Sunday, November 20, 2011

సువాసనల కాక్‌టెయిల్ - బీనాదేవి

http://www.eemaata.com/images/jan2010/SSusa.jpg
నూరేళ్ళ తెలుగు కథ
నూరేళ్ళంటే వయసైపోయింది
దానికి మళ్ళీ యవ్వనం తేవాలి
"60లో 20 ఎలా తేగలవు ఖదీరూ'' అన్నారు శ్రీశ్రీ

"జమానా బదల్ గయా సాబ్. ఇప్పుడు మేక్-అప్‌లో, ఫేస్-లిప్ట్‌లు, బ్యూటీ పార్లర్‌లు ఒకటేమిటి? 60లో 20 సునాయాసంగా తెప్పిస్తున్నారు. మనిషికి తెప్పించగా లేనిది కథకి తేలేనా ? నేనున్నా - నేనున్నానన్నారు'' ఖదీర్. ఇదొక యజ్ఞం
ఖదీర్ ఋష్విక్

నూరుమంది ప్రసిద్ధ కథకుల్ని ఏరాలి
వాళ్ళు రాసిన వాటిలో ఓ మంచి కథ ఏరాలి
అది చదివి, అర్ధం చేసుకోవాలి
విమర్శకాదు. విశ్లేషణా కాదు.
మరి?
అదే కథని అందరిచేత చదివించేలా తిప్పి రాయాలి.
ఖదీర్ ప్రతి రచయితలోనూ పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ బుర్రలో దూరిపోయి, "నీకంటే బాగా రాస్తాను చూడు'' అన్నారు.
రాశారు. ఎలా ఉన్నాయి?
ముళ్ళపూడి రాసిన "వెలుగు నీడలు'' సినిమా నవల చదివిన కాట్రగడ్డ నర్సయ్య గారు "ఇడ్లీ కంటే పచ్చడి బావుంది'' అన్నారు.
నాకు ఈ కథలన్నీ చదివాక అలాగే అనిపించింది.
అసలు కథని నామమాత్రంగా తీసుకొని దానికి చక్కటి ఆకారం, అలంకారాలు ఇచ్చి ముస్తాబు చేసి (మనీష్ మల్‌హోత్రాలా కథకి ఫ్యాషన్ డిజైనింగు చేసి) పాఠకుడి గుండెలోకి గురిచూసి వదిలారు. "తాంబూలాలు ఇచ్చేశారు. తన్నుకు చావండి'' అన్నట్టు " రాసి పారేసాను. చదివి చావండి'' అన్నారు.
పాఠకులు చదివారు
కాని చావలేదు.
"శభాష్'' అన్నారు
ఎవరో ఎందుకూ? నేనే అనుకున్నాను.
నా కథ "జలుబు చేసిందా?''ని ఎంత బాగా రాశారంటే "ఇంత బాగా రాయొచ్చా?'' అనిపించింది. ఓ వారం రోజులు కథ గురించి నిరంతర ఫోను స్రవంతి. "అది నేను రాయలేదు మొర్రో. అది ఖదీర్ రాశారు'' అని మొత్తుకున్నాను. పైగా టైటిల్ కూడా అతి రసవత్తరంగా "అసలే మొగుడు ఆపై జలుబు చేశాడు'' అని పెట్టారు.
నా పీత బుర్రకెందుకు తట్టలేదూ?
అసలు గమ్మత్తు
ఆ రచయిత కథ రాశాడే తప్ప ఖదీర్ అందులోంచి పీకిన భావాలు అతనికి లేకపోవచ్చు.
ఒప్పుకుంటారా ఖదీర్ గారూ!
ప్రతి కథ చివర చక్కటి కొసమెరుపు.
సమాజాన్ని ప్రశ్నించడం
పాఠకుడ్ని ఆలోచించమనడం
దీనికో చిన్న ఉదా : "ముత్యాల ముగ్గు'' సినిమాలో - కాలువలో లాంచీలో శ్రీధర్ వెళ్తున్నాడు. గట్టుమీద సంగీత చెట్లు కింద కూర్చుంది. పెద్ద అరటి బోదె పాపం దాని మానాన అది లాంచీ వెనక పోతోంది. కాని అది 'సంగీత జీవితం' అని ప్రేక్షకులు, పత్రికలు పొగిడాయి.
"నేనే పాపం ఎరగను బాబోయ్. అది డి.పి (దర్శకుడి ప్రతిభ) కాదు'' అన్నారు బాపు.
అలాగే రచయితకి రాని ఆలోచనలు, ప్రశ్నలు ఖదీర్‌గారికి వచ్చాయి.
వాటినే కథ చివర కొసమెరుపుల్లా వాడుకున్నారు.
"పంచ భూతాలను గుప్పిట బిగిద్దామని ప్రయత్నించిన వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. భూమిని జయిద్దామనుకున్న వాళ్ళ గతీ అంతే. భూమి ఇప్పుడు భరిస్తోంది. ఏదో ఒకనాడు ఒక్క క్షణం పాటు ఒళ్ళు విరుచుకుంటుంది. అప్పుడు మిగిలేది మరుభూమి. మన టూ బెడ్ రూమ్ ఫ్లాట్ విత్ హాల్ అండ్ కిచెన్ అదే'', అని శపిస్తారు ఖదీర్ "మురళి ఊదే పాపడు'' అన్న కథ చివర.
ఖదీర్ గారూ మీకు గుర్తుందా?
టాల్‌స్టాయ్ కూడా ఇలానే అన్నాడు.
"మనిషిక్కావల్సింది ఆరడుగుల నేల''
"దేవుడు మనిషికి రెండు చేతులిచ్చాడు బాగుపడమని. మనిషి ఆ రెండు చేతుల్తోనూ చెయ్యగలిగినంత విధ్వంసం చేశాడు.
యుగాంతానికి వేరే శకునాలక్కర్లేదు.
పిచ్చిక మాయమవడమే అతి పెద్ద దుశ్శకునం.
మనిషికి మూడింది.
ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకా మూడుతుంది
మూడాలి''
అంటారు ఆగెరి పిచ్చుక కథ చివర్న.
కొన్ని కథలు ఖదీర్‌లో ఆవేశం రేపాయి. ఈ సమాజాన్ని, అందుల్లో ఉన్న స్వార్ధపరుల్నీ దుయ్యబట్టారు. చేటతో గాకుండా మాటలతో చేరిగేసారు.
మరికొన్ని కథలు చదివి ఆలోచించమన్నారు.
"గొప్పవాళ్ళు ఒక్క రాత్రి మందు పార్టీలో పెట్టే ఖర్చుతో వంద మంది ముసలోళ్ళు చచ్చేదాకా బతకొచ్చు. వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎందుకున్నట్టు? వాళ్ళవి ఇంత చిల్లర బతుకులు ఎందుకైనట్టు?'' అని మనల్ని నిలదీసి అడుగుతారు. ఖదీరు గారూ! మీరు చదవలేదేమో. కుక్క "రోషనారాకి'' పెళ్ళి చేశాడు. ఆ పెళ్ళికి వైశ్రాయితో సహా అందరు రాజుల్ని ఆహ్వానించాడు. ఆ రోజుల్లో 60,000 పౌన్లు ఖర్చు అయిందిట. ఆ డబ్బుతో 12,000 మంది ఓ సంవత్సరం బతకొచ్చుట. దీన్నేమంటారు?
ఒళ్ళు బలుపు, డబ్బు పొగరు.
ముళ్ళపూడి భాషలో "కోటీశ్వరులు, కోటి చమత్కారాలు''.
ఖదీర్ గారిలో ఆవేశం, అసహనం కాకుండా నాకు మరో కోణం కూడా కనిపించింది.
ఏమిటది?
ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం, జాలి, సానుభూతి.
"కువైట్ సావిత్రమ్మ'' కథకు ఆయన ముక్తాయింపు ఎంత అద్భుతంగా ఉంది!
'స్త్రీ దేహం ఈ దేశానికి ఆదిమ పెట్టుబడి. ఐటమ్ సాంగ్‌ని చేసి ఆడిస్తున్నారు. బారుసీసా బ్రాండు కోసం అర్ధనగ్నంగా నిలబెడుతున్నారు. స్త్రీ మగాడి చేతిలో సిద్ధంగా ఉండే అగ్గిపుల్ల''.
" ఈ అగ్గిపుల్లే ఎప్పుడో అప్పుడు వాడ్ని
దావాగ్నిలా దహించేస్తుంది'' నా ముక్తాయింపు.
"మనం ఈ మధ్యనే జరిగినట్టు ఇలాంటి కథనే చదివినట్టులేదూ?'' అంటారు ఖదీర్, మల్లాది వారు రాసిన "సర్వమంగళ'' కథ చివర. "అంతేకాదు'' రెండు వక్షోజాలు, ఒక గర్భాశయం ఉన్నంత కాలం ఆడది అవస్త పడుతూనే ఉండాలా? మగాడు అవస్త పెడుతూనే ఉండాలా?'' అని బాధపడతారు. ఇలా రాస్తూపోతే మరో సంకలనం అవుతుంది.
ఖదీర్ కలానికి అన్నివైపులా పదునే.
సంపెంగ, సన్నజాజి, మల్లె, మాలతి, మరువం, దవనం, గులాబి - ఈ పువ్వులన్నిటికీ సువాసన ఉంటుంది.
అన్నీ కలిపి ఒకే మాలగా గుచ్చితే
అది సువాసనల కాక్‌టెయిల్
అదే ఈ నూరేళ్ళ కథ.
అంతేనా ఖదీర్ సాబ్!

- బీనాదేవి

No comments: