|
|
Showing posts with label art. Show all posts
Showing posts with label art. Show all posts
Monday, November 1, 2010
అభినవ తెలుగు సాహిత్యానికి మావయ్య - కాళ్ళకూరి నారాయణరావు
Saturday, September 25, 2010
జీవితం అందంగా, అర్థవంతంగా తీర్చి దిద్దుకునే గొప్ప కళ తెలిసిన వ్యక్తి .... డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్.
ఆయనకు సంచారమంటే మహా ప్రీతి

పచ్చని వరిచేలు, ఆనందంగా తలలూపే కొబ్బరిచెట్ల సోయగాలు, బకింగ్‌హామ్ కెనాల్ అందాల మధ్య ఉంటుంది తుమ్మపూడి గ్రామం. ఊరి చివర పాతకాలం నాటి అందమైన డాబా ఒకటి కనిపిస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న అరటి, సపోటా తోటలు, వరిచేలు మనల్ని పలకరిస్తాయి. పెద్దగేటు తీసుకొని వెళితే, నిర్మలత్వం మూర్తీభవించిన 75 ఏళ్ల శ్రీమతి సులోచనమ్మ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తారు. వరండాలో గోడకు సంజీవదేవ్ ఫొటో ఉంటుంది. ఆ పక్కనే ఆయన పెళ్లికి రోరిక్ బహుమతిగా పంపిన పెయింటింగ్ కనువిందు చేస్తుంది.
లోపలి గదిలో సంజీవదేవ్ వేసిన పెయింటింగ్స్ మనల్ని కదలకుండా చేస్తాయి. "డాబాపైకి వెళ్లి రండి... అక్కడ ఆయన వేసిన పెయింటింగ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అక్కడే కూర్చొని రాత్రంతా బొమ్మలు గీసేవారు. తెల్లారే సరికి అందమైన పెయింటింగ్ గీసి, ఎలా ఉందో చెప్పమన్నట్లు నా ముందు పెట్టేవారు'' అంటూ మనిషిని తోడుగా ఇచ్చి డాబాపైకి పంపారు సులోచన. డాబా గదిలోకి వెళ్లగానే అరుదైన సంజీవదేవ్ చిత్రాలు, సన్మానపత్రాలు, జ్ఞాపికల మధ్య పట్నాయక్ వేసిన పెద్ద సంజీవదేవ్ వర్ణచిత్రం. కిటికీ పక్కన పాతకాలం నాటి పెద్ద టేబుల్, కుర్చీలు. బహుశా అక్కడే కూర్చొని సంజీవదేవ్ రచనలకు ప్రాణం పోసేవారేమో? పెయింటింగ్స్ వేసేవారేమో? అనుకుని ఆ కిటికీ తెరిస్తే... అద్భుత లోకం అవిష్కరించుకుంటుంది.
*
ప్రకృతే సర్వస్వం
"పైన గది అంటే వారికి చాలా ఇష్టం. వరిచేలు, అరటితోటల మీదుగా బకింగ్‌హామ్ కెనాల్ అందాలను చూస్తూ చదువుకొనే వారు. రాసుకొనే వారు. ఆయనకు మరో ఇష్టమైన ప్రదేశం పక్కనే ఉన్న సపోటా తోట. రోజూ ఒక్కసారయినా తోటలో కాసేపు అలా పచార్లు చేయనిదే ఆయనకు మనశ్శాంతి ఉండేది కాదు. అందుకే ఆయన సమాధిని అక్కడే ఏర్పాటు చేశాం.
ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ఎన్నో చోట్ల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఆయన తీసిన ఫొటోలే మా మధ్య బంధాన్ని పెంచాయి. మాది కొల్లూరు మండలం దోనెపూడి. నాన్నగారు మద్రాసులో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు. నేను అక్కడే ఇంటర్ చదువుతున్న రోజుల్లో సెలవులకని దోనెపూడి వచ్చాను. పెళ్లిచూపులకు సిద్ధం కమ్మన్నారు. ఆ రోజుల్లో పెద్దవాళ్లు చెప్పింది చేయడమే కానీ వాళ్లకు ఎదురు మాట్లాడడం ఉండేది కాదు. ఆ నోటా ఈ నోటా తెలుసుకున్నదేమిటంటే అబ్బాయికి ఆస్తి పాస్తులున్నాయి. బాగా చదువుకున్నాడు. పుస్తకాలు రాస్తాడు అని. పెళ్లి చూపులయ్యాయి. ఆయన తను తీసిన ఫోటోల ఆల్బంను నాకు పంపారు చూడమని. అలా ఫొటోలు మా బంధాన్ని పెంచాయి. పెళ్లయింది. తుమ్మపూడిలో కాపురం పెట్టాం. మొదట్లో మావాళ్లలో కొందరు గొణిగేవారు. చేతిలో ఇంత కళ ఉండీ ఈ మారుమూల పల్లెటూర్లో ఉండడం ఎందుకు? మద్రాసు వస్తే ఎంతపేరు ... ప్రఖ్యాతి అని. నాకూ పల్లె వాతావరణం ఇష్టం. ఆయనకు ప్రకృతే సర్వస్వం. అందుకే ఆ ప్రస్థావన మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ రాలేదు.
రాహుల్ సాంకృత్యాయన్ మా ఇంట్లో వారమున్నారు

ఎక్కువగా తాత్త్విక ధోరణి కనిపించేది
నాకు తెలిసిన రోజు నుంచి చివరి శ్వాస తీసుకొనే దాకా ఆయన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పులేదు. ఎలాంటి ఉరుకులు, పరుగులు లేని జీవన శైలిని ఆయన సాధన చేశారు. సొంతం చేసుకున్నారు. కష్టంలో కూడా ఆయన కలవరపడేవారు కాదు. మొదట మాకు ఒక అబ్బాయి పుట్టి పోయాడు. నేను బాధపడుతుంటే, "చింతపడకు, ఏడాది తిరగకుండా వాడే మళ్లీ పుడతాడు'' అంటూ ధైర్యం చెప్పారు. అలానే జరిగింది. అలా ఆయనలో ఎక్కువ సందర్భాల్లో తాత్త్విక ధోరణి కనిపించేది. పిల్లలు జోగేంద్రదేవ్, మహేంద్రదేవ్‌ల చదువుల విషయంలో కూడా వాళ్ల స్వేచ్ఛను కాదనే వారు కాదు.
మొదట్లో ఆయన పెయింటింగ్స్ వేసేవారు కాదు. దృష్టి అంతా ఫొటోగ్రఫీ మీద ఉండేది. దేశంలో చాలా పట్టణాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు పెట్టేవారు. నేను కూడా వెళ్లేదాన్ని. ఎందరో ప్రముఖులు ఆయన్ని పొగుడుతుంటే ఆయన వినమ్రంగా ఉండేవారు. అంతటి నిగర్వి ఆయన. ఆ తరువాత పట్నాయక్, ఆచంట జానకిరాంల ప్రోత్సాహంతో పెయింటింగ్ మీద దృష్టి పెట్టారు. ఆసేతు హిమాచలం ఆయన చూసిన ప్రకృతి అందాలన్నీ ఆ పెయింటింగ్స్‌లో ప్రతిఫలించేవి.
అరుదైన జీవన శైలి ఆయనది

ఆయనకు సంచారం అంటే మహా ప్రీతి. పాతికేళ్లు నిండకుండానే హిమాలయాలన్నీ తిరిగి వచ్చారు. ఆ తరువాత కూడా ఆయనలో భ్రమణకాంక్ష తీరలేదు. తరచూ కులూమనాలి వెళ్లే వాళ్లం. ఆ వాతావరణం, ప్రకృతి అందాల్ని ఆయన బాగా ఇష్టపడేవారు. స్విట్జర్లాండ్ వెళ్లాలని అనేవారు కానీ కుదరలేదు. మనుమరాళ్లు కావ్య, మానసి అంటే బాగా ఇష్టపడేవారు. మా అబ్బాయిలకు కళల పట్ల ఆసక్తి కలగలేదు కానీ మనుమరాళ్లకు ఆ లక్షణాలు అబ్బాయి. వాళ్లు వేసిన పెయింటింగ్స్ చూసి ముచ్చటపడేవారు. చివరి శ్వాస విడిచేరోజు కూడా ఆయన పనులన్నీ చేసుకున్నారు. టిఫిన్ చేశారు. వంట్లో కాస్త నలతగా ఉందన్నారు. తెనాలిలో ఉండే డాక్టర్ దక్షిణామూర్తికి కబురు పంపాం. వారు వచ్చేలోగానే కన్నుమూశారు.
ఆయన లేకపోయినా ఈ ఇంటి నిండా ఆయన జ్ఞాపకాలున్నాయి. ఈ రోజుకీ ఆయన తోటలో షికార్లు చేస్తున్నట్లే ఉంటుంది. మా పెద్దబ్బాయి జోగేంద్రదేవ్ వ్యాపారంలో స్థిరపడ్డారు. చిన్నబ్బాయి మహేంద్రదేవ్ ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నాడు. వాళ్లు అక్కడికి వచ్చి ఉండమంటారు. దశాబ్దాల ఈ బంధాన్ని వదులుకోవడం నా వల్ల కావడం లేదు. ఆయన రోరిక్‌కు రాసిన లేఖలను న్యూయార్క్‌లోని రోరిక్ మ్యూజియంలో పెట్టారు. ఈయన వేసిన పెయింటింగ్స్‌ను అమెరికాలో ఉండే ఎస్.వి. రామారావు గారు తీసుకెళ్లి, అక్కడ ప్రత్యేక గ్యాలరీలా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆయన తిరిగిన నేల పరిమళాల్ని ఆస్వాదించేందుకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకాలను నిత్యనూతనంగా ఉంచుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
- టి. కుమార్
ఫోటోలు : బాబీ, చిలుమూరు
ఫోటోలు : బాబీ, చిలుమూరు
Subscribe to:
Posts (Atom)