Sunday, December 11, 2011

అనుములనే అమ్మ అనుకున్నాను ...... కుందురు జానారెడ్డి సొంతూరు కథ

మూడేళ్ల వయసప్పుడే అమ్మ చనిపోయింది. అప్పుడు 'అనుముల' గ్రామమే అమ్మ ఒడయ్యింది. జీవితపు దారుల్లో నడిపించింది. నాయకుడిగా తీర్చిదిద్దింది. దాంతో తల్లికి చేయాల్సిన సేవలన్నీ ఆయన అనుముల ఊరికి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందురు జానారెడ్డి సొంతూరు కథ ఇది. ఆయన చెబుతున్న అనుముల కబుర్లే ఈ 'మా ఊరు'


"ఊళ్లోకి జింకల గుంపు వచ్చిందని తెలియగానే చేతిలో ఉన్న పుస్తకాలు విసిరేసి పరిగెట్టేవాడ్ని. కుర్రాళ్లందరం కలిసి నాలుగు రాళ్లు వేయగానే జింకలన్నీ పరుగందుకునేవి. రోజుల వయసున్న జింక కూనలు పరిగెట్టలేక పొదల్లో చిక్కుకుని ఉండిపోయేవి. వాటిని పట్టుకుని ఇంటికి తెచ్చుకునేవాడ్ని. జీతగాడ్ని పిలిచి మేకపాలు తీయించి కొబ్బరిచిప్పలో పోసి జింక పిల్లకి తాపేవాడ్ని. అలా నాలుగైదు నెలలు సాకి మళ్లీ జింకల గుంపుల్లో వదిలేసేవాడ్ని. ఇప్పుడు మా ఊళ్లో మేకపిల్లలే కనిపించడం లేదు ఇక జింకలెక్కడుంటాయి. జూపార్కుకి వెళ్లాలి(నవ్వుతూ...) ఊరు పేరు చెప్పగానే నాకు గర్తొచ్చే దృశ్యాల్లో ఇదొకటి.


వాగు పక్క వ్యవసాయం...
మాది ఉమ్మడి కుటుంబం. నాన్న, చిన్నాన్న తాత(మల్లారెడ్డి)తోనే కలిసి ఉండేవారు. నాన్నకి నేనొక్కడ్నే. చిన్నాన్నకు ఇద్దరూ ఆడపిల్లలే. నేనే వారసుడ్ని. మాది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌కిఎడమవైపున ఉన్న 'అనుముల' గ్రామం. నాకు తెలివొచ్చేటప్పటికి డెబ్బై, ఎనభై ఇళ్లు ఉండేవి. అందరికన్నా మా ఇల్లే పెద్దది. మిద్దె ఇల్లు. ఆరు గదులుండేవి. నాకు మూడేళ్ల వయసుండగానే అమ్మ (లక్ష్మీ నర్సమ్మ) చనిపోయింది. దాంతో ఇంట్లోవాళ్లందరూ చాలా గారం చేసేవారు. మాకు 40 ఎకరాల పొలం ఉండేది. అందులో ఒకే ఒక్క ఎకరం వరిపొలం, మిగతాదంతా మెట్ట పంటలు.


శెనగలు, ఉలవలు, కందులు, పెసలు, ఆముదాలు, పల్లీలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఒరిగలు, కుసుమలు, జొన్నలు...ఇలా అన్ని రకాల పంటలూ పండేవి. మా పొలంలో పండని ధాన్యం లేదు. కాయని కూరలు లేవు. నాన్న(వీరారెడ్డి) ఆకుకూరల్ని కూడా చాలా శ్రద్ధగా పండించేవాడు. పుంటికూర(గోంగూర), కలగూర, ఒంగంటి కూర, పాయల్‌కూర...ఒక్క పురుగుబట్టే కాలం తప్పిస్తే ఏడాదంతా ఈ ఆకు కూరలు మా పొలంలో ఉండేవి. ఇవి కాకుండా పశువుల కొట్టాల్లో, మా ఇంటి దొడ్లో అన్ని రకాల పాదులూ ఉండేవి. పొట్లకాయ, బీర కాయ, చెమ్మకాయ, దోసకాయ, కాకరగాయ పాదులు ఎప్పుడూ ఉండేవి.


వీరారెడ్డి ఇంటికొచ్చిన ఏ బంధువైనా సంచులనిండా ధాన్యాలను, కాయగూరల్ని తీసుకుపోవాల్సిందే. ఊరికి మాదే పెద్ద కుటుంబం కావడంతో ఎవరికి ఏది కావాల్సివచ్చినా వచ్చేవారు. అప్పట్లో పొలాల్లో కరెంటు మోటార్లు ఉండేవి కావు. మోటదోలేవాళ్లం. మోట అంటే ఒక తాడుకి డొప్ప కట్టి బావిలో వేసి ఆ తాడుని రెండు ఎద్దులకు కట్టేవాళ్లు. మధ్యలో తొండంలాంటిది ఉండేది. ఎడ్లు లాగినపుడు నీళ్ల డొప్ప పైకి వచ్చేది. ఆ నీటిని పొలం కాలువలో పోసేవాళ్లు. మామూలుగా ఈ పని చేయడానికి జీతగాళ్లు ఉండేవారు. అప్పుడప్పుడు నేను కూడా సరదాగా మోటదోలడానికి వెళ్లేవాడ్ని. చేతులు బాగా నొప్పిపుట్టేవి. అయినా వెళ్లేవాడ్ని. ఇది కాకుండా నాన్న, జీతగాళ్లు అన్నం తినడానికి వెళ్లినపుడు మధ్యలో ఆపేసిన పనుల్ని నేను కొనసాగించేవాడ్ని. గుంటగొట్టడం, గొర్రె తోలడం(బురద పొలాన్ని చదును చేయడం) కూడా చేసేవాడ్ని. మా నాన్న 'అరె...నీకెందుకురా...' అనేవాడు.


బర్రెలు...గొర్రెలు
డెభై ఆవులు, పది గేదెలు, యాభై గొర్రెలు, అరవై మేకలు ఉండేవి మాకు. వీటన్నిటినీ చూసుకోడానికి ఇంట్లోవాళ్లు కాకుండా నలుగురు జీతగాళ్లు ఉండేవారు. చిన్నాన్న, మేనత్త వాళ్ల పిల్లలు, మేము కలిపి మొత్తం పదిమంది ఉండేవాళ్లం. అందరికీ మా అత్తనే వండిపెట్టేది. పెద్దవయసువారికి వరి అన్నం, చిన్నపిల్లలకు ఒరిగెలన్నం, కొర్రన్నం. జీతగాళ్లకు సజ్జన్నం, జొన్నన్నం. మొత్తానికి ప్రతి రోజు అన్ని రకాల అన్నాలు వండేది. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ సమృద్దిగా ఉండేవి కాబట్టి పెద్ద పెద్ద బొగాణాలలో వండేవారు. మా ఇంటికున్న మరో స్పెషల్ ఏంటంటే...ప్రతి రెండు రోజులకూ నాన్‌వెజ్ ఉండేది.


చేపలు, రొయ్యలు కాదు ఆల్‌టైం మటన్. (నవ్వుతూ..) తిన్నవారికి తిన్నంత. విషయం ఏమిటంటే...మాకు మేకలు, గొర్రెలు ఉండేవి కదా! అవి మేతకు వెళ్లినపుడు వాటిని తినడానికి తోడేళ్లు వెంటపడేవి. అవి మేకని పట్టినపుడు జీతగాడు చూస్తే కర్రతో కొట్టేవాడు. అవి దాంతో మేకని అక్కడే వదిలి పోయేవి. చచ్చిన మేకల్ని జీతగాడు తెచ్చి ఇంటిముందు పడేసేవాడు. మా అత్త వండినంత వండి మిగతా మాంసం ఊళ్లోవాళ్లని పిలిచి పంచేది. పొలాల్లో కల్లాలు ఉన్నప్పుడు నాన్న నన్ను వెంట బెట్టుకుని వెళ్లేవాడు.


వాటికి కాపలా ఉండమనేవాడు. ఆ సమయంలో ఒక్క విజిల్ వేస్తే చాలు నా దోస్తులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఒక గంట కాపలా ఉండడం, మరో గంట గుట్టలెంబడి, చెట్టులెంబడి ఉరకడం. రేగిపండ్లు, పులిచేరు కాయలు, కలింకాయలు...వీటి కోసమే ఉరికేవాళ్లం. 'ఉన్నార్రా...అక్కడ' అని కేక వినిపించగానే మళ్లీ కల్లాలకాడికి వచ్చేసేవాళ్లం. మా ఊళ్లో ఒక్క పండ్లచెట్టు ఉండేది కాదు...జామపండు, మామిడిపండు, దానిమ్మపండు పేరు వినడమే కాని చెట్టు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. పక్క ఊళ్లకు వెళ్లినపుడే వాటి దర్శనం. సీజన్‌లో వచ్చే చిప్పలకాయలు, రేగిపండ్లే మాకు పెద్ద ఫలాలన్నట్టు.


వెన్నెల్లో ఆటలు...
పగలంతా చదువు, చిన్న చిన్న పనులు. వెన్నెలరాత్రులొచ్చాయంటే రాత్రిపూట కూడా ఆటలు ఆడేవాళ్లం. రాత్రి పన్నెండయినా పట్టించుకునేవాళ్లం కాదు.'అర్ధరేత్రయింది పండుకోండిరా...'అంటూ తాత అరుస్తూనే ఉండేవాడు. లెక్కజేస్తే కదా! ఇవి కాకుండా పగలు జింకల్ని సాకడం, గులేరుతో పిట్టల్ని కొట్టడం...బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. బాల్యాన్ని నేను ఎంజాయ్ చేసినదానిలో నా బిడ్డలు పదోవంతు కూడా ఎంజాయ్ చేయలేదు. అది నా గొప్పతనం కాదు. ఊరి వాతావరణంలో పొందే గొప్ప అనుభవం. ఆ రోజుల్లోని తిండి, నీరు, పొల్యూషన్ లేని గాలి...ఇప్పుడు వేలకోట్లు పెట్టినా దొరకవు.


కళకళలాడే కళ్లాపి రోడ్లు...
అప్పట్లో మెయిన్‌రోడ్లన్నీ కంకరరోడ్లే. మా చుట్టుపక్కల ఊర్ల సంగతి నాకు తెల్వదు గాని మా ఊరు మాత్రం అద్దంలా ఉండేది. రోడ్డుపైన చెత్త అనేది ఉండేది కాదు. ఇళ్లని చూసి కాదు వాకిల్ని చూసి ఆ ఇంటికథేందో చెప్పొచ్చు. కరెంటు, మంచినీరు, మరుగుదొడ్లు...వీటి గురించి ఎవ్వరికీ ఎరికలేదు. స్కూలు విషయానికొస్తే ఒకే ఒక్క చిన్నగదిలో ప్రైవేటు పాఠశాల ఉండేది. ఒకే ఒక్క టీచరు ఉండేవారు. మూడవ తరగతి వరకూ ఉండేది.


నాకు ఐదేళ్లు రాగానే నాన్న అక్కడ చేర్పించిండు. మా అత్త చెప్పేది. నేను చిన్నప్పుడు బాగా శ్రద్ధగా చదువుకునేవాడ్నంట. అక్కడ స్కూలు అయిపోయాక చల్లకుర్తికి పంపారు. అక్కడ పాపిరెడ్డి అనే టీచర్ ఇంట్లో ఉండి చదువుకునేవాడ్ని. ఎనిమిదో తరగతి పూర్తయ్యాక మిర్యాలయాలగుడాకి వెళ్లాను. హెచ్ఎస్‌సి పూర్తిచేశాక నాగార్జున సాగర్ కాలేజ్‌లో పియుసి చదివి టీచరయ్యి ఊరికి తిరిగొచ్చాను.


టీచర్ జానారెడ్డి...
అప్పటివరకూ ఊళ్లో సరదాగా ఆడుతూపాడుతూ తిరిగిన కుర్రాడు టీచర్ అయ్యాడని ఊరంతా సంతోషించింది. నేను టీచర్ అయ్యేసరకి ఊళ్లో స్కూల్లో ఐదో తరగతి వరకూ ఉంది. అన్ని సబ్జెక్‌లు చెప్పేవాడ్ని. పాతికేళ్లవయసులోనే 200మంది ఉపాధ్యాయులున్న సంఘానికి అధ్యక్షుడ్ని అయ్యాను. ఊళ్లో యూత్ అసోసియేషన్ పెట్టాను. నేనే నాయకుడ్ని. అందరి దగ్గరా చందాలు వసూలుచేసి రామాలయం కట్టించాను. నాలుగేళ్ల తర్వాత టీచర్ ఉద్యోగాన్ని వదిలేశాను.


రాజకీయాల్లోకి వచ్చాను. 1979లో ఊరికి కరెంటు స్తంభాలు వేయించాను. సిమెంటు రోడ్లు కూడా. ఊళ్లో ఉండగానే ఎమ్ఎల్ఎ అయ్యాను. మంత్రిగా కూడా పనిచేశాను. ఆ సమయంలోనే నలభైఎకరాల ప్రభుత్వ స్థలంలో ఊళ్లోని పేదలందరికీ ఇళ్లు కట్టించాను. పాత ఊరు పక్కనే కొత్త ఊరు వెలసింది. పంచాయితీ అయింది. నేను మంత్రిగా ఉన్న సమయంలోనే అంటే 1985లో మండలాల ఏర్పాటు జరిగింది. మా ఊరు మండల కేంద్రం అయింది. ఊరు రూపురేఖలన్నీ మారిపోయాయి. రాజకీయాల్లో పెద్ద పదవులు వచ్చాక హైదరాబాద్‌కి వచ్చేశాను. నేను రాజకీయాల్లోకి రాకముందు మా ఊరికి 250 ఎకరాల ఆయకట్టు ఉండేది. దాన్ని నేను 2800 ఎకరాలకు తీసుకొచ్చాను. ఒక పక్క నాగార్జునసాగర్ కెనాల్, శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్, మరో పక్క కృష్ణ మంచినీరుతో ఊరంతా సస్యశ్యామలమైంది.


కుంట భూమిలేకపోయినా...
మండల కేంద్రం అయింది కాబట్టి ఇప్పుడు మా ఊళ్లో పదివేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదారు ప్రైవేటు కాలేజీలున్నాయి. ఐటి కాలేజ్, 30 పడకల ఆసుపత్రి, ఆలియా జంక్షన్ మార్కెట్‌యార్డ్, వ్యవసాయ రైతుల అభివృద్ధి కమిటీ హాలు...ఇలా అన్నీ వచ్చేశాయి. అయినా ప్రత్యేకంగా నా ఊరికి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మరో విచిత్రమైన విషయం ఏంటంటే నాన్న ఇచ్చిన నలభై ఎకరాల పొలంలో ఇప్పుడు నాకు కుంట భూమి కూడా మిగల్లేదు. చాలా వరకూ కొత్త ఊరు నిర్మాణమపుడు విరాళంగా ఇచ్చాను. మిగతాది అమ్మేశాను. ఇప్పుడు ఊళ్లో నాకు ఏమీ లేదు.


బంధువులు కూడా లేరు. అయినా ఊళ్లో ప్రజలందరూ నావాళ్లే. నా తర్వాత ఊరిని ఎవరు చూసుకుంటారు? దానికోసం ఒక ప్లాన్ వేశాను. అక్కడ రోడ్డుపక్కనే ఓ నాలుగైదు షాపులు కొందామనుకుంటున్నాను. వాటిపైన వచ్చే కిరాయితో ఊళ్లోని పేదల్ని, ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాలనేది నా ఆలోచన. ఆ డబ్బు ఎప్పటికీ ఊరి ప్రజలకే ఉంటుంది. ఈ విషయం గురించి మా అబ్బాయిలతో కూడా మాట్లాడాను. 'నేను పోయాక నా ఊరితో సంబంధాలు మీరు కొనసాగించాలి. ఎందుకంటే నా మూలం అదే కాబట్టి. నా ఊరి ప్రజలు కోరినంత కాకపోయినా...మీకు తోచినంత సాయం చేస్తూ, మేమున్నామనే ధైర్యం ఇవ్వండి చాలు, అదే నేను మిమ్మల్ని కోరే కోరిక' అని చెప్పాను. నన్నింతవాణ్ని చేసినందుకు అనుముల గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ం భువనేశ్వరి ఫొటోలు: రఫీ, భిక్షంరూథర్


వెన్నెల రాత్రులొచ్చాయంటే మా ఇంటిముందు ఓ ఇరవైమంది పిల్లగాళ్లు చేరేవారు. కబడ్డీ ఆటలు ఆడేవాళ్లం. చూడ్డానికి పెద్దోళ్లందరూ వచ్చేవాళ్లు. వాళ్లే ఆడియన్స్ అన్నమాట.


మా ఊళ్లో మట్టి రోడ్లయినా సిమెంటురోడ్డుకంటే బాగుండేవి. సీక్రెట్ ఏం లేదు...సూర్యుడి రాకముందే మా ఊరు ఆడోళ్లు చిక్కగ కళ్లాపి కొట్టి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవారు.


భోజనం విషయానికొస్తే జొన్నన్నం, కొర్రన్నం, మటన్ కూర, మీగడ పెరుగుతో నాన్న దగ్గరుండి పెట్టేవాడు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు. జానా...అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకునేవాడు నన్ను.


నాన్న పోయాక ఊళ్లో నాకు బంధువులెవరూ లేరు. నాకు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆ ఊరు నాదే కదా. అందువల్ల నేనున్నంతవరకూ నా ఊరి ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలను.

No comments: