ఆయన ఫోటోలు మాట్లాడతాయ్

లైట్‌తో ఆడుకున్నారు
ఆయన దగ్గర పని నేర్చుకోవడమంటే కత్తి మీద సామే. మౌనంగా, చుట్టూ ఏం జరుగుతుందో గమనించనంత ఏకాగ్రతతో పనిచేసుకు పోతుంటారు. ఆయన కొద్ది మాటలతో చెప్పే మెళకువల కన్నా, పనిచేసే తీరులో నుంచి గ్రహించ గలిగితే బోలెడన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఫోటోలకు కుంచెనద్దవచ్చని ఆయన్ని చూసే తెలుసుకున్నాన్నేను. నాకూ ఆయనకీ గురుశిష్య సంబంధం కన్నా ఆత్మీయబంధమే ఎక్కువ.
ఫోటోగ్రఫీ మీదున్న అభిరుచితో నేను తీస్తున్న నేచర్ ఫోటోలు చూసి ఫొటో ప్రేమికులు 1990లో నన్ను ఆయనకు పరిచయం చేశారు. అది మొదలు కెమెరా భుజాన వేసుకొని ఆయన శిష్య బృందంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశాను. ఫోటోగ్రఫీలో లైటుని ఫర్‌ఫెక్ట్‌గా వాడుకోవడం కొందరికే అబ్బిన విద్య. అందులో ఆయన రారాజు. వాడుకొంటారనే కన్నా లైట్‌తో ఆడుకుంటారంటేనే బాగుంటుంది.
ఎన్నెన్నో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించడం ఆయనకే సొంతం. వర్క్‌షాప్‌లో ఒకే సబ్జెక్టుని ఫోటోగ్రాఫర్లు గుంపుగా వెళ్లి ఫోటోలు తీస్తుంటే ...అందరి దగ్గరా అదే ఫోటో కదా అని నేనో పక్కన నిలబడేదాన్ని. అది చూసి ' ప్రకృతిలో ఉండేది ఒకే సబ్జెక్టు. నీ దృష్టి కోణంలోనే మార్పు ఉండాలి. నువ్వేం చూస్తావ్, ఎలా చూస్తావ్ అనేది నీ సృజనాత్మక ఆలోచన, అభిరుచి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నా కళ్లు తెరిపించిన మహానుభావుడాయన.

ఒకే ఒక్కడు...
రాజా త్రయంబక్ రాజ్ గత తరంలో పేరొందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్. రాజన్‌బాబుకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. రాజా శిష్యుడినని చెప్పుకునేటపుడు కళ్లూ, మొహం కాంతివంతంగా వెలిగిపోవడం నేననేక సార్లు చూశాను.
రాజన్‌బాబు ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతితోపాటు సహజత్వానికి దగ్గరగా బతికే గిరిజనులంటే ఆయనకి ప్రాణం. ముఖ్యంగా అరకులోయ గిరిజనులతో ప్రత్యేక అనుబంధం. ఆ ఆత్మబంధువుల కోసం గత నలభై ఏళ్లుగా ఆ కొండలూ, లోయలూ ఎక్కి దిగుతూనే ఉన్నారు. అందమంతా ఆ గిరిపుత్రికల్లోనే ఉందని అనేకసార్లు చెప్తుండేవారు. 'అరకు' అంటే చాలు...ఏ అనారోగ్యమూ ఆయన్ని ఆపలేదు.

ఉత్సాహం ఉరకలేస్తుంది. అక్కడ వాళ్లకీ రాజన్ వచ్చారంటే చుట్టమొచ్చినంత సంబరం. నెలన్నర క్రితం 73వ ఏట కెమెరా తీసుకొని అరకు వెళ్లారంటే...అక్కడి గిరిజనులపై ఆయనకున్న ప్రేమని ఆర్థం చేసుకోవచ్చు. సహజత్వపు వేటలో భద్రాచలం అడవులూ, చత్తీస్‌గఢ్ కొండలూ, ఒడిస్సా గోండులూ ఆయన కెమెరా నుంచి తప్పించుకోలేదు.
నాగరికత పేరుతో గిరిజనులు సహజత్వం కోల్పోతున్నారని ఈ మధ్య కాలంలో ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ సహజత్వంలో తాదాత్మ్యం పొందడం కోసం లోపలి అడవుల్లోకి కెమెరాలతో ప్రయాణించిన సందర్భాలెన్నో. స్త్రీ శారీరక ఒంపులను ప్రకృతి అందాలలో భాగంగా చూపిస్తూ తనదైన టెక్నిక్‌తో అద్భుతమైన నగ్నచిత్రాలు తీశారాయన. ఆ ఫోటోలకు ముగ్ధులై ఇంగ్లాండ్‌లోని రాయల్ ఫొటోగ్రఫీ సోసైటీ 1987లో ఎఫ్ఆర్‌పీఎస్ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. రాష్ట్రంలో ఆ స్థాయి గౌరవాన్ని పొందిన ఫోటోగ్రాఫర్ అప్పటికీ, ఇప్పటికీ ఆయనొక్కరే.

అయినా, ఆయనెప్పుడూ తనకు డాక్టరేట్ ఉందని చెప్పుకోలేదు. చిన్న పని చేసి పదింతలు ప్రచారం చేసుకునే ఈ రోజుల మనిషి కాడాయన. ఆయనదొక ప్రత్యేక వ్యక్తిత్వం. తోచింది చేసుకుపోవడమే తప్ప ప్రచారం కోసం వెంపర్లాడలేదు. తాను తీసిన నగ్నచిత్రాలను ఒక స్థాయి కలిగిన ఫోటోగ్రాఫర్లకి క్లాసులో ప్రదర్శించడానికి కూడా ఇబ్బందిగా ఫీలవుతుండే వారు. తన దృష్టి కోణంలో నుంచి గాక మరోలా అర్థం చేసికొంటారేమోననే జంకు ఆయన్నెప్పుడూ పీడిస్తూ ఉండేది. స్లైడ్ షో జరిగినపుడల్లా టెన్షన్‌గా ఉండేవారు. 'ఎవరి ఆలోచనా స్థాయిని బట్టి వాళ్లు మాట్లాడుతుంటారు. వాళ్ల కోసం మీరు మెట్టు దిగి ఆలోచించాల్సిన పని లేదని' అనే దాన్ని. 'సంస్కారాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సంస్కారం కావాలి' అనే కొడవటిగంటి మాటని గుర్తు చేసేదాన్ని.
జీవనసౌందర్యం

కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండి ఆయన్ని కలవడంలో కొన్ని నెలలు గ్యాప్ వచ్చింది. ఆయన నుంచి ఫోన్... "నేనింకా బతికే ఉన్నా... చచ్చిపోలేదింకా...ఇంటికి రావడం మర్చిపోవడమేనా'' అంటూ మాట్లాడారు. వెళ్లి కలిశాను. కానీ , 'నిష్క్రమణం' ముందే తెలిసినట్లున్న ఆ మాటలు ఇప్పుడు మనసుని మెలిపెడుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా...పెద్ద వాళ్లని చూసి రావడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి.

'మంచి ఫోటోగ ఫ్రీకి రూల్స్ లేవు.. కానీ మంచి ఫోటోగ్రాఫ్‌లు ఉంటాయ'ంటారు తెలుగు ఫోటోగ్రఫీకి అంతర్జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన రాజన్‌బాబు. ఈ రోజున దేశ, విదేశాల్లో అవార్డులు అందుకుంటున్న తెలుగు ఫోటోగ్రాఫర్లందరూ ఆయన శిష్యులే.
తనకు తెలిసిందంగా నవతరానికి నేర్పాలనే ఆయనలోని తపన అద్భుతం. క్లాస్‌రూమ్‌లో కూర్చోపెట్టి నేర్పితే ఫోటోగ్రఫీ రాదంటారాయన. వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభ నింపవచ్చన్నారు. దేశమంతా తిరిగి వేలాది వర్క్‌షాప్‌లు నిర్వహించారు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అయనను వెతుక్కుంటూ వచ్చాయి.
Alumni portfolio
కానీ ఆయన ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. పద్మశ్రీ వంటి పురస్కారాలు ఆయనకు దక్కకపోవడానికి అదే కారణం కావచ్చు. ఆయనకు పద్మ పురస్కారం మిగలకపోవచ్చు కానీ ఈతరం ఫోటోగ్రాఫర్లకు అపురూపమైన చిత్రాలు మిగిల్చివెళ్లారాయన. ఫోటోగ్రఫీలో అరుదైన డోపింగ్ కళ ఆయనకే సొంతం. ప్రపంచంలో పిక్టోరియల్ ఫోటోగ్రఫీ లోతులు తెలిసిన మహనీయుల్లో రాజన్ మొదటివరసలో ఉంటారు. ఈ రోజున ఆయన లేరు... ఆయన స్ఫూర్తి ఉంది.
- కె. విశేవందర్ రెడ్డి, హైదరాబాద్ ఫొటోసర్కిల్ కార్యదర్శి
ఇంకా ఇచ్చేవారు!
ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి తొమ్మిదిన, మళ్లీ మూడు వారాల క్రితం ఫ్యామిలీ ఫంక్షణ్‌లో ఎంతో ఆనందంగా కనిపించిన ఆయన ...కేర్ హాస్పిటల్ బెడ్‌లో అచేతనంగా పడి ఉండడం జీర్ణించుకోలేని దృశ్యం. ఏదో చెయ్యాలి... ఇంకా చెయ్యాలన్న తపన ఉన్న మనుషులు వెళ్లిపోతే నష్టం వ్యక్తుల కన్నా సమాజానికే ఎక్కువ.
మిత్రుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి అన్నట్లు "ఇప్పటి రోజుల్లో 73 ఏళ్ల వయసు ఏమీ చెయ్యలేని వృద్ధాప్యం మాత్రం కాదు. ఇప్పటికీ రాజన్ తాను ఇవ్వదల్చుకున్నది సమాజానికి ఇచ్చేసినా, ఇంకా ఇవ్వగలిగింది ఇచ్చుండే వారు. మెరికల్లాంటి యువ ఫోటోగ్రాఫర్లని సమాజానికి అందించ గలిగుండేవారు.
ముఖ్యంగా, ఈ రాష్ట్ర ఛాయాచిత్ర కుటుంబం ఇంటి పెద్దని కోల్పోయింది'' ఎక్కడికి వెళ్లినా ఆయన వెనకే ఉండి ఫోటోగ్రఫీ మెళకువలు నేర్చుకొని, అమెరికాలోనూ అదే విద్యని అభ్యసించి వచ్చిన ఆయన చిన్న కుమారుడు చిరంజీవి రమణలో రాజన్ గారిని చూసుకోవచ్చన్న చిన్న ఓదార్పు మాత్రమే నాలాంటి వారికి ఊరటనిస్తోంది.
ఇంకా ఇచ్చేవారు!
ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి తొమ్మిదిన, మళ్లీ మూడు వారాల క్రితం ఫ్యామిలీ ఫంక్షణ్‌లో ఎంతో ఆనందంగా కనిపించిన ఆయన ...కేర్ హాస్పిటల్ బెడ్‌లో అచేతనంగా పడి ఉండడం జీర్ణించుకోలేని దృశ్యం. ఏదో చెయ్యాలి... ఇంకా చెయ్యాలన్న తపన ఉన్న మనుషులు వెళ్లిపోతే నష్టం వ్యక్తుల కన్నా సమాజానికే ఎక్కువ.
మిత్రుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి అన్నట్లు "ఇప్పటి రోజుల్లో 73 ఏళ్ల వయసు ఏమీ చెయ్యలేని వృద్ధాప్యం మాత్రం కాదు. ఇప్పటికీ రాజన్ తాను ఇవ్వదల్చుకున్నది సమాజానికి ఇచ్చేసినా, ఇంకా ఇవ్వగలిగింది ఇచ్చుండే వారు. మెరికల్లాంటి యువ ఫోటోగ్రాఫర్లని సమాజానికి అందించ గలిగుండేవారు.
ముఖ్యంగా, ఈ రాష్ట్ర ఛాయాచిత్ర కుటుంబం ఇంటి పెద్దని కోల్పోయింది'' ఎక్కడికి వెళ్లినా ఆయన వెనకే ఉండి ఫోటోగ్రఫీ మెళకువలు నేర్చుకొని, అమెరికాలోనూ అదే విద్యని అభ్యసించి వచ్చిన ఆయన చిన్న కుమారుడు చిరంజీవి రమణలో రాజన్ గారిని చూసుకోవచ్చన్న చిన్న ఓదార్పు మాత్రమే నాలాంటి వారికి ఊరటనిస్తోంది.
No comments:
Post a Comment