదువు విలువ బాగా తెలుస్తుంది. దానికి నేనే నిదర్శనం. అందుకే ఎఎన్ఆర్ పిజి కాలేజి నిర్మాణానికి పూనుకున్నాను. అమ్మ చాలా సంతోషించింది. గుడివాడ ప్రజలు అంతకన్నా ఎక్కువ సంతోషపడ్డారు.

ఊరిని వదిలి...

నాటకాల పేరుతో నేను గుడివాడకి మకాం మార్చాక అన్నయ్యలు కూడా ఊళ్లోని భూములు అమ్ముకుని వేరే ఊళ్లకి వెళ్లిపోయారు. సొంత ఊళ్లో మాకంటూ సెంటు భూమి కూడా మిగల్లేదు. అమ్మకి ఊరి అభిమానం చాలా ఎక్కువ. ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉండేది. నేను మాటల్లో తలుచుకోవడమే కాని ఎప్పుడూ వెళ్లలేదు. ఇల్లు, పొలం లేకపోవడం ఒక్కటే కారణం కాదు ఆ ఊళ్లో ఒక్క బంధువు కూడా మిగల్లేదు మాకు. అందరూ వలసలు పోయారు. సినిమా రంగంలో నేను రోజురోజుకీ ఎదుగుతున్నాను.

డబ్బు సంపాదించుకుంటున్నాను...అంతా బాగానే ఉంది. వీధి దీపం తెలియని రోడ్లు, మరుగుదొడ్లు ఎరుగని మహిళలు, మంచినీరులేని నూతులు...ఇవే నా ఊరి జ్ఞాపకాలు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో నాకున్న పరిచయంతో ఒకసారి వెళ్లి కలిసాను. ' నా సొంత ఊరిలో నాకు ఏమి లేకపోయినా బాధ కలిగించే జ్ఞాపకాలు మిగిలిపోయాయి. నా ఊళ్లో ఇప్పటికీ కరెంటు లేదు. ఊరికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కరెంటు స్తంభాలు వచ్చాయని తెలిసింది. అక్కడి నుంచి నాలుగు కరెంటు వైర్లు మా ఊరికి కూడా లాగించండని' అడిగాను. ఓ నాలుగైదు సార్లు వెంటపడితే పనైంది. ఊళ్లో కరెంటు బల్బులు వెలిగాయని తెలిసాక చాలా సంతోషమనిపించింది.

గుర్తుపట్టలేదు...

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకరోజు ఆయన జూబ్లిహాల్లో ఒక మీటింగ్ పెట్టారు. నన్ను కూడా పిలిచారు. జన్మభూమిలో భాగంగా పల్లెటూళ్లని అభివృద్ధి పరుచుకునే పథకం గురించి చెప్పారు. ముందుగా నేనే స్పందించాను. అరవైశాతం ప్రభుత్వం పెట్టుకుంటే, నలభైశాతం ఊరి ప్రజలు భరించాలని, మంచినీరు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ముందుగా మా ఊళ్లోని వాళ్లతో మాట్లాడడానికి చంద్రబాబుతో కలిసి హెలికాఫ్టర్‌లో వెళ్లాను.

'మన ఊరు చూడ్డానికి అక్కినేని నాగేశ్వరరావు వస్తున్నారంటూ' ఊళ్లో హోరెత్తిపోయిందట. 'బాబు..ఇది మీ ఊరు మాత్రమే కాదు...నాది కూడా ఇదే ఊర'ని ప్రతిఒక్కరికి నోరు తెరిచి చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ ఊళ్లో నా వయసువారంతా అప్పటికే చనిపోయారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకోడానికి ఎవరూ లేరు. తర్వాత తరాలవారికి నేను నటుడిగానే తెలుసు కాని ఊరి మనిషిగా పరిచయం లేదు. ఊరి అభివృద్ధి గురించి ఊరి పెద్దల్ని కలిసి మాట్లాడితే ఊళ్లోని మునుసుబుగారి అబ్బాయి ముందుకు వచ్చాడు. తనకు తోచింది తాను చేశాడు. మిగతా డబ్బంతా నేను పెట్టాను. వెంకట రాఘవాపురానికి కరెంటు, ఇంటింటికీ మంచినీళ్ల పైపులు, రోడ్లు, సానిటరీ...అన్ని సదుపాయాలు వచ్చాయి. దశాబ్దాలుగా నా గుండెల్లో ఉండిపోయిన దిగులంతా పోయింది.

వంతెన నిర్మాణం..

గుడివాడ నుంచి ఏలూరుకి వెళ్లాలంటే బుడమేరు వాగు చుట్టూ తిరిగి వెళ్లాలి. అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. లేదంటే రెండు కిలోమీటర్లు కాలువపైన పడవలు, బల్లకట్ల మీద వెళ్లాలి. జన్మభూమి కార్యక్రమం సమయంలోనే ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. బ్రిడ్జి కట్టించకపోతే కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నాను. ప్రభుత్వం ఒప్పుకుని రెండు కిలోమీటర్ల వంతెన నిర్మాణం పూర్తి చేసింది. గుడివాడ నుంచి ఏలూరికి నేరుగా వంతెన వచ్చేసింది. ప్రయాణం సులువైంది. రైతుల భూముల రేట్లు కూడా పెరిగాయి. ఆ వంతెనకు అక్కినేని వారధి అని పేరు పెట్టారు.

మా ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మూడేళ్లక్రితం కుదరవల్లి దగ్గర అక్కినేని కళాకేంద్రం నిర్మించాము. మా పక్కఊరికి చెందిన డాక్టర్ ఎఎస్ నారాయణ ఈ కళాకేంద్రంలో బుక్‌బైండింగ్ వర్క్ పెట్టించాడు. పని కావాల్సినవారు అక్కడికి వచ్చి నేర్చుకుని పని చేసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల ప్రైవేటు స్కూళ్లకి మా కళాకేంద్రం నుంచే నోటు పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. మొన్నామధ్య నా ఫొటోతో కొన్ని పుస్తకాలు ముద్రించారు. నేను రెండు వేల పుస్తకాలు కొనుక్కుని నా పుట్టినరోజునాడు నా అభిమానులకు బహుకరించాను. పుట్టిన ఊళ్లో సెంటు భూమి లేకపోయినా ఊరి గురించి ఆలోచించడం మానలేకపోతున్నాను. కన్నతల్లిని ఎలా మరువలేమో పుట్టిన ఊరిని కూడా అలాగే మరవలేము.

ప్రస్తుతం మా ఊరికి సంబంధించి ఒక ముఖ్యమైన పని చేసే ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మా ఊరికి ఉత్తరం రాస్తే అడ్రస్‌లో కుదరవల్లి శివారు అని రాయాలి. అలా కాకుండా వెంకట రాఘవాపురాన్ని ఒక పంచాయితి చేస్తే బాగుంటుందని నా కోరిక. దానికోసం మంత్రిగారిని కలవాలనుకుంటున్నాను. ఈ ఒక్క పనీ పూర్తయితే నా సొంతూరి రుణం ఎంతోకొంత తీర్చుకున్న తృప్తి మిలుగుతుంది.

ఆ చుట్టుపక్కల ప్రైవేటు స్కూళ్లకి మా కళాకేంద్రం నుంచే నోటు పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. మొన్నామధ్య నా ఫొటోతో కొన్ని పుస్తకాలు ముద్రించారు. నేను రెండు వేల పుస్తకాలు కొనుక్కుని నా పుట్టినరోజునాడు నా అభిమానులకు బహుకరించాను.

No comments: