Thursday, July 21, 2011

తెలివి * కథా సరిత్సాగరం


భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో నీతి కథలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక తరం నుంచి మరొక తరానికి విలువలను అందించటంలో ఈ కథల ప్రాముఖ్యం ఎనలేనిది. సంస్కృత కథాసరిత్సాగరంలోని కథలను ప్రముఖ రచయిత జగన్నాథ శర్మ తెలుగు పాఠకులకు సులభమైన శైలిలో అందించారు. అందరికీ ఆసక్తి కలిగించే ఓ కథ పాఠకుల కోసం...

అనగనగా రత్నపురం. అక్కడ రామకృష్ణుడు అని బాగా తెలివితేటలు గల ఓ వ్యక్తి ఉండేవాడు. తన తెలివితేటలతో ఎదుటి వ్యక్తుల్ని బురిడీ కొట్టించి బతుకుతుండేవాడు. చిన్న చిన్న బురిడీలతో రెండు పూటలా భోజనం, వేలకొలదీ వరహాలు మాత్రమే సంపాదించుకోగలిగేవాడు. ఇది సరికాదనుకున్నాడు. ఉన్న తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించాలి. కోటీశ్వరుడైపోవాలని కలలుగన్నాడు. కన్న కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకనాడు పెద్ద వర్తకునిలా వేష భాషలు మార్చుకుని రాజద్వారం దగ్గర నిల్చున్నాడు. భటులు అతన్ని చూశారు.

"ఎక్కణ్ణుంచి వచ్చారయ్యా మీరు?''అడిగారు. "సింహపురి నుంచి వచ్చాను. నా పేరు రామకృష్ణుడు. రత్నాల వ్యాపారిని. రాజుగారిని చూడాలనుకుంటున్నాను. అనుమతి ఇస్తారా?'' అడిగాడు.
"అనుమతి ఇవ్వాల్సింది మేము కాదు, రాజుగారివ్వాలి. అడిగి చూస్తాం'' అన్నారు భటులు. వెళ్ళి రాజుగారిని అడిగారు.
"ప్రవేశపెట్టండి'' అనుమతించాడు రాజు. రామకృష్ణుడు ఆనందంగా ప్రవేశించాడు. రాజుకి రత్నాలహారాన్ని కానుకగా అందజేశాడు.
చూశాడు రాజు దాన్ని. బాగున్నదని మెచ్చుకున్నాడు.
"చెప్పండి! నన్నెందుకు చూడాలనుకున్నారు?'' అడిగాడు రాజు.
"ఆ విషయం మీతో ఏకాంతంగా మాట్లాడాలి'' అన్నాడు రామకృష్ణుడు.
"మాట్లాడండి'' అంటూ తన ఏకాంత మందిరానికి దారి తీశాడు రాజు. అతన్ని అనుసరించి వచ్చాడు రామకృష్ణుడు.
"చెప్పండి ఏం మాట్లాడదలచారు?'' అడిగాడు రాజు.
"ఇంకేం లేదు మహా ప్రభూ! మీరు నాకో చిన్న సాయం చెయ్యాలి'' "తప్పకుండా చేస్తాం. ఏం కావాలో కోరుకోండి'' "సభలో అందరూ చూస్తుండగా మీరు నాతో ప్రతి రోజూ ఓ క్షణం మాట్లాడాలి. నేను అడిగినప్పుడు మాట్లాడాలి. ఇది నా ప్రార్థన'' అన్నాడు రామకృష్ణుడు.
"ఏం మాట్లాడాలి?'' "ఏదో ఒకటి...నా చెవిలో ఒకటి రెండు అంటూ పది వరకు అంకెలు లెక్క పెట్టండి చాలు! అయితే అవి నాకు మాత్రమే వినిపించాలి'' అన్నాడు రామకృష్ణుడు. చిత్రంగా ఉందే ఇతని కోరిక అనుకున్నాడు రాజు.
"మీరు ఊరికే అంకెలు లెక్కపెట్టనవసరం లేదు. మీరు నా చెవిలో పది అంకెలు లెక్కపెట్టినందుగ్గాను మీకు రోజూ నేను అయిదు వందల వరహాలిచ్చుకుంటాను'' అన్నాడు రామకృష్ణుడు.
"బాగుందిది'' అని పగలబడి నవ్వాడు రాజు.
"అయిదు వందల వరహాలిస్తానంటే చెవిలో పది అంకెలేం ఖర్మ! పాతిక అంకెలు లెక్కపెడతాను'' అన్నాడు రాజు.
అన్నట్టుగానే సభలో అందరూ చూస్తుండగా రామకృష్ణుడి చెవిలో అతనికి మాత్రమే వినబడేట్టుగా రోజూ రాజు పది అంకెలు లెక్కబెట్టేవాడు. అలా అంకెలు లెక్కబెట్టినందుగ్గాను రామకృష్ణుడు రాజుగారికి అయిదు వందల వరహాలిచ్చేవాడు. ఓ నెల గడిచింది. ప్రతిరోజూ రాజుగారు రామకృష్ణుడితో చెవిలో మాట్లాడడాన్ని గమనించిన సభలోనివారు, రామకృష్ణుడు తక్కువ వాడు కాదని, రాజుకి బాగా కావాల్సినవాడనే నిర్ణయానికి వచ్చారు. ఇంతలో కష్టానికీ నష్టానికీ దాచుకున్న డబ్బంతా కరిగిపోవడంతో రామకష్ణుడు కూడా ఓ నిర్ణయానికి వచ్చాడు. దాని ప్రకారం సభలో ఓ అధికారిని పదేపదే చూడసాగాడు రామకృష్ణుడు.
రాజు అంకెలు లెక్కపెట్టాక వారించి మళ్ళీ అధికారిని చూడసాగాడు. సభ ముగిసింది. రామకృష్ణుడు బయటకు నడిచాడు. అతన్ని అనుసరించాడు అధికారి.
"నేనేం తప్పు చేశానయ్యా, నా గురించి మీరూ రాజుగారూ మాట్లాడుకున్నారు'' అడిగాడు అధికారి.
"ఏం తప్పు చేశావో నేను చెప్పను! నీకే తెలుసు! అది నిజమా? కాదా అన్నది రాజుగారు నన్నడిగారు. తెలుసుకుని చెబుతానన్నాను.'' అన్నాడు రామకృష్ణుడు. అధికారి రాజుగారికి తెలియకుండా చాలా తప్పులు చేశాడు. ఏ తప్పన్నది అతనికి కూడా అంతు చిక్కడం లేదు. ప్రమాదం నుండి గట్టెక్కాలనుకున్నాడతను. ఆధారంగా రామకృష్ణుణ్ణే పట్టుకున్నాడు.
"తెలియక ఏదో తప్పు చేశాను. మీరే నన్ను కాపాడాలి'' అన్నాడు అధికారి. వెయ్యి వరహాలు రామకృష్ణుడికి లంచంగా ఇచ్చాడు. "సరే! నేను చూసుకుంటాను'' అన్నాడు రామకృష్ణుడు. మర్నాడు రాజుగారు అంకెలు లెక్క పెట్టాక బయటికి వచ్చాడు రామకృష్ణుడు. అధికారి అతన్ని అనుసరించి పరుగు పరుగున వచ్చాడు.
"రాజుగారు నిన్ను క్షమించేరు. నీకింకేం భయం లేదు'' అన్నాడు రామకృష్ణుడు. "కృతజ్ఞుణ్ణి'' ఆనందించాడు అధికారి. అప్పణ్ణుంచి అదే పనిగా సభలోని మంత్రుల్నీ, సామంతుల్నీ, రకరకాల అధికారుల్నీ రామకృష్ణుడు చూస్తూ ముందు రీతిలోనే లంచాలు గడించసాగాడు. పదికోట్ల వరహాలు సంపాదించాడతను. అనుకున్నట్టుగానే కోటీశ్వరుడయిపోయాడు. అయిన తను చేస్తోన్నది తప్పు అని తెలుసు. అక్రమార్జన ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయిందతనికి. రాజుని కలిసి జరిగిందంతా వివరించాడు.
"మీకు ప్రతిరోజూ అయిదు వందల వరహాలిస్తూ కూడా నేను పదికోట్ల వరహాలు సంపాదించగలిగాను. తప్పు చేశాను. పైగా ఆ పదికోట్ల వరహాలు అనేకమంది అనేక రకాలుగా మీ రాజ్యం నుంచి కొల్లగొట్టిందే! అంటే ఆ డబ్బు మీదే! మీరే స్వీకరించండి'' అని పదికోట్ల వరహాలూ రాజుకి అందజేశాడు రామకృష్ణుడు. అతనిలో వచ్చిన మార్పునకు ఆనందించి రాజు, రామకృష్ణుణ్ణి సామంతునిగా చేసుకున్నాడు. ఓ రాజ్యానికి అతన్ని రాజుని చేశాడు. అంతేకాదు, తనకి ప్రధాన సలహాదారునిగా కూడా నియమించుకున్నాడు. అందుకే అంటారు, నుయ్యి తవ్వుతోంటే కాసుల బిందెలు దొరికినట్టు తెలివిగలవాడు పెద్దగా కష్టపడనక్కరలేకుండానే డబ్బు సంపాదించగలడని!

పుస్తకం : కథా సరిత్సాగరం
రచయిత : ఎ.ఎన్. జగన్నాథశర్మ, పేజీలు: 164
ధర: 130, ప్రతులకు : విశాలాంధ్ర

No comments: