Saturday, May 19, 2012

మహానేతకు ఇదా నివాళి?

ఈ రోజుల్లో మనం చూస్తున్నవి రాజకీయాలే కాదు! ప్రజాక్షేమం కోసం సర్వస్వాన్ని అర్పించి, నిజాయితీతో బతికి, అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయులెందరో రాజకీయాల్లో ఉండేవారు. వారిలో తెలుగునేలపై పుట్టి, యావత్ భారత ప్రజల జేజేలందుకున్న నీలం సంజీవరెడ్డి అగ్రగణ్యులు. నేడు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరిద్దాం.


"గాం«ధీ వంటి నైతిక విలువలున్న మహనీయుడూ, మహాత్ముడూ మళ్లీ పుట్టాలి. జాతీయ, ప్రాంతీయ సమస్యలన్నిటికీ అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. నా దగ్గర కొచ్చే జిల్లాల రాజకీయ నాయకులందరికీ నిక్కచ్చిగా చెపుతున్నాను-ఈ హత్యలేమిటి? పదవుల కోసం ఇంత నైతికంగా దిగజారటమేమిటి? ప్రజలను తక్కువగా అంచనా వెయ్యకండి. ఎప్పుడో ఒకసారి ఎదురు తిరిగి తగిన బుద్ధి చెపుతారు. జాగ్రత్త... ఏమిటీ కోట్ల సంపాదన? ఎందుకింత కూడబెట్టటం? బ్రతకడానికి ఇంత అవసరమా?'' అంటూ మాజీరాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్టీనేతలను నిలదీసేవారు. ఈ కాలంలో అలాంటి నేతలు కనిపించరు. అలాంటి హితవాక్యాలు మచ్చుకైనా వినిపించవు. కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదాయన. నిరాడంబరంగా జీవించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.


సి.ఎం. పదవి తృణప్రాయం
1914 మే 19వ తేదీన అనంతపురం జిల్లా అల్లూరులో రైతు కుటుంబంలో జన్మించిన ఈ మహానేత 18 సంవత్సరాల చిరు వయస్సులోనే సత్యాగ్రహం నిర్వహించటం ద్వారా వెలుగులోకి వచ్చారు. 25 సంవత్సరాల వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ ప్రొవెన్షియల్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శిగా ఎన్నికై 10 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 1940-45 సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం, వి.వి.గిరి తదితరులతో అనేకసార్లు జైల్లో సహజీవనం చేశారు. 1947లో భారత రాజ్యాంగ పరిషత్‌లో కీలక పదవిలో ఉండి, రాజ్యాంగ రచనలో ముఖ్యపాత్రను నిర్వర్తించారు.


1953లో ఉపముఖ్యమంత్రిగా, 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1959లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, 1962లో తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్సు రూట్ల జాతీయకరణపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావటంతో నెహ్రూ వద్దని ఎంతగా వారిస్తున్నా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించారు. కేంద్రమంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు. 1967లో లోక్‌సభ స్పీకరుగా ఆ పదవికే వన్నెతెచ్చారు. ఎమర్జెన్సీ తరువాత 1977 జూలై 13వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.


నిరాడంబరుడు నీలం
రాష్ట్రపతి భవన్‌లో ఉన్న 5 సంవత్సరాలూ బంగారు పంజరంలో బందీగా ఉన్నట్టు బాధపడిపోయేవారు సంజీవరెడ్డి దంపతులు. అన్ని వందల గదులున్న రాష్ట్రపతి భవనంలో కేవలం మూడు గదులను మాత్రమే వారి కోసం కేటాయించుకున్నారు. ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడటం నిజంగా నా అదృష్టం. 1996వ సంవత్సరం మే 19వ తేదీన అంకుల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి జన్మదినం సందర్భంగా- ఎప్పటిలాగే శుభాకాంక్షలు చెప్పాలని బెంగళూర్ ఫోన్ చేశాను. అంకుల్ ప్రేమపూరితమైన పిలుపు వింటుంటే కళ్ల నీళ్లు తిరిగాయి.


"వారం రోజులు శలవు పెట్టి రా కృష్ణా! మీ ఆంటీ కూడా ఎదురుచూస్తోంది''- సమాధానంగా కళ్లు వర్షించాయి. 50 సంవత్సరాల పైగా మా కుటుంబాల మధ్యన పెనవేసుకుపోయిన గాఢానుబంధం అటువంటిది. నా తండ్రి కాజ జగన్నాథరావు, సంజీవరెడ్డి అంకుల్ ప్రాణ స్నేహితులు. ఒక విధంగా చెప్పాలంటే-అంకుల్, మా ఆంటీ నాగరత్నమ్మగారూ-నాకు పెంపుడు తల్లిదండ్రులు.


నా కోరిక ప్రకారం అంకుల్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు(1962లో) కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో సీటు తెప్పించి-నాన్నగారితోబాటు స్వయంగా వచ్చి-నన్ను కాలేజ్‌లో అడ్మిట్ చేశారు. క్లినికల్స్ లోకి అడుగు పెట్టినప్పుడు స్వయంగా స్టెతస్కోప్ పంపించి ఆశీర్వదించారు. అతి చిన్న వయస్సులోనే నాన్నగారు శాశ్వతంగా దూరమైతే-ఇంటి పెద్దగా అండగా నిలిచారు. అంకుల్ రుణాన్ని నేను తీర్చుకోగలనా?


సర్వస్వం దేశం కోసం..
అంకుల్‌కు, దగ్గరవారికి ఆంటీనే స్వయంగా వంట చేసేవారు. తమ్ముళ్లతోసహా కొన్ని రోజులు రాష్ట్రపతి భవన్‌లో ఉండే అదృష్టం నాకు కలిగింది. అంకుల్ రామభక్తులు. వెంకటేశ్వరస్వామి భక్తులు కూడా. ప్రొద్దుటే స్నానం చేసి పూజ చేసుకునే బయటకు వెళ్లేవారు. తరిమెలలోని రామాలయంకు బావ నాగిరెడ్డితో కలిసి తరచుగా వెళ్లి ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. ఈ దేశం కోసం ఆ మహానేత ఎంతో చేశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన సర్వస్వం ధారపోశారు.


తుంగభద్ర, నాగార్జునసాగర్, శ్రీశైలం మొదలైన ఎన్నో ప్రాజెక్టుల ఆవిర్భావానికి నిద్రాహారాలు మాని కృషిచేశారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక-అనంతపురంలో ఉండగా, జ్ఞానీ జైల్‌సింగ్, వెంకట్రామన్, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్.టి.ఆర్ వంటివారు ఈ రాజనీతిజ్ఞుని సందర్శించి తగిన సలహాలను పొందేవారు. ఆయన తరచు నాతో అనేవారు, "కృష్ణా! మనిషన్న తరువాత కృతజ్ఞతా భావం ఉండాలి. అది లేనివాడు మనిషనిపించుకోడు''అని. కన్నకూతురిలా చూసుకున్న అంకుల్ వర్ధంతి సభలని ఇన్నేళ్లుగా నిర్వహిస్తున్నప్పుడు నాకనిపించేది... అనిపిస్తోంది...ఈ రాష్ట్రానికి ఎంతో చేశారే మహానుభావుడు... కాని, కనీస కృతజ్ఞతనేది చూపిస్తున్నారా ఎవరైనా?!


నివాళి ఇదేనా?
ఆయన చివరి రోజుల్లో ఒక కోరిక కోరారు. "నేను భారతీయుడిని. ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వాడిని కాను. అందుకే నా మరణానంతరం నేనెక్కడుంటే అక్కడే నా అంత్యక్రియలు జరిపించండి'' అని. ఆయన ఆఖరి కోరిక నెరవేరింది. ఎన్నో సంప్రదింపుల తరువాత, సుదీర్ఘ తర్జన భర్జనల తరువాత, చివరికి హైదరాబాద్‌లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.


అంతటి మహానేతకు, అంతటి త్యాగమూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, రాష్ట్ర ప్రజలూ అర్పించే నివాళి ఇదేనా? ఇంతేనా?! ఘనంగా నిర్వహించాల్సిన, చూపించాల్సిన కృతజ్ఞత తాలూకు చిహ్నాలేవీ? మే 19వ తేదీన ఈ త్యాగధనుని జయంతిని, జూన్ మొదటి తేదీన వర్ధంతినీ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, దేశాధినేత అయిన ఆ రాజనీతిజ్ఞుని చిత్రపటాన్ని జూబ్లీ హాల్లో ఆవిష్కరించాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాను-చేస్తూనే ఉంటాను. 
from: Andhrajyothi Daily

No comments: